Wednesday, February 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండాలర్‌ ఆధిపత్యానికి చెక్‌!

డాలర్‌ ఆధిపత్యానికి చెక్‌!

- Advertisement -

‘ప్రపంచ కరెన్సీ’గా యువాన్‌ : జిన్‌పింగ్‌
అమెరికా కరెన్సీకి పోటీగా చైనా అడుగులు
‘కియుషి’లో జిన్‌పింగ్‌ కీలక వ్యాసం

బీజింగ్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ కోటను బద్దలుకొట్టడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు. చైనా కరెన్సీ అయిన ‘యువాన్‌’ను అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ‘బలమైన కరెన్సీ’గా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా, యువాన్‌ను ‘గ్లోబల్‌ రిజర్వ్‌ కరెన్సీ’గా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శనివారం కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారిక పత్రిక ‘కియుషి’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో జిన్‌పింగ్‌ ఈ విషయాలను వెల్లడించారు. ఆ వ్యాసంలో జిన్‌పింగ్‌ అమెరికా డాలర్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఉద్దేశం మాత్రం స్పష్టంగా అర్థమవు తోంది. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్‌పింగ్‌ డాలర్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లలో యువాన్‌ వాడకాన్ని భారీగా పెంచాలని ఆయన సూచించారు. చైనాను ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా మార్చడానికి ‘బలమైన కరెన్సీ’ అత్యవసరమని తేల్చిచెప్పారు.

పెద్దదే, కానీ బలం చాలదు
ప్రస్తుత చైనా ఆర్థిక పరిస్థితిపై జిన్‌పింగ్‌ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ”ప్రపంచంలో బ్యాంకింగ్‌ ఆస్తులు, విదేశీ మారక నిల్వలు, క్యాపిటల్‌ మార్కెట్‌ పరిమాణంలో చైనా అగ్రగామిగా ఉంది. మనది చాలా పెద్ద దేశం. కానీ ఆర్థికంగా ఇంకా ‘బలమైన’ దేశంగా మారాలి. చైనాను నిజమైన ఫైనాన్షియల్‌ పవర్‌ హౌస్‌గా మార్చడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ” అని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చైనా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ లావాదేవీల నెట్‌వర్క్‌ ‘స్విఫ్ట్‌’ అమెరికా గుప్పెట్లో ఉంది. దీనికి పోటీగా చైనా, రష్యాలు కలిసి ‘సిప్స్‌’ (సీఐపీఎస్‌- క్రాస్‌-బోర్డర్‌ ఇంటర్బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టం)ను ప్రోత్సహిస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్‌, గ్యాస్‌ కొనుగోలులో చైనా ఇప్పుడు యువాన్‌నే వాడుతోంది. గత ఏడాది చైనా తన మొత్తం 6.2 ట్రిలియన్‌ డాలర్ల విదేశీ వాణిజ్యంలో, దాదాపు మూడో వంతు వాణిజ్యాన్ని సొంత కరెన్సీలోనే జరిపింది.

ఇప్పటికే 50 దేశాలతో ఒప్పందాలు…
చైనా తన కరెన్సీని ప్రపంచవ్యాప్తం చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇప్పటికే 50 దేశాలతో చైనా ‘కరెన్సీ స్వాప్‌’ ఒప్పందాలు కుదుర్చుకుంది. యువాన్‌ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, యువాన్‌ విలువ ఇంకా డాలర్‌తో పోలిస్తే 25 శాతం తక్కువగానే ట్రేడ్‌ అవుతోంది. అయితే చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ‘యువాన్‌’ విలువ సాపేక్షంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటోంని, తన కరెన్సీ విలువ వేగంగా పెరగడం పట్ల చాలా అప్రమత్తంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

ట్రంప్‌ వార్నింగ్‌

బీజింగ్‌, మాస్కోలు ఇప్పుడు ‘బ్రిక్స్‌’ వేదికగా డాలర్‌కు చెక్‌ పెట్టాలని చూస్తున్నాయి. 10 దేశాల కూటమిగా మారిన బ్రిక్స్‌, ఉమ్మడి కరెన్సీని లేదా ‘బ్రిక్స్‌ పే’ సిస్టమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, డాలర్‌ ఆధిపత్యాన్ని సవాలు చేస్తే బ్రిక్స్‌ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపులకు చైనా లొంగడం లేదు. పాశ్చాత్య దేశాల ఆర్థిక నమూనాకు భిన్నంగా చైనా నమూనా ఉంటుందని జిన్‌పింగ్‌ తెలిపారు. ”దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే, బలమైన సెంట్రల్‌ బ్యాంక్‌ ఉండాలి. పటిష్టమైన ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆర్థిక కేంద్రాలు ఉండాలి. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండాలి. అప్పుడే మనం ప్రపంచ ప్రమాణాలను అందుకోగలం” అని ఆయన దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -