ఒక కుక్కను చంపడానికి ముందుగా దాన్ని పిచ్చికుక్క అని ముద్రవేయాలనేది ప్రఖ్యాత ఫ్రెంచ్ సామెత. ఇప్పుడు తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక అందుకు భిన్నమేమీ కాదు. ఆకునూరి మురళి ఆధ్వర్యంలోని కమిషన్ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో 35 పాఠశాలలు తిరిగి విద్యార్థులను, టీచర్లను, పేరెంట్స్‌ను కలిసి ఇంకా వివిధ ప్రదేశాల్లో 54 సెమినార్లు నిర్వహించింది. మొత్తం 434 సిఫార్సులతో కూడిన 350 పేజీల ఉద్గ్రంధంలో ప్రస్తుతం అమలులో ఉన్న విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే ఒక పథకరచన పక్కాగా చేసింది. బహుశా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఎజెండా మరుగునపడి కేవలం ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన నివేదిక ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది.
పాఠశాలలు ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని విద్యాకమిషన్లు ఏనాడో ఘోషించాయి. ఆ విధంగానే ప్రాథమిక సెకండరీ పాఠశాలలు గ్రామాలలో వాటి చుట్టుపక్కల నెలకొల్పబడ్డాయి. రాష్ట్రంలో నేడు 29 రకాల పాఠశాలలు నడుస్తున్నాయని బాధపడిన తెలంగాణ విద్యాకమిషన్ ప్రతి మండలానికి రెండు లేదా మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిలో ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే నడవాలని కూడా పేర్కొన్నది. ఒక్కొక్క పాఠశాలలో 1500 నుండి రెండువేల వరకు విద్యార్థులు ఉంటారు. ఇలాంటివి ప్రతి మండలంలో నెలకొల్పడం ద్వారా ఇప్పటిదాకా నడుస్తున్న 27 వేల పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఈ పబ్లిక్ స్కూల్స్‌లో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతున్నది. అంటే మాతృ భాషను ప్రాథమిక దశలోనే చంపేస్తున్నారా? మాతృభాషబోధనకు పనికిరానిదని ఇంత సిఫార్సులు చేసిన కమిషన్ దిగ్గజాలు తాము ఏ మీడియంలో చదివారు? మారిన పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం అవసరమే. కానీ, మాతృభాషను చిన్నపు చూపు చూడవలసిన పని లేదు. చిన్నతనంలో భావ వ్యక్తీకరణ, భావన నిర్మాణము మాతృభాషలోనే పటిష్టంగా జరుగుతాయనేది విద్యావేత్తల, మనోవైజ్ఞానిక వేత్తల దృఢ అభిప్రాయం. కానీ, మన కమిషన్ మాతృభాషను బోధనకు పనికిరానిదిగా భావించ డం దుర్మార్గం. అందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువ లేకపోవచ్చు లేదా ఇష్టపడక పోవచ్చు. బలవంతంగా రుద్దడం వల్ల అట్టి విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అవుతుంది.
అసలు అందుబాటులో ఉన్న 27వేల పాఠశాలలకు ఎసరు పెట్టడం దౌర్భాగ్యం. కొన్ని పాఠశాలల్లో వెయ్యికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అడ్మిషన్లు తక్కువగా ఉన్న పాఠశాలలను విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఉపాధ్యాయులకు కష్టం జరగకుండా విలీనం చేయవచ్చు. అంతేకాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ప్రాథమిక విద్యార్థులకు బోధించాలని చెప్పడం అర్ధరహితం. రాబోయే రోజులలో పదోన్నతుల కోసం పరీక్షలు నిర్వహించాలని సూచించడం అందరూ వ్యతిరేకించవలసిందే. అంటే సీనియారిటీ పనికిరానిదా? అనుభవానికి తగిన గౌరవం లేదా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా లభిస్తుంది? భవిష్యత్తులో కేవలం కాంట్రాక్టు టీచర్లు మాత్రమే నియమింపబడతారట. నిత్యం అభద్రతాభావంతో పనిచేసేవారు తమ సేవ ద్వారా విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? అంటే ఒక నాటికి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యారంగంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండరన్నమాట. ఇది విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే సలహాగా చెప్పవచ్చు. పనితనం లేని ఉపాధ్యాయులను ఐదేళ్ల తర్వాత ఉద్యోగం నుండి తీసివేయాలనడం లేదా తొలగించాలని సిఫార్సు చేయడం గందరగోళానికి దారితీస్తుంది. విదేశాలు సందర్శించి కమిషన్ చైర్మన్ సభ్యులు చేసిన అధ్యయనం ఇదేనా?
ఒకటి నుండి 12 వరకు అంటే ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టు వరకు ఒకే విద్యాలయంలో ఒకే వాతావరణంలో చదువుకుంటుంటే విద్యార్థులకు విసుగు ఏర్పడుతుంది. రకరకాల వయసుల వారితో సమస్యలు వస్తాయి. కమిషన్ ఇవేవీ పరిగణలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దుకు సిఫార్సు చేసింది. అత్యుత్తమ సిలబస్ అందించి వేలాదిమంది విద్యార్థులను దేశ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఐఐటి, త్రిబుల్ ఐటీ, ఎన్‌ఐటి, మెడిసిన్ కోర్సులు చదవడానికి మార్గం ఏర్పరిచిన ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం సమంజసంగా లేదు. దాన్ని పాఠశాల విద్యలో కలపడం, అదేవిధంగా ప్రవేశ పరీక్షలు రద్దుచేసి ఇంటర్ మార్కుల ప్రాతిపదికన ఇంజనీరింగ్ ఫార్మసీ వ్యవసాయ బీఎస్సీ లాంటి కోర్సులకు అడ్మిషన్ కల్పించడం కూడా ప్రయివేటు కళాశాలలకు ఊతం కల్పించడమే, పరీక్షల్లో అక్రమాలకు తెరలేపడమే. ఇందువల్ల నాణ్యత విద్యాప్రమాణాలు ఆశించడం తప్పే అవుతుంది. అంతేకాకుండా పదవ తరగతి తర్వాత డిప్లమా చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ నివేదిక ఆశనిపాతమే. టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు కూడా రద్దు చేయాలని సిఫార్సు చేయడం వింతగా ఉంది. డిప్లమా హోల్డర్లు తొందరగా ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. కొందరు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశిస్తారు. వారికి ఈ నివేదిక సిఫార్సు గొడ్డలి పెట్టు లాంటిది.
పాఠశాలలకు రంగులు వేసి హంగులు ఏర్పరిస్తే నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయా? భవనాలు నిర్మిస్తే ఫలితాలు వస్తాయా? రాజకీయ నేతలకు, అధికారులకు కమీషన్లు మాత్రం వస్తాయి. స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన ‘ఆకునూరి’ వారి నుండి ఇంతకంటే ఏమీ ఆశిస్తాం? ఉపాధ్యాయులతో వారికి తగిన పని చేయించడం ద్వారా ప్రమాణాలు పెంచవచ్చు. వారికి వృత్యంతర శిక్షణ సమయానికి కల్పిస్తూ వారి పనిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ తగిన సూచనలు సలహాలతో వారి పనితనాన్ని మెరుగుపరచవచ్చు. ఎంతసేపు వారిని దోషులుగా, పని ఎగ్గొట్టే వారిగా చిత్రీకరించడం సరికాదు. వారి పనిపై ఏ మేరకు పర్యవేక్షణ సాగుతున్నది? వారికి సరి అయిన సూచనలి స్తున్నారా? ఎంఈఓ, డీఈవో పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండడమో లేక ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. వారికి ఫార్మాట్లు నింపడం, పుస్తక పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం లాంటి పనులతో తీరిక లేకుండా ఉన్నది. ఉపాధ్యాయ పోస్టులు నింపలేని ప్రభుత్వం పాఠశాలలో బోధనేతర సిబ్బందిని నియమిస్తుందని ఊహించగలమా? ఈ నివేదిక తయారీ ఒక పథకం ప్రకారమే సాగిందని చెప్పడానికి తార్కాణం కునారిల్లుతున్న గురుకులాలు. 120 పైగా విద్యార్థులు రకరకాల కారణాలతో మృతి చెందితే నష్ట నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే వాటికి ఉద్దేశపూర్వకంగా నిధులు విడుదల చేయకుండా బలోపేతం చేయకుండా ఆ వ్యవస్థను నీరుగార్చి దానికి రూ.20వేల కోట్ల బడ్జెట్‌తో ప్రత్యామ్నాయ ప్రయత్నం అంతర్లీనంగా జరిగిందని అర్థమవుతున్నది. కానీ, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం విచారకరం.
విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి. రెండేళ్లుగా నిలిపివేసిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలి. మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో ఉండాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించ కూడదు. పనిచేసే ప్రయోగశాలలు నెలకొల్పాలి. కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పాలి. పాఠశాలల్లో మౌలిక వసతులైన టాయిలెట్స్ మంచినీరు సౌకర్యాలు కల్పించాలి. ముందుగా ఉపాధ్యాయుల నైతికతను ఆత్మస్థైర్యా న్ని దెబ్బతీసే చర్యలు నిలిపివేయాలి. అన్ని వృత్తులను తయారు చేసే ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఇవ్వాలి. విదేశాలలో ఇస్తున్న సంగతి ఈ నివేదిక బయట పెట్టకపోవడం వ్యూహాత్మకమే. ప్రతిరోజు వారు చేసే పని ఒక అష్టావధానం శతావధానం లేక సహస్రావధానం లాంటి క్లిష్టమైన ప్రక్రియలకు సమానం. ఈ నివేదిక ద్వారా ఉపాధ్యాయ వృత్తిని రచ్చకీడ్చారు. సమాజంలోగౌరవంగా బతుకు సాగిస్తున్న టీచర్లను అప్రతిష్ట పాలు చేస్తున్నారు. పొద్దున లేస్తే ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పే ప్రభుత్వం విద్యకు ఏడు శాతం బడ్జెట్ మాత్రమే కేటాయిం చింది. దాన్ని 18 శాతానికి పెంచాలని నివేదిక పేర్కొనడం కేవలం సిఫార్సుగా మాత్రమే మిగులు తుందా? మబ్బుల్లో నీళ్లు చూపించి చేతిలో ఉన్న ముంతలోని నీళ్లను జారవిడుచుకోవడం తెలివి తక్కువ పని. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకఊడినట్లు ప్రభుత్వ రంగంలో ఇంతకాలం లభించిన ఉచిత నాణ్యమైన విద్య సమీప భవిష్యత్తులో మిధ్య కాబోతుంది.
శ్రీశ్రీ కుమార్
94403540902
విద్యావ్యవస్థను విధ్వంసం చేసే (క)మిషన్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



