Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంతెలంగాణ భవిష్యత్‌కు దిక్సూచి

తెలంగాణ భవిష్యత్‌కు దిక్సూచి

- Advertisement -

2047 విజన్‌ డాక్యుమెంట్‌పై సీఎంకు
ఖర్గే, ప్రియాంక అభినందనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్‌ ఆవిష్కరించిందని ప్రశంసించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను సీఎం వారి నివాసాల్లో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీఎం వెంట మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్‌ షెట్కార్‌, మందాడి అనిల్‌ కుమార్‌, పోరిక బలరాం నాయక్‌ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ కొనసాగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అగ్ర నేతలు సీఎంను ప్రశంసించారు. అలాగే ఈ నెల 13వ తేదీన మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు అగ్రనేతలను ఆహ్వానించినట్టు సీఎం తెలిపారు.

సీఎంకు ఎంపీల అభినందనలు..
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఎంపీలు అభినందనలు తెలిపారు. అగ్రనేతలతో భేటీ అనంతరం మంత్రి వివేక్‌ వెంకట స్వామితో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు ఎంపీలు అభినందనలు చెప్పారు. దాదాపు గంట పాటు సీఎం పార్లమెంట్‌లోనే గడిపారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు సీఎం రేవంత్‌ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పార్లమెంట్‌ నుంచి నేరుగా ఎయిర్‌ పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి బయలుదేరి వెళ్లారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీఎం నివాళి..
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు డా.మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం వంశీ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నాయకులు రోహిన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ అని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -