Friday, February 27, 2026
E-PAPER
Homeఖమ్మంఆద్యంతం అలరించిన శతాధిక బాలకవి సమ్మేళనం

ఆద్యంతం అలరించిన శతాధిక బాలకవి సమ్మేళనం

- Advertisement -

– కాదేదీ కవితకనర్హమంటూ గళమెత్తిన బాలకవులు
– భానూదయ సాహిత్యసంస్థ ఆధ్వర్యంలో శతాధిక బాలకవిసమ్మేళనం
– అశ్వారావుపేట వేదికగా అరుదైన సాహితీఘట్టం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

భానూదయ సాహిత్యసంస్థ,మండల విద్యాశాఖ అశ్వారావుపేట సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన శతాధిక బాలకవి సమ్మేళనం కొత్త ఒరవడిని సృష్టించింది.భానూదయ సాహిత్యసంస్థ అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు ఆధ్వర్యంలో మండల విద్యాధికారి పి.ప్రసాదరావు పర్యవేక్షణలో సాహితీ రంగంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 110 మంది పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులచే కవితలు వ్రాయించి వాటిని ఒకేవేదికపై పఠింపచేయడం నూతన శకానికి నాంది పలికింది. తెలుగుభాష మరుగున పడుతుంది అని బాధపడేవారికి ఊరట కలిగించింది.

భావి భారత పౌరులను సాహిత్యం వైపుకి నడిపిస్తే వారిలో కొత్త ఆలోచనలు నెలకొంటాయని ఈ కవి సమ్మేళనం నిరూపించింది.గత కొన్నిరోజులుగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సహకారంతో కవితా కార్యశాలలు నిర్వహించి విద్యార్ధులే కవితలల్లేలాగా తర్ఫీదునిచ్చారు.సాహితీరంగంలో మేమేమీ తీసిపోము అన్నట్లుగా అనేక అంశాలపై విద్యార్ధులు కవితలల్లారు. రవిగాంచని చోటు కవి గాంచును అన్న నానుడిని వాస్తవరూపంలోకి తెచ్చి అమ్మ, నాన్న, గురువు, చదువు,పుస్తకం,బడి, సంస్కృతి, సంక్రాంతి, సహకారం, మనస్సు, కోపం, చివరకు పిచ్చిమొక్క పై కూడా కవితలు వ్రాసి కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ వాక్కులకు ప్రాణం పోసారు. మొత్తంగా 11 ఆవృతాలతో ఈ కవి సమ్మేళనం రోజంతా కొనసాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ నుండి సెక్టరియల్ అధికారులంతా హాజరై ఆద్యంతం తిలకించి ఔరా అంటూ ఆశ్చర్యచకితులయ్యారు.నిర్వాహకులను ప్రశంసించారు.  

కాదేదీ కవితా వస్తువుకి అనర్హం కాదని
బాలల కలాలు కిలకిల మంటూ పలికిన వేళ
ఇది శతాధిక బాలల కవి సమ్మేళనం!

1. తల్లి ప్రేమ

తల్లి ఒడిలో మొదలయ్యే ప్రపంచం,
ఆమె మాటలో ముత్యాల మాధుర్యం.
కన్నీటి చుక్కలో కరుణా గంగా,
నవ్వులో నింగి నిండే వెలుగు.

2. తండ్రి బాధ్యత
తండ్రి చెయ్యిలో చెమట చుక్క,
మన భవిష్యత్తుకై వెలిగే దీపం.
నిశ్శబ్దంగా నిలిచే నీడవంటి
ఆశ్రయం – ఆయన ఆత్మీయత.

3. ప్రకృతి ఆకృతి
పర్వత శిఖరంలో పచ్చని గీతం,
నదీ తరంగంలో స్వేచ్ఛా గానం.
పూల పరిమళం పలికే సందేశం – 
ప్రకృతి మనకు ప్రాణ సఖి.

4. స్నేహం

ఒక చేయి మరో చేయిని పట్టినపుడు,
అది స్నేహం అనే సేతు.
పదాలు లేకపోయినా అర్థమయ్యే
మనసుల మధుర బంధం.

5. చెట్టు చేమ

చెట్టు నీడలో చల్లని ఊరట,
చేమలో జీవం,పచ్చని ఆశ.
ఒక మొక్క నాటితే నేల నవ్వుతుంది,
మన చేతుల్లోనే రేపటి శ్వాస.

6. రైతు కృషి

విత్తనంలో విశ్వాసం నాటి,
మట్టిలో కలల్ని నూరే వాడే రైతు.
ఎండలోనూ వానలోనూ నిలిచి,
అన్నపూర్ణగా దేశం నిలబెడతాడు.

7. బాధ – వేదన
కన్నీటి చారల్లో కథలుంటాయి,
వేదనలో వెలుగు దాగుంటుంది.
బాధను పద్యంగా మార్చినపుడే
మనసు మరింత బలంగా మారుతుంది.

8. విద్యా – విజ్ఞానం 

పుస్తకం ఓ పరిమళ పుష్పం,
పుటలలో ప్రపంచం విస్తారం.
విజ్ఞానం వెలుగు చూపే దారి,
విద్యే విజయానికి ఆధారం.
బాలల కలాల్లో కొత్త కవిత్వం,
వారి భావాల్లో భవిష్యత్తు నినాదం.
శతాధిక స్వరాలు ఒకే సారి పలికితే – అదో నూతనత్వం 
అది కేవలం సమ్మేళనం కాదు,

రేపటి సమాజానికి సాహితీ వెలుగుల ఉత్సవం

సాహిత్యానికి రంగులు లేవు.బేధాలు లేవు అంటూ అందరూ కే వేదికపై తమదైన శైలిలో గళాలు విప్పి తమ కవితల్ని వినిపించి ఆహూతులను అలరించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగితే విద్యార్దులలో నూతన ఉత్తేజం కలుగుతుందని సాహిత్యానికి విలువ పెరుగతుందని సాహితీవేత్తలు అంటున్నారు – కవి మడిపల్లి వెంకటేశ్వరరావు – అశ్వారావుపేట.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -