Saturday, October 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిభజన, విద్వేషాల వందేండ్ల హంగామా

విభజన, విద్వేషాల వందేండ్ల హంగామా

- Advertisement -

ఆర్‌.ఎస్‌.ఎస్‌ శత వార్షికోత్సవం పేరిట సాగుతున్న శృతిమించిన ఆర్భాటాల మధ్య దేశం ఒక వికృత సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్న రాకేశ్‌ కిశోర్‌ అనే ఒక లాయర్‌ భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.గవాయ్ పై చెప్పు విసిరారు. ఒక పిటిషన్‌ను తిరస్కరించే సందర్భంలో జస్టిస్‌ గవాయ్ హిందూ మతాన్ని కించపర్చేలా మాట్లాడారన్నది ఆ లాయర్‌ ఫిర్యాదు. అయితే దిగ్భ్రాంతికరమైన ఈ ఘటనను ఏదో అత్యంత అప్రధానమైన అంశంగా చేసేందుకు బడామీడియా హద్దులన్నీ మీరిపోయింది. కేవలం కాగితాల కట్ట విసిరేశాడే గాని చెప్పుకాదని మసిపూసి మారేడుకాయ చేసేందుకు తనకు అలవాటైన రీతిలోనే ఈ మీడియా ప్రయత్నం చేసింది. మరి కొందరేమో ఇది తన మతభావాలను దెబ్బతీశారన్న ఆగ్రహంతోనే రాకేశ్‌ అలా ప్రవర్తించారని సమర్థించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎక్కడ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరిగినా సమర్థించేందుకు ఈ సాకు చెప్పడం బాగా అలవాటైంది కదా!

ఆర్‌.ఎస్‌.ఎస్‌ శత వార్షికోత్సవం పేరుతో జరుగుతున్న హడావుడికీ- దారుణమైన ఈ ఘటనకూ మధ్యన గల సంబంధాన్ని ఖచ్చితంగా ఎత్తిచూపడం కష్టమేమో గాని ఈ వికృత చర్య వెనక వున్న ద్వేషం, ప్రతీకారం గమనించకుండా వుండటం సాధ్యమయ్యేది కాదు. దేశ రాజకీయ జీవితంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పట్టు పెరగడంతో పాటు ఇలాంటి వికృత చర్యల పెరుగుదల ఏకకాలంలో జరుగుతున్నదనే వాస్తవం కూడా కాదనలేనిది. మహాత్మా గాంధీ హత్యనే దానికి అతిపెద్ద ఉదాహరణ. ఈ అమానుష హత్యకు దారితీసిన పరిస్థితులను రెచ్చగొట్టడంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్రకు సంబంధించి బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నా నిర్దిష్ట ఆధారాలు లేవనే కారణంగానే దాని కీలక బాధ్యులు బయటపడగలిగారు. గోల్వార్కర్‌ వంటి వారు ఆ విధంగానే తమ చేతికి మట్టి అంటకుండా చేసుకోగలిగారు. అప్పటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో స్పష్టంగా ఈ విషయం పేర్కొన్నారు. హిందూ మహాసభతో పాటుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ సాగించిన ప్రచారోద్యమం వల్ల ఏర్పడిన పరిస్థితులే మహాత్ముడి హత్యకు దారితీశాయని ఆయన రాశారు.

గతంపై చర్చకు దారి
వాస్తవానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ గొప్పతనం గురించి అదేపనిగా ఆకాశానికెత్తి చూపిస్తున్న ప్రయత్నమే దానిపై ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నది. ఆ సంస్థ సందేహాస్పద చరిత్రను ముందుకు తెస్తున్నది. ఆ సంస్థ మూల సూత్రాలేమిటి, విషపూరితమైన దాని సిద్ధాంతాలేమిటి, సావర్కర్‌ చెప్పిన హిందూత్వ అనేదాన్ని వాస్తవం చేసేందుకు ఆ సంస్థ అనుసరించే పద్ధతులేమిటి అన్నది చర్చకు పెట్టడానికి ఇదే మంచి అవకాశమైందని అనేకమంది భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం మూల సారాన్ని సావర్కర్‌ ‘హిందూత్వ మూల సూత్రాలు’ (ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ) అన్న గ్రంథంలో పొందుపర్చినా దానికి కార్యాచరణ సమకూర్చింది ఆర్‌.ఎస్‌.ఎస్‌ మాత్రమే. సావర్కర్‌ బోధించిన హిందూ రాష్ట్ర స్థాపన దిశగా అవసరమైన నిర్మాణ వ్యవస్థను అందించింది ఆరెస్సెసే. హిందూమతాన్ని రాజకీయాధికార సాధనంగా ఉపయోగించుకోవడానికి సావర్కర్‌ సమకూర్చిన సైద్ధాం తిక ప్రాతిపదిక ఇందుకు కొంచెం భిన్నమైనదనేది నిజమే. ఆయన చెప్పింది అసలు సిసలు రాజకీయ పథకమే. హిందూ మతాన్ని, హిందూత్వను గందరగోళపర్చడం కులాలతో ఛిద్రమైన హిందువులను ఐక్యం చేయడానికి ఆటంకమవుతుందని ఆయన అన్నారు.

అయితే కాలం గడిచిన కొద్దీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ముందుకు తెచ్చిన కోర్కెలు, నినాదాలు చూస్తే ఒక సామాజిక దృక్పథంగా బ్రాహ్మణవాదం అన్నది హిందూత్వ పద్ధతులకు వదలని జాడ్యమని తేలిపోయింది. ఉదాహరణకు ఆర్‌.ఎస్‌.ఎస్‌ అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’ స్వాతంత్య్రోద్యమ సమయంలోనే 1947 ఆగష్టు 15నే సాముదాయిక జాతి అనే మొత్తం దృక్పథాన్నే తోసిపుచ్చింది (‘ఎటువైపు’ అంటూ రాసిన సంపాద కీయంలో). ”జాతీయత అనే బూటకపు భావనల ప్రేరణతో మనం ఎంత మాత్రం ప్రభావితం కావద్దు. ఈ గందరగోళ భావన, వర్తమాన భవిష్యత్‌ సమస్యలను అధిగమించడానికి మార్గం ఒక్కటే. హిందూస్థాన్‌లో హిందువులు మాత్రమే జాతిగా వుంటారనే ప్రాథమిక వాస్తవాన్ని గుర్తించాలి. ఆ సురక్షితమైన సుదృఢ పునాదిపైనే జాతి నిర్మాణం జరగాలి. దేశమే హిందువులతో హిందూ సంప్రదాయాలతో, సంస్కృతి భావాలు, ఆకాంక్షలతో నిర్మితమవుతుంది”.

‘జాతీయ గీతం, పతాకం తప్పే’
ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆ సందర్భంలో జాతీయ పతాకాన్ని కూడా అవమానించింది. ఆ సంచికలోనే ఇలా రాసింది: కర్మ వశాన అధికారంలోకి వచ్చినవారు మన చేతుల్లో త్రివర్ణ పతాకం వుంచవచ్చు. కానీ హిందువులు దాన్ని ఎన్నడూ గౌరవించి తమదిగా భావించబోరు”. అదే ఊపులో ఆర్‌.ఎస్‌.ఎస్‌ జాతీయ గీతాన్ని ఆక్షేపించి ‘వందేమాతరం’ కావాలని వాదించింది. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠం నవలలోని ఆ గీతం మతభావ పూరితమనేది నిస్సం దేహం. ముస్లింలను, ఇస్లాంను అవహేళన చేసే ఆ గీతాన్ని తీసుకోవాలని చెప్పడం యాదృచ్ఛికమేమీ కాదు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఇదే వైఖరి అనుసరించింది. వలస పీడన నుంచి దేశ విముక్తి కోసం సాగిన ఉమ్మడి పోరాటంలో పాల్గొనకుండా దూరం వుండిపోయింది. ”కేవలం హిందువుల పట్ల మాత్రమే ప్రాథమికంగా మా కట్టుబాటు” అనేంత వరకూ వెళ్లింది. ఆ కారణంగానే ఆర్‌.ఎస్‌.ఎస్‌ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఐక్యం చేసే బదులు హిందువులను ఏకం చేసి సాయుధం చేయాలని పిలుపునిచ్చింది.

రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలోనూ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఇదే పల్లవి పాడుతూ వచ్చింది. దాన్ని భారతీయ తకు విరుద్ధమని ఖండనలు చేసింది. 1949 నవంబరు 30 ‘ఆర్గనైజర్‌’ సంచిక సంపాదకీయం కాలం చెల్లిన మనుస్మృతినే రాజ్యాంగంగా స్వీకరించాలని చెప్పింది ”అయితే ప్రాచీన భారతంలోని విశిష్ట రాజ్యాంగ వికాసం గురించిన ప్రస్తావనే మన రాజ్యాంగంలో లేదు. స్పార్టాలో లైకుర్గస్‌ లేదా పర్షియాలో సోలోమ్‌లకు చాలా ముందే మను శాస నాలు రూపొందాయి. ఈ రోజుకు కూడా మనుస్మృతిలో రాసినవి ప్రపంచం ప్రశంసలు పొందుతున్నాయి. ఉన్నఫళాన విధేయతనూ అనుగుణ్యతనూ పొందగలుగుతున్నాయి. కాని మన రాజ్యాంగ పండితుల దృష్టిలో మాత్రం అవి అస్సలు అక్కరకు రానివి”. అసలు గోల్వాల్కరే స్వయంగా రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించారు. ”మన రాజ్యాంగం భరించలేనంత జటిలమైంది. వివిధ పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి వేర్వేరు నిబంధనలు తీసుకుని కలిపి కుట్టిన అతుకుల బొంత తప్ప ఏకరూపత కలిగింది కాదు. అందులో మన స్వంతం అని ఖచ్చితంగా చెప్పుకోగలిగిందేమీ లేదు. ఆదేశిక సూత్రాల్లో మన జాతీయ కర్తవ్యం, గమనం గురించి మన జీవితాల కీలకాంశం ఏమిటనేదాని గురించి ఒక్క ముక్కయినా వుందా?” అన్నారు.

ప్రచారక్‌ ప్రధాని అయ్యాక..
ఈ విధంగా ‘ఒకే ప్రజలు ఒకే దేశం” అన్న దృక్పథాన్ని ఉక్కు కవచంలా బిగించేసిి హిందీ, హిందూ, హిందు స్థాన్‌ నినాదంగా ఏకపక్షంగా కుదించడమే ఆర్‌.ఎస్‌.ఎస్‌ సైద్ధాంతిక బోధనలలో ప్రబలమైన అంశం. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై కరుడుగట్టిన వ్యతిరేకత దానిది. కనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌ మౌలిక పునాది సూత్రం అమలు రెండునాల్కల మాటలతో కొనసాగించడానికి ఎలాంటి ఆటంకం ఎదురవలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారక్‌ దేశ ప్రధాని పీఠాన్ని ఆక్రమించే తరుణం వచ్చే వరకూ ఇదే ద్వంద్వభాషణ నడిచింది. ఆయనకు వచ్చేసరికి అసలు అస్తిత్వ రూపాన్ని దాచుకోవలసిన అగత్యమే లేకుండా పోయింది. ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగం పట్ల వారికుండే స్వతస్సి ద్ధమైన ద్వేషంతో పాటు ఆయన ప్రభుత్వం అదే ఫాసిస్టు తరహా హిందూ రాష్ట్ర భావనతో లోపలి నుంచే దాన్ని విచ్ఛిన్నం చేయాలని పథకాలు పన్నుతున్నది. రాజ్యాంగం పట్ల నిరంతరాయంగా ప్రకటించే విధేయత కేవలం కాలం గడపడానికి మాత్రమే. అదను చూసి దాన్ని కూడా వదిలించుకుంటారు.

అయితే ఈ విధంగా రెండు కాళ్లకూ రెండేసి చొప్పున చెప్పులేసుకోవడం అన్ని వేళలా కుదరదు. అందుకే ఆర్‌.ఎస్‌. ఎస్‌ను ఆకాశానికెత్తే ఈ శతవార్షికోత్సవ ప్రచార కాండకూ గత వందేండ్ల చరిత్రలో దాని నిర్వాకాల నిజా నిజాలకూ దారుణమైన దాని గతానికి పొంతన కుదరేది కాదు. జస్టిస్‌ గవారుపై దాడికి ప్రధానమంత్రి సుతిమెత్తని విమర్శలు చేసి…సిజెఐ సంయమనాన్ని, హుందాతనాన్ని ప్రశంసించినా మితవాద సోషల్‌ మీడియా బ్రిగేడ్‌ గవాయ్ పై వ్యక్తిగత దాడి కొనసాగిస్తూనే వుంది. వారి మనువాద మనస్తత్వం కారణంగా ఆయనపై ప్రత్యేకంగా విషం గక్కడాన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌ శతవార్షికోత్సవం వారి అనుమానాస్పద గతంపై ముసుగు లాగి పారేస్తుంది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య తత్వం సహా మన రాజ్యాంగ వ్యవస్థాపక సూత్రాలుగా వున్నాయి. అలాంటి రాజ్యాంగ మూలసూత్రాలను కళంకితం చేసేలా ప్రభుత్వం సాగిస్తున్న అప్రతిష్టాకర ప్రయత్నాలను బట్టబయలు చేసే సందర్భం ఇది. ఈ మొత్తాన్ని ఆమూలాగ్రం బహిర్గత పరచేందుకు అవసరమైన అధ్యయనాలనూ విశ్లేషణలనూ పాఠకులకు అందజేస్తానని పీపుల్స్‌ డెమోక్రసీ హామీ నిస్తున్నది.
(అక్టోబరు 8 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -