ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మెన్ అతుల్‌జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మెన్లు, (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్, (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ రెండు రాష్ట్రాల నుంచి నలుగురు ఉన్నతాధికారులకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూడు నెలల్లో కమిటీ తన నివేదికను సమర్పించనుంది.
పోలవరం బనకచర్లతో పాటు కృష్ణా నది వాటాల విషయంలో ఏర్పడ్డ వివాదాలను పరిష్కరించడానికి 2025 జూన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే వివాదాలు పరిష్కారం కాక పోగా, ఇంకా పెరిగాయి. దానికి తోడు బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-2 (కేడబ్ల్యూడీటీ) కృష్ణా జలాల పంపకాల పున:పంపకంపై సెక్షన్ 3 ప్రకారం ఇవ్వాల్సిన అవార్డు గడువును కేంద్రం 31 జులై 2026 వరకు పెంచింది. అలాగే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడీటీ) గతంలో ఇచ్చిన అవార్డులో రాష్ట్రాల మధ్య స్పష్టమైన పంపకాలపై నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నది జలాలపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. తాజాగా వేసిన కమిటీతో ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.



