Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఉగ్రవాదంపై ఉమ్మడి వ్యూహం

ఉగ్రవాదంపై ఉమ్మడి వ్యూహం

- Advertisement -

మోడీ-నెతన్యాహు ఫోన్‌ సంభాషణ
భారత్‌-ఇజ్రాయిల్‌ల భాగస్వామ్యం బలోపేతంపై చర్చ
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా..

న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీతో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం వంటి విషయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సంభాషణపై ప్రధాని మోడీ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందించారు. ”నా మిత్రుడు నెతన్యాహుతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయనకు, ఇజ్రాయిల్‌ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాను. రాబోయే ఏడాదిలో భారత్‌-ఇజ్రాయిల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాం. ప్రాంతీయ అంశాలపై కూడా మా అభిప్రాయాలను పంచుకున్నాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మా ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాం” అని మోడీ పేర్కొన్నారు. మోడీ ఈ ట్వీట్‌ను ఇంగ్లీష్‌తో పాటు హెబ్రూ భాషలోనూ పోస్ట్‌ చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసం, భవిష్యత్‌ దృష్టికోణం, భారత్‌-ఇజ్రాయిల్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించాలనే లక్ష్యంతో ‘సున్నా సహనం(జీరో టాలరెన్స్‌)’ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గాజా ప్రాంతంలో శాంతి స్థాపనకు సంబంధించిన ప్రణాళిక అమలుపై నెతన్యాహు.. మోడీకి వివరించారు. ఈ నేపథ్యంలో, న్యాయసమ్మతమైన, దీర్ఘకాలిక శాంతి స్థాపన కోసం చేపట్టే ప్రయత్నాలకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించినట్టు సమాచారం. అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. మోడీ-నెతన్యాహు మధ్య చివరగా గత డిసెంబర్‌లో ఫోన్‌సంభాషణ జరిగింది. తమ సంభాషణకు సంబంధించి ‘ఎక్స్‌’లో మోడీ చేసిన పోస్ట్‌కు నెతన్యాహు స్పందించారు. మోడీకి కృతజ్ఞతలు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీతో ఆప్యాయమైన సంభాషణ జరిగిందని ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -