వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన మొదటి బ్యాచ్
‘నేల ఆరోగ్యం’ స్వచ్ఛంద సేవకులకు శిక్షణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
‘నేల ఆరోగ్యం’ కాపాడుకోవడానికి సమిష్టి కృషి అవసరమని, ఆరోగ్యకరమైన నేలలతోనే ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చని వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ‘నేల ఆరోగ్యం’ స్వచ్ఛంద సేవకుల మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. డిసెంబర్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయానికి సంబంధించి ఒక చాప్టర్‌ను పెట్టారని, అందులో 12 అంశాలను పేర్కొనగా, ఆరు అంశాలు నేరుగా వ్యవసాయానికి సంబంధించినవి కాగా, మరో ఆరు అంశాలు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినవని వివరించారు. అయితే వ్యవసాయానికి సంబంధించిన ఈ ఆరు అంశాల్లో మొదటి అంశమే ‘నేల ఆరోగ్యం’ సంరక్షణకు సంబంధించినదని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరికీ సాయిల్ హెల్త్ కార్డులను అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. రైతుకు ఆస్తి భూమి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ దిగుబడినీ పొందడం, ఆరోగ్యకరమైన పంటలను పండించడం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని నేలల ఆరోగ్యం కాపాడి ఆరోగ్యకరమైన పంటలు పండించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకుల శిక్షణా కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఈ మొదటి బ్యాచ్ శిక్షణను ప్రారంభించు కోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇందులో నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకులు నేర్చుకున్న అంశాలను తమ గ్రామంలోని ఇతర రైతులకు వివరించి ఒక్కో స్వచ్ఛంద సేవకుడు కనీసం 10 మంది రైతులకు అవగాహన కల్పించి, అందరూ భూసార పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సిఫారసు మించి రైతాంగం రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల నేల ఆరోగ్యం క్షీణించిందని, ఫలితంగా అనేక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయానికి వాడే రసాయనాల వల్ల భూసారంలో సముతుల్యత లోపించడమే కాకుండా గాలి, నీరు, వాతావరణం, విషతుల్యం అవుతున్నాయని, ఫలితంగా పక్షజాతులు, జంతు జాతులు అంతరించి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మానవజాతికి సైతం ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. భూసారం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు నిస్సారమైన భూములను ఇవ్వటమే కాకుండా అనారోగ్యకరమైన వ్యవసాయాన్ని వారసత్వంగా ఇచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ డి.రాజిరెడ్డి మాట్లాడుతూ.. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పలు పంటల విధానం ఎంతో అవసరమని అన్నారు. ఏకపంట విధానం వల్లనే నేల ఆరోగ్యం క్షీణించిందని అవసరానికి మించి రసాయన ఎరువుల వాడకం పెరగటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. ఉద్యాన పంటల విస్తీర్ణం సైతం పెంచుకోవాలని, అలాగే అంతర్ పంటల సాగుకు మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, పప్పు దినుసుల పంటలను వేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. శిక్షణకు హాజరైన నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకులకు విశ్వవిద్యాలయ గుర్తింపు కార్డులను వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ప్రొఫెసర్ జానయ్య, డాక్టర్ రాజిరెడ్డి, ఇతర వ్యవసాయ అధికారులతో కలిసి అందజేశారు. అలాగే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ వంతు కృషి జరుపుతామని స్వచ్చంద సేవకులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు విజరు కుమార్, నరసింహారావు, సరోజినీ దేవి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి వందన సమర్పణ చేశారు.
నేల ఆరోగ్యం కాపాడుకోవడానికి సమిష్టి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



