Sunday, September 14, 2025
E-PAPER
Homeకథమారిన ప్రపంచం

మారిన ప్రపంచం

- Advertisement -

తొంభైల చివరి రోజులు.
ప్రసాద్‌ ఉత్సాహవంతమైన యువ ఇంజనీర్‌. మొదటిసారి వీూ-ణఉూ కంప్యూటర్‌ చూశాడు.
బూడిద రంగు స్క్రీన్‌పై ఆకుపచ్చ అక్షరాలు మెరిసే కొద్దీ, అతని కళ్ళు ఆనందంతో వెలిగాయి. కీబోర్డ్‌పై వేళ్లు నత్యం చేస్తుంటే, ఆ యంత్రం అతనికి మాయాజాలంలా అనిపించింది.
మరికొన్ని ఏళ్లలోనే అరచేతిలో ఇమిడిపోయే సాధారణ నోకియా మొబైల్‌ ఫోన్‌ అతని జీవితంలో అడుగుపెట్టింది. ఒక బటన్‌ నొక్కితే దూరంలోని స్నేహితుడి స్వరం వినిపించడం అతనికి అద్భుతంగా అనిపించేది
సాంకేతికత అతని వత్తిని సులభతరం చేసింది. రిపోర్టులు రాయడం, అంచనాలు వేయడం. సహోద్యోగులతో సమాచారం పంచుకోవడం అన్నీ వేగంగా జరిగిపోయాయి.
అప్పటి నెమ్మదైన కంప్యూటర్ల నుంచి, ఇప్పుడు నీటిలా ప్రవహించే ఇంటర్నెట్‌ కనెక్షన్ల వరకు, సాంకేతికత ప్రసాద్‌ జీవితంలో ఓ అమూల్యమైన సహచరిగా, నిరంతరం పక్కనే ఉండే నీడలా మారింది.
కానీ కాలచక్రం తిరిగే కొద్దీ, అదే సాంకేతికత అతనికి ఓ కొత్త సవాలుగా మారింది.
2020లలో, కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు, జూమ్‌ సమావేశాలు అతని ఉద్యోగంలో అనివార్యమయ్యాయి. అయితే, అతని వినికిడి సమస్య ఈ సమావేశాలను ఒక పీడకలగా మార్చింది
ఒకప్పుడు పెద్ద సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే ప్రసాద్‌, ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే లెక్కలేనన్నిచిన్న చిన్న చతురస్రాల్లో మెరిసే ముఖాలను చూస్తే భయపడిపోతున్నాడు.
వివిధ స్వరాలు ఒకరు గట్టిగా, మరొకరు నెమ్మదిగా, ఇంకొకరు గొణుగుతూ.. అతని చెవుల్లో గందరగోళంగా మారేవి. ”ఎవరు మాట్లాడుతున్నారు? ఏం చెబుతున్నారు?” అని అతని మనసు ప్రశ్నించేది, కానీ సమాధానం దొరకని మబ్బులో చిక్కుకున్నట్లు అనిపించేది. అతని గది గోడలు కుంచించుకుపోయి, శబ్దాల బందిఖానాగా మారినట్లు అనిపించేది.
”డాడీ, జూమ్‌లో పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వింటే చాలు, మాట్లాడాలనిపిస్తే అన్‌మ్యూట్‌ చేయండి,” అని కూతురు శ్రేయ ఎంతో ఓపికగా ధైర్యం చెప్పేది. కానీ, అతని మెదడు ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. ఆ శబ్దాల గందరగోళాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అతని వేళ్లు మౌస్‌పై తడబడుతూ, అన్‌మ్యూట్‌ బటన్‌ను వెతకడానికి ప్రయత్నించాయి, కానీ అతని మనసు ఆ వేగాన్ని అందుకోలేక చీకటి తెరలో చిక్కుకుంది.
ఈ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. మీటింగ్‌లలో అతను నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు. కొన్నిసార్లు గుండెలను బరువెక్కించే శూన్యతలో మునిగిపోతూ స్క్రీన్‌ను చూస్తూ ఖాళీగా మిగిలిపోయేవాడు.
ప్రసాద్‌ ఆరోగ్య సమస్యలు అతని కుటుంబాన్ని తీవ్రంగా కలవరపరిచాయి. అతని భార్య మాలిని, కొడుకు అఖిల్‌, కూతురు శ్రేయ నిశితంగా అతన్ని గమనించారు. నడకలో తడబాటు, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేయడానికి గంటలు ఆలోచించినట్లు ఆగిపోవడం, అకస్మాత్తుగా మైకం వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు చిత్తవైకల్యం సంకేతాలని వైద్యులు నిర్ధారించారు.
ఓ రోజు సాయంత్రం పక్కన కూర్చుని ”స్వామీ, ఇక ఉద్యోగం కష్టం. నీ ఆరోగ్యం ముఖ్యం” అని మాలిని సున్నితంగా చెప్పింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె స్వరం మదువుగా ఉన్నా, అందులో ఉన్న ఆవేదన ప్రసాద్‌కి స్పష్టంగా అర్థమైంది.
”డాడీ, మీరు ఇంత కాలం కష్టపడ్డారు. ఇక విశ్రాంతి తీసుకోవడం మంచిదనిపిస్తున్నది. మీ కోసం జీవించకూడదూ..” అంటూ మంచి ఉద్యోగాల్లో కుదురుకున్న అఖిల్‌, శ్రేయలు అతన్ని ఓదారుస్తూ ప్రోత్సహించారు. వారి కళ్ళలో కనిపించిన ప్రేమ ప్రసాద్‌ మనసును కదిలించింది.
కానీ, ప్రసాద్‌ మనసు మొదట ఈ నిర్ణయాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. తన గత జీవితం గుర్తొచ్చింది. ఉద్యోగంలో బిజీగా గడిపిన క్షణాలు, సహోద్యోగులతో టీ కప్పుల చుట్టూ నవ్వులతో నిండిన చర్చలు, కొత్త ప్రాజెక్టుల కోసం చేసిన ప్రయాణాలు అతని కళ్ళముందు మెదిలాయి.
ఆ సాయంత్రం, బాల్కనీలో కూర్చుని, దూరంగా సూర్యాస్తమయం చూస్తూన్న అతని గుండెలో ఒక శూన్యత ఆవరించింది. ”నేను ఇక ఉపయోగకరంగా ఉండనా?” అని అతని మనసు ప్రశ్నించింది.
కానీ, మాలిని అతని చేయి పట్టుకుని, ”స్వామీ, నీవు మా ప్రపంచం. నీ సంతోషమే మాకు ముఖ్యం,” అని చెప్పినప్పుడు, అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. శ్రేయ, అఖిల్‌లు ”డాడీ, మేము ఎప్పుడూ నీ పక్కనే ఉంటాం” అని హామీ ఇచ్చారు. వారి ప్రేమ అతన్ని ఆ నిర్ణయం వైపు నడిపించింది.

చివరకు, 2023లో, అతను ఉద్యోగ విరమణ చేశాడు. ఈ నిర్ణయం అతనికి భారం అనిపించినా, పాత జీవితపు సంకెళ్లు తెగి, కొత్త గాలి పీల్చినట్టు వింతగా ఓ స్వేచ్ఛను, కొత్త ప్రారంభాన్ని ఇచ్చింది.

ఉద్యోగ విరమణ తర్వాత, ప్రసాద్‌ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. తండ్రి ప్రశాంతతను, ఒంటరితనాన్ని ఇష్టపడతాడని గ్రహించిన అఖిల్‌ ఓ విలక్షణమైన ఆలోచన చేశాడు.
ఓ చిన్న కార్వాన్‌ను స్వయంగా అందంగా తీర్చిదిద్దాడు. కార్వాన్‌ లోపల చిన్న బెడ్‌, ఒక చిన్న టేబుల్‌, మాలిని రంగురంగుల కర్టెన్లతో అలంకరించిన విండోలు… ఇవన్నీ ఒక కదిలే ఇంటిలా అనిపించాయి.
”డాడీ, ఇంట్లో ఒంటరిగా అనిపించినప్పుడు, ఈ కార్వాన్‌లో ప్రకతిలోకి వెళ్లండి. మీతో అమ్మను కూడా తీసుకెళ్లండి” అని చెప్పాడు అఖిల్‌. ఆ కార్వాన్‌ ప్రసాద్‌కి కదిలే స్వర్గధామంలా తోచింది.
మాలిని భర్త కోసం, నడి వయసులో డ్రైవింగ్‌ నేర్చుకుంది. ఆమె మొదటిసారి స్టీరింగ్‌ పట్టుకున్నప్పుడు, ఆమె వేళ్లు సన్నగా వణికాయి, కానీ ప్రసాద్‌ కోసం ఆమె గుండెలో ధైర్యం నింపుకుంది. ”స్వామీ, నీ కోసమే నేను డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నా” అని ఆమె నవ్వుతూ చెప్పేది. వారు హైదరాబాద్‌ సమీపంలోని వికారాబాద్‌, నర్సాపూర్‌ వంటి పచ్చని అడవులకు తరచూ వెళ్లేవారు. ఒకసారైతే ఏకంగా లక్నవరం వరకు వెళ్లారు.
ఈ అడవులు, గాలిలో తేలియాడే ఆకుల సన్నని సవ్వడి, కీచురాళ్ల నిరంతర సంగీతం, గుడ్లగూబల అరుపులు, దూరంగా వినిపించే కోయిల పాటలు ప్రసాద్‌కు అంతులేని ప్రశాంతతను ఇచ్చాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళ, ఆకాశంలో బంగారు, నారింజ రంగులు విరజిమ్ముతుంటే, ప్రసాద్‌ కార్వాన్‌ బయట కూర్చుని, గాలిని లోతుగా పీల్చేవాడు. ఇంటి గోడల బంధనం నుంచి బయటపడి, స్వేచ్ఛగా, సురక్షితంగా గడపడం అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
”మాలిని, ఇక్కడ స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంది. ఇంట్లో కూర్చోవడం కంటే ఇది ఎంతో బాగుంది” ఆనందంగా భార్యతో చెప్పేవాడు. అతని కళ్ళల్లో మెరిసిన తళుకు మాలిని హదయాన్ని ఆనందంతో నింపేది. ఓ బలమైన స్తంభంలా మాలిని ఎప్పుడూ ప్రయాణాల్లో అతని పక్కనే ఉండేది.
అతని ఆరోగ్య సమస్యలు పెరిగేవే కానీ తరిగేవి కాదని ఆ తల్లీ బిడ్డలతో పాటు ప్రసాద్‌కి కూడా తెలుసు. ఒక్కోసారి నడకలో తడబాటు, అకస్మాత్తుగా వచ్చే భ్రమలు ఆమెకు సవాళ్లుగా ఉన్నప్పటికీ, ఆమె ఎంతో ఓపికగా అతన్ని చూసుకుంది.
ఒక రోజు, సాయంత్రం అడవిలో కూర్చున్నప్పుడు ”నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నానా” అని బేలగా ప్రసాద్‌ అన్నప్పుడు, అతని చేయి పట్టుకుని, ”లేదు స్వామీ, నీవు సంతోషంగా ఉంటే, నా గుండె నిండిపోతుంది” అని చెప్పింది. ఆమె మాటల్లో ఉన్న ప్రేమ అతని హదయాన్ని వెచ్చగా తడిమింది.
ప్రసాద్‌ని తన పాత అభిరుచి వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ తిరిగి ప్రారంభించమని ప్రోత్సహించింది మాలిని. ఈ ప్రయాణాల్లో, కెమెరా చేతిలో ఉన్నప్పుడు, అతని మెదడు చురుకుగా మారేది, ఆలోచనలు స్పష్టమయ్యేవి.

”చూడు, మాలిని! ఈ నెమలి ఎంత అందంగా ఉందో ఈకలు ఎలా మెరిసిపోతున్నాయో!, ఎండిన మోడులో కూడా ఎంత అందమో!” అని ఫొటో తీస్తూ తడబడుతున్న గొంతుతో చెప్పినప్పుడు ఆ ముఖం వెలిగిపోయేది, ఓ చిన్న పిల్లాడిలా అతని కళ్ళల్లో మెరుపు ఉత్సాహం కనిపించేవి.

చిత్తవైకల్యం చీకటి నీడ ప్రసాద్‌ జీవితాన్ని సవాళ్లతో నింపింది. కొన్ని రాత్రులు అతను భ్రమలకు లోనయ్యేవాడు.
ఒక రాత్రి, చీకటి గదిలో అకస్మాత్తుగా లేచి, ”మాలిని, ఇంట్లో పాములు!” అని భయంతో అరిచాడు. అతని స్వరంలో ఉన్న ఆందోళన, చెమటలు పట్టిన అతని నీడ గోడపై కనిపించేది. మాలిని వెంటనే లేచి, అతని చేయి పట్టుకుని, ”స్వామీ, అక్కడ ఏమీ లేదు. అది నీ మనసు సష్టించిన భ్రమ,” అని సున్నితంగా ఓదార్చింది. ఆమె చేతి స్పర్శ, మదువైన స్వరం అతని భయాన్ని కరిగించాయి. కానీ, ఈ భ్రమలు, పీడకలలు అతన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేవి. అతను తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు.
ఒకసారి, పీడకలలో ఉండగా అకస్మాత్తుగా మాలినిని కొట్టాడు. ఆమె ముఖం నల్లగా కమిలిపోయింది. ఆ క్షణం బాధపడినా, ఆమె వెంటనే తేరుకుని, ”అయ్యో, స్వామీ! అది కల, నీవు నన్ను కొట్టలేదు” అని ఎంతో ప్రేమగా ఓదార్చింది.
”మాలిని, నేను నీపై కోపం చూపడం లేదు. కానీ నా నియంత్రణలో లేదు” అని ప్రసాద్‌ అపరాధ భావంతో కన్నీళ్లతో చెప్పాడు.
మాలిని, బాధను దాచుకుని, ”స్వామీ, అది కల. నీవు నన్ను కొట్టలేదు” అని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలిలో అతనికి ఒక సురక్షితమైన ఆశ్రయం దొరికినట్లు అనిపించింది. వైద్యులు సూచించిన మందులు, థెరపీలు ఈ లక్షణాలను కొంతవరకు తగ్గించాయి. కానీ, రాత్రిపూట చీకటి అతన్ని భయపెట్టేది.
”ఎవరో నన్ను చీకటి లోకంలోకి తీసుకెళ్తున్నారు” అని అతను గొణుగుతూ, చీకటిలో అటూ ఇటూ చూసేవాడు. ”నాకు భయమేస్తోంది. నేనొక్కడినే వెళ్ళను” అని ఏడ్చేసేవాడు.

అయినా, ప్రకతిలో గడిపే క్షణాలు, కెమెరాతో తీసే ఫొటోలు అతనికి అంతులేని స్వాంతన ఇచ్చాయి. ఆ కెమెరా అతని కళ్ళకు ఓ కొత్త దష్టిని ఇచ్చింది, లోకం ఇంకా అందంగానే ఉందని చెప్పింది.

ప్రసాద్‌ పరిస్థితిని, సవాళ్లను వైద్యుల సహాయంతో పూర్తిగా అర్థం చేసుకున్న మాలిని, శ్రేయ, అఖిల్‌ అతన్ని నిరంతరం ప్రోత్సహించారు. వారి ప్రేమను ప్రతి అడుగులోనూ చూపించారు.
”డాడీ, కెమెరా సెట్టింగ్స్‌ గుర్తించడం కష్టమైతే, ఆటోమేటిక్‌ మోడ్‌ వాడండి” అని శ్రేయ ఎంతో సున్నితంగా సలహా ఇచ్చింది.
”స్వామీ, ఈ పుస్తకం చదవండి, మీ మెదడుకు పని ఉంటుంది” అని మాలిని కొత్త పుస్తకాలు తెచ్చేది, అతని చేతుల్లో పెట్టి ప్రోత్సహించేది.
అఖిల్‌ పజిల్స్‌ ఇచ్చి, ”డాడీ, ఈ పజిల్‌ సాల్వ్‌ చేయండి చూద్దాం” అని చిన్న గేమ్‌ ఇచ్చి అతన్ని చురుకుగా ఉంచేవాడు. వారి ప్రయత్నాలు ప్రసాద్‌కు తాను ఒంటరిని కాదన్న భరోసానిచ్చాయి.
ఒక రోజు, ప్రసాద్‌ ఒక చిత్ర ప్రదర్శనకు భార్యతో కలిసి వెళ్ళాడు. అక్కడ చిత్రకారుడు ప్రదర్శించిన చిత్రాలు – రంగురంగుల ఆకాశం, రెక్కలు విప్పి ఎగిరే పక్షులు, అడవి దశ్యాలు అతనిలో ఆలోచనల విత్తనాలు నాటాయి. కొత్త స్ఫూర్తి నింపాయి.
ఆ స్ఫూర్తితో, మాలిని, పిల్లల సహకారంతో అతను ఒక ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాడు. అతని వైల్డ్‌లైఫ్‌ ఫొటోలు, పురివిప్పి నాట్యంచేసే నెమళ్ల చిత్రాలు, వివిధ పక్షులు రెక్కలు విప్పుకుంటూ ఎగురుతున్న క్షణాలు, చెట్టు కొమ్మపై కోయిల, అడవి దశ్యాలు అద్భుతమైన షాట్లు సందర్శకులను ఎంతగానో ఆకర్షించాయి.
”ఈ నెమలి ఫొటోలో జీవం ఉట్టిపడుతోంది!” అని యువ సందర్శకుడు అన్నప్పుడు, ప్రసాద్‌ ముఖంలో ఓ ప్రకాశవంతమైన చిరునవ్వు వికసించింది.
ఆ క్షణం అతని జీవితానికి ఓ కొత్త అర్థాన్ని, ఉద్దేశాన్ని ఇచ్చింది.
ప్రసాద్‌ జీవితం సవాళ్లతో నిండినప్పటికీ, కార్వాన్‌లో గడిపే ప్రశాంత క్షణాలు, కెమెరా లెన్స్‌ ద్వారా చూసే ప్రపంచం, కుటుంబ నిస్వార్థ ప్రేమ అతనికి ఓ కొత్త ఆశను ఇచ్చాయి. చిత్తవైకల్యం అతన్ని భౌతికంగా, మానసికంగా మార్చినప్పటికీ, అతను కొత్త జీవితాన్ని, దానిలోని ప్రతి క్షణాన్ని స్వీకరించాడు.
”నేను గతంలోని ప్రసాద్‌ కాకపోవచ్చు, కానీ ఈ కొత్త ప్రసాద్‌ కూడా జీవితాన్ని ఆస్వాదించగలడు” అని బంధు మిత్రులతో చిరునవ్వుతో అంటూ ఉంటాడు. ఆ చిరునవ్వులో అంతులేని సంతప్తి, కొత్త ప్రారంభపు స్ఫూర్తి ఉన్నాయి.
(ఈ కథ కేవలం ప్రసాద్‌ యొక్క పోరాటం గురించి మాత్రమే కాదు. ఇది చిత్తవైకల్యం గురించి సమాజంలో అవగాహన కల్పించడం, కుటుంబ మద్దతు, సమాజ మద్దతు ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం నా ఉద్దేశం.)

  • వి. శాంతి ప్రబోధ, 9866703223

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -