Monday, May 5, 2025
Homeసోపతిఅమెరికన్‌ అర్బన్‌ జీవితంపైసమగ్ర విశ్లేషణాత్మక చిత్రం

అమెరికన్‌ అర్బన్‌ జీవితంపైసమగ్ర విశ్లేషణాత్మక చిత్రం

- Advertisement -

గులాబీలంటే ఎవరికి ఇష్టం ఉండరు. మంద్రమైన సువాసనలతోనూ రాజసంతోనూ నిటారుగా నిలిచి ఉండే ఆ పూలు ముళ్ళ మధ్యన అందంగా వికసించగల వాటి గుణం ఎంతటివారినయినా సమ్మోహనపరుస్తుంది. అందులోనూ ఎర్రటి గులాబీల సొగసు చెప్పనలివికాదు. అమెరికా అనే స్వప్నాల సౌధంలో హుందాగా కనిపించే జీవితాలు ఇలాంటి ఎర్ర గులాబీలవలే అందంగా హుందాగా దర్జాగా ప్రపంచాన్ని ఊరిస్తూ ఉంటాయి. అయితే ఈ ఎర్రగులాబీలు అందంగా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటి వేర్లు, కొమ్మలు ఎక్కువగా కుళ్ళిపోతాయి. దగ్గర నుండి చూస్తే ఆ పూల కింద అందవిహీనత కనిపిస్తుంది. కాకపోతే అలా అన్నిటినీ దగ్గరగా చూడగల నైపుణ్యం అందరిలో అలవడదు. ‘దగ్గరగా చూడండి’ (లుక్‌ క్లోజర్‌) అనే ట్యాగ్‌లైన్‌తో అందమైన అమెరికా నగర జీవితం, అందులో హుందాగా కనిపించే కుటుంబాల వెనుక ఉన్న మానసిక ఒంటరితనాన్ని చిత్రించిన సినిమా ‘అమెరికన్‌ బ్యూటీ’. ఆకర్షణీయమైన అమెరికా ఉన్నత మధ్యతరగతి కుటుంబాలలోని నిజమైన స్థితిగతులను వివరించిన ఈ సినిమా 1999 లో వచ్చి ఉత్తమ చిత్రంతో పాటు ఐదు ఆస్కార్లను గెలుచుకుంది.
‘అమెరికన్‌ బ్యూటీ’ సినిమా అమెరికన్‌ అర్బన్‌ సంస్కతిని, సామాజిక అంచనాల కారణంగా ప్రజలు అనుభవించే ఒత్తిళ్లను, అందం, గుర్తింపు అనే ఊబిలో పడి నలిగిపోయే మానవ మనసులను చర్చిస్తుంది. పాత్రల పునరుజ్జీవన ప్రయాణాలు, భ్రమలతో వారి నిత్య పోరాటాలు ఈ చిత్ర కథావస్తువు. మనుషులు పైకి చేసే ప్రదర్శనలు, వాటి వెనుక కప్పి పెట్టే వాస్తవికతల నడుమ, అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ, వారిపై సామాజిక నిబంధనల విధ్వంసక స్వభావాన్ని ఈ చిత్రం విశ్లేషిస్తుంది.
లెస్టర్‌ బర్న్‌హామ్‌ అనే ఓ మధ్యవయస్కుడు అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈయన భార్య కారోలిన్‌ రియల్‌ ఎస్టేట్‌లో పని చేస్తూ ఉంటుంది. వీరి కూతురు జేన్‌ టీనేజ్‌లో ఉంటుంది. లెస్టర్‌కు చేసే ఉద్యోగంలో జీతం తప్ప ఎటువంటి ఆకర్షణా లేదు. కారోలిన్‌ డబ్బు సంపాదించాలని, ఉన్నతంగా బతకాలని కోరుకునే స్త్రీ. ఇళ్ల అమ్మకాలపై డబ్బు సంపాదించడానికి నానా తంటాలు పడుతూ ఉంటుంది. దానిలో భాగంగా లేనివి ఉన్నట్లు చెప్పడం, ఎక్కువ లాభాలకు ఆశపడడం ఆమె నైజం అవుతుంది. దీనితో వారి సంసార జీవితం కూడా మెటీరియలిస్టిక్‌గా మారిపోతుంది. తాను చెప్పినట్లే ఇల్లు గడవాలనే పట్టుదలనే ప్రేమ అనుకునే స్థితికి ఆమె వస్తుంది. ఆమెతో జీవితం లెస్టర్‌కు రోత పుట్టిస్తుంది. ఆ ఇంట్లోని నాటకీయత జేన్‌కు అసహ్యం పుట్టిస్తుంది. ఆమె క్రమంగా తల్లితండ్రులకు దూరం అవుతూపోతుంది. జేన్‌లో తాను అందగత్తెను కాననే ఓ న్యూనతాభావం ఉంటుంది. ఆమె స్కూల్‌లో చీర్‌ లీడర్ల టీమ్‌లో అందంగా ఉండే ఆంజిలా హేర్సుతో స్నేహం చేస్తుంది. అంజిలాకు తన అందంపై ఎంతో నమ్మకం. తాను చిటికే వేస్తే ఎవరైనా తనకు పడిపోతారని ఆమె నమ్ముతుంది. తాను కొందరితో సెక్స్‌ జరిపానని బాహాటంగా చెప్పుకోవడం, జేన్‌ లాంటి వాళ్లకు జీవితం గురించి ఏమీ తెలియదన్నట్లు మాట్లాడడం ఆమె స్వభావం. ఆమె మాటల్లో జేన్‌కు ఆత్మవిశ్వాసం ధ్వనిస్తూ ఉంటుంది. దాని కోసమే ఆమెతో స్నేహం చేస్తుంది.
ఒకసారి ఓ మేచ్‌ చూడడానికి లెస్టర్‌, కారోలిన్‌లు స్కూలుకు వస్తారు. చీర్‌ లీడర్లుగా అక్కడ జేన్‌ ఆంజీలాలు కనిపిస్తారు. ఆంజిలాను మొదటిసారి చూసిన లెస్టర్‌ ఆమె పట్ల ఆకర్షణలో పడిపోతాడు. ఆమెను పొందాలనే కోరిక అతనిలో కలుగుతుంది. తన జీవితంలోని ఉదాసీనత, ప్రేమ లేని దాంపత్యం, రోజంతా ఇష్టంలేని పనులతో గడిపే అతని దినచర్య, వీటన్నిటికి మధ్య అంజిలా అతనికి స్వప్న సుందరిలా కనిపిస్తుంది. తన కూతురు స్నేహితురాలని తెలిసినా ఆమెపై కలిగిన ఆకర్షణ అతనికి తప్పనిపించదు. అప్పటి నుంచి ఆమె ఆలోచనే అతని లోకం అవుతుంది.
ఆంజిలా లెస్టర్‌ తనకు అర్షితుడయ్యాడని అర్ధం చేసుకుంటుంది. ఆమె దీనికి గర్వపడుతుంది. అతనికి కావల్సిన సంకేతాలనిస్తూ అతన్ని ప్రోత్సహిస్తుంది. ఇది గమనించిన జేన్‌కు ఇద్దరిపైనా కోపం వస్తుంది. వాళ్ల ఇంటి ముందు ఖాళీ అయిన ఇంట్లోకి సైన్యంలో పని చేసిన రిటైర్డ్‌ కల్నల్‌ ఫ్రాంక్‌ తన భార్యా కొడుకుతో దిగుతాడు. ఇతను ఇంట్లో క్రమశిక్షణ పేరుతో భార్యకు కొడుకుకూ జీవితాన్ని నరకప్రాయం చేస్తాడు. అతని దౌర్జన్యానికి మౌనంలోకి జారుకుంటుంది భార్య. ఏదీ అర్ధం కాని స్థితిలో నిర్వికారంగా ఆమె రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. తనలోని కోపం, వ్యక్తివాదం, తండ్రి అధికారం మధ్య నలిగిపోతున్న అతని టీనేజ్‌ కొడుకు రిక్కీ తనకు కనిపించిన ప్రతి అందాన్ని కెమెరాలో బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా అతను జేన్‌ ప్రతి కదలికలను రికార్డ్‌ చేస్తాడు. తనను రిక్కీ వీడియో తీస్తున్నాడని జేన్‌ ముందు కోపం తెచ్చుకుంటుంది. కాని తన పక్కన అందరూ అందగత్తె అని పొగిడే ఆంజీలా ఉన్నా ఆమెలో ఒరిజినాలిటీ లేదంటూ రిక్కీ జేన్‌నే వీడియో తీయడంతో ఆమె మెల్లిగా అతనితో స్నేహం చేస్తుంది. ఆ క్రమంలో ఆమెలోని న్యూనతాభావం కొద్ది కొద్దిగా మాయమవుతూ ఉంటుంది.
జేన్‌ రిక్కీ కి దగ్గరవడం, లెస్టర్‌ అంజీలాకు ఆకర్షితుడవడంతో ఆ ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య దూరం పెరుగుతుంది. తననేమాత్రం పట్టించుకోని రిక్కీ దగ్గర ఆంజిలా అభద్రతాభావానికి గురి అవుతుంది. దానితో లెస్టర్‌కు ఆమె ఇచ్చే సంకేతాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది.
ఆ ఇంటికి మరోపక్క ఒక హోమో సెక్చ్యువల్‌ జంట ఉంటారు. కొత్తగా ఆ వీధిలోకి వచ్చిన ఫ్రాంక్‌తో వాళ్లు పరిచయం పెంచుకుందామనుకుంటారు. కాని వాళ్ల గురించి తెలియగానే ఫ్రాంక్‌ కోపంతో రగిలిపోతాడు. ఈ ప్రకతి విరుద్ద జీవితం పట్ల అలా జీవించే వారి పట్ల అతనిలో కసి ఉంటుంది. దాన్ని గమనించి వాళ్ళు అతనికి దూరం జరుగుతారు. కొడుకు రిక్కీతో ఫ్రాంక్‌ కఠినంగా వ్యవహరించడం ఎక్కడ దాకా వెళుతుందంటే రిక్కీ సైక్రియాటిక్‌ హాస్పిటల్‌లో వైద్యం తీసుకుంటాడు. ఆ తరువాత బలవంతంగా మిలిటరీ స్కూల్‌ కు ఫ్రాంక్‌ అతన్ని పంపిస్తాడు. దీనితో తండ్రికి ఎదురు తిరగాలనే కసి రిక్కీలో అంతర్లీనంగా ఉంటుంది. గంజాయి తాగుతూ ఆ సిగరెట్లను చాటుగా అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అతను కొనుక్కునే వస్తువులకు పార్ట్‌ టైం జాబ్‌లతో వచ్చే జీతం ఆధారం అని తండ్రిని నమ్మిస్తూ ఉంటాడు.
ఆంజిలాతో పీకల్లోతు ఆకర్షణలో పడిపోయిన లెస్టర్‌, ఆమెను పొందాలన్నదే ధ్యేయంగా పెట్టుకుంటాడు. అతని జీవితంలోని డొల్లతనం అతనికి విసుగనిపిస్తుంది. ఆంజీలాపై ఈ ఆకర్షణతో అతనికి అంతులేని ధైర్యం కూడా కలుగుతుంది. దీనితో తనపై రోజూ అధికారాన్ని ప్రదర్శించే బాస్‌కు ఎదురు తిరిగి అతన్ని భయపెట్టి కావ్లసిన పాకేజి డిమాండ్‌ చేసి ఉద్యోగం వదిలేస్తాడు. ఇది భార్య్‌ కారోలిన్‌కు కోపం తెప్పిస్తుంది. భార్యకు లొంగి ఉండడం ఇక తన వల్ల కాదని ప్రకటిస్తూ, తన జీవితం తనకిష్టం అయిన రీతిలో బతుకుతానని ఆమెతో సవాలు చేస్తాడు. వచ్చిన డబ్బుతో తన ఎంతో ఇష్టం అయిన కార్‌ కొనుక్కుంటాడు.
ఒకసారి అంజీలా జేన్‌ల మధ్య లెస్టర్‌ ప్రస్తావన వస్తుంది. అతను ఎక్సర్సైజ్‌ చేసి ట్రిం గా తయారైతే అతనితో గడపడానికి తనకేం అభ్యంతరం లేదని ఆంజిలా జేన్‌తో అనడం లెస్టర్‌ వింటాడు. ఇక దానితో తన శరీరం పై శ్రద్ద పెడతాడు. అంజీలా కోసం ఎక్సర్సైజులు చేస్తూ ఆ వయసు వారి పాటలు వింటూ తన వయసును తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. రిక్కీతో స్నేహం పెంచుకుని అతని దగ్గర సిగరెట్లు కొనుక్కుని గంజాయి తాగడాన్ని ఎంజారు చేస్తాడు. భర్తపై తనకున్న అధికారం కూడా పోయాక జీవితంలో కెరోలిన్‌కి మరే ఉత్సాహం కనిపించదు. ఎవరిపైనో తెలియని కోపం ఏదో జుర్రుకోవాలని, అనుభవించేయాలన్న ఆత్రం ఆమెలో అసహనాన్ని పెంచుతాయి. దానితో తన బాస్‌తో శారీరక సంబంధం పెట్టుకుంటుంది.
లెస్టర్‌ చేస్తున్న పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి ఒక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనికి కుదురుతాడు. ఆ జీవితం అతనికి ఎంతో బావుంటుంది. అక్కడ పని చేస్తున్నప్పుడే భార్య అక్రమ సంబంధం గురించి అతనికి తెలుస్తుంది. ఏదో భారం దిగినట్లు అనిపిస్తుంది తప్ప అతనికి బాధ కలగదు. అంతకు ముందు ఆమెకు దగ్గరవలేకపోతున్నానే ఓ చిన్న గిల్ట్‌ అతనిలో ఉండేది. ఇప్పుడు అది కూడా పోయి మనసెంతో తేలికయిన భావన అతనికి కలుగుతుంది.
రిక్కీ తన సిగరెట్లు అమ్మడానికి లెస్టర్‌ దగ్గరకు వెళతాడు. వాళిద్దరినీ కిటికీలో నుండి చూస్తున్న ఫ్రాంక్‌ వాళ్ల మధ్య శారీరిక సంబంధం ఏర్పడిందని అనుకుంటాడు. తన కొడుక్‌ గే అని అలా డబ్బు సంపాదిస్తున్నాడని అనుకుని రిక్కీని కొడతాడు. తండ్రిలో ఒక అలజడీ, కోపం గమనిస్తాడు రిక్కీ. అతన్ని ఆ స్థితిలో చూడడం అతనికి బావుంటుంది. అందుకని తాను గే నని తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు. తండ్రి ఇంట్లో నించి గెంటేయడంతో స్వేచ్చ వచ్చినట్లు అతనికి అనిపిస్తుంది. జేన్‌ దగ్గరకు వచ్చి ఎక్కకైనా వెళ్లిపోదాం అని అడుగుతాడు. జేన్‌ దానికి అంగీకరిస్తుంది. అంజీలా ఎంత చెప్పినా ఆమె మాట వినకుండా రిక్కీతో ఇల్లు దాటుతుంది. ఫ్రాంక్‌ రిక్కీ వెళ్లిపోవడంతో కోపంతోనూ బాధతోనూ లెస్టర్‌ దగ్గరకు వస్తాడు. కాని ఆ వర్షంలో షెడ్‌లో ఎక్సర్‌ సైజులు చేస్తున్న లెస్టర్‌పై అతనికి కోరిక పుడుతుంది. అతన్ని ముద్దుపెట్టుకోవాలని అనుకుంటాడు. లెస్టర్‌ అతన్ని వారించి అది తప్పని చెప్పి ఇంటికి పంపిస్తాడు. అప్పుడు అర్ధం అవుతుంది ఫ్రాంక్‌ గే కోరికలు ఉన్నవాడని, వాటిని కప్పి పెట్టుకునే ప్రయత్నంలో క్రమశిక్షణ, నైతికత అంటూ జీవితాంతం నటిస్తూ గడిపేసాడని, ఆ నటనే కొడుకు భార్య దగ్గర క్రూరత్వంగా బైట పడుతుందని.
ఒంటరిగా ఇంట్లో దొరికిన ఆంజిలాతో లెస్టర్‌ సెక్స్‌ జరపాలనుకుంటాడు. ఆమెతో మంచం ఎక్కుతాడు. కాని తాను కన్యనని తన జీవితంలో అంతకు ముందు ఈ అనుభవం ఎదురవలేదని ఆ భయంలో ఆంజిలా బయటపెడుతుంది. అప్పటిదాకా సెక్స్‌బాంబ్‌గా ఆమె కేవలం గొప్ప కోసం నటించిందని లెస్టర్‌కు అర్ధం అవుతుంది. ఆమె కన్య అని తెలియగానే అతనికి ఆమెలో తన కూతురు కనిపిస్తుంది. అతనిలోని తండ్రి అనే భావన బయటకు వచ్చి ఆమెను తండ్రిగా హత్తుకుని ఇంటికి వెళ్లమని చెప్పి పంపిస్తాడు. అనుకున్నది జరగలేదే అన్న ఆశాభంగం కన్నా జీవితం అర్ధం అయిన తప్తి అతనిలో కలుగుతుంది. అందం, కోరిక, ఆనందం వీటన్నిటి వెనుక ఉన్న డొల్లతనం తెలుకున్న విజయగర్వంతో ఇంట్లోకి నడుస్తాడు లెస్టర్‌.
తన తండ్రి వయసు మరచి కామపిశాచిగా మారడం జేన్‌ సహించలేకపోతుంది. రిక్కి తో వెళ్లిపోతుంది కాని తండ్రిని హత్య చేస్తే బావుండనే కోరిక బయటపెడుతుంది. తన జీవితంలోని ఓటమికి భర్త చేతకానితనం కారణం అని నమ్మిన కారోలిన్‌ అతన్ని హత్య చేయాలని పిస్టల్‌ తో ఇంటికి బయలు దేరుతుంది. వారి కన్నా ముందుగా తనలోని బలహీనత బైట పడిందన్న కోపంతో ఫ్రాంక్‌ తన గన్‌ తీసుకొచ్చి లెస్టర్‌ని షూట్‌ చేస్తాడు. అతను అక్కడికక్కడే మరణిస్తాడు. చనిపోబోయే ముందు గోడకు తగిలించి ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను తప్తిగా చూసుకుంటాడు లెస్టర్‌. మరణం అతనికి ప్రశాంతతను ఇస్తుందనే తప్తి అతని ముఖంపై కనపడుతుందగా సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాపై ఎంతో విశ్లేషణ జరిగింది. ముఖ్యంగా గొప్పగా నివసించే అమెరికన్‌ సమాజం ప్రదర్శించే దర్పాన్ని, అందులోని వాస్తవికతను ఈ కథావస్తువు బహిర్గతం చేస్తుంది. ప్రదర్శన హోదాల మత్తులో అసహజమైన జీవనశైలికి అలవాటుపడి, అందులో ఆనందం లేదని ఒప్పుకోలేక, గొప్పగా ఉన్నాం అని చెప్పుకోవడాని చేసే ప్రదర్శనతో లోలోన విసుగు చెంది మార్పు కోసం వాళ్లు ఎన్నుకునే మార్గాలలో ఈ అక్రమ సంబంధాలు, మత్తు కోసం మద్యం, డ్రగ్స్‌, కొన్ని ప్రత్నామ్యాలు. లెస్టర్‌ కారోలిన్లు అటువంటి మార్గాల వైపే ప్రయాణిస్తారు. ఒకరిని మరొకరు ద్వేషించుకుంటూ అంతా బావున్నట్లు బైటికి ప్రదర్శన ఇస్తూ జీవించడం ఎంత రోతగా ఉంటుందో వాళ్ళ జీవితాలు నిరూపిస్తాయి. ఫ్రాంక్‌ అలాంటి నాటకాన్ని నిజం అని నమ్మించడానికి రాక్షసుడిగా మారి భార్యా కొడుకుల జీవితాలనే నాశనం చేస్తాడు. తనలోని గే కోరికలను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో అతని పూర్తి వ్యక్తిత్వమే వికతంగా మారిపోతుంది. చివరకు ఆ బలహీనత లెస్టర్‌ ముందు బయటపడిందని అతన్ని హత్య చేసేదాకా వెళ్తుంది. లెస్టర్‌ కరోలిన్‌ ఇద్దరూ కూడా ఇతరులను ఆకర్షించడానికే జీవించే మనుషులు. వాళ్ల నిజమైన కోరికలు ఆశలు మర్చిపోయి మర మనుషులుగా తయారవుతారు. తమలోని లోపాలను గుర్తించలేక ఒకరినొకరు ద్వేషించుకుంటూ మరో సంబంధంలో ఆనందం వెతుక్కునే ప్రయత్నం చేస్తారు.
సమాజంలో అందంపై ఉండే అభిప్రాయాలనూ ఈ సినిమా ప్రశ్నిస్తుంది. ఆంజీలా నిజానికి భయస్తురాలు. ఆమె శరీరమే ఆమెకున్న బలం. అందుకే దానితో చుట్టు ఉన్న వారిని ఆకర్షించాలని ప్రయత్నించి తనను తాను చులకన చేసుకుంటుది. తనకు సెక్స్‌ అనుభవం ఉందని చెప్పుకోవడం గొప్ప అనుకుంటుంది. తనకు తానే అబద్దాలను ప్రచారం చెసుకుంటుంది. ఇది ఆమె సెక్స్‌ అప్పీల్‌ను మగవారి దష్టిలో పెంచుతుందని నమ్ముతుంది. ఆమె అందానికి మోహితుడయిన లెస్టర్‌ ఆమెను సులువుగా దొరికే వస్తువుగానే భావిస్తాడు. అయితే ఆమెను పొందాలనే కోరిక అతనికి అంతులేని బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కాని అది కూడా ఓ అబద్దం అని ఆమె భయస్తురాలైన ఓ మామూలు టీనేజర్‌ అని తెలిసిన తరువాత ఆమె పట్ల తండ్రిగా మారతాడు. ఆమె కూడా తనలాగే అబద్దపు జీవితాన్ని అభద్రతా భావాన్ని కప్పు పుచ్చుకుని బతుకుతుందని తెలిసాక ఆమె పట్ల అతనిలో జాలి కలుగుతుంది. తాను మోహించిన అందం, తనను ఆకర్షించిన ఆమెలోని ఆ తెగింపు అబద్దాలని అర్ధం అయ్యాక అతనికి తాను చేయబోయే పని పట్ల అసహ్యం కలుగుతుంది. ఆంజీలా తన భార్యలాగే మరో కోణంలో అబద్దాన్ని నిజంగా నమ్మిస్తూ బతుకుతుంది. ఆ ఇద్దరూ అతనికి ఒకేలా అనిపిస్తారు. అందుకే గోడపై తమ ఫ్యామిలీ ఫొటోను చూసి ప్రేమగా నవ్వుకుంటాడు. ఆ నవ్వులో అతనికి ఏ కోపమూ, కోరికా ఉండవు. కేవలం జీవితం అర్ధం అయిన భావన కనిపిస్తుంది.
మనిషి ఆనందానికి సామాజిక విజయాలు తోడ్పడవని కారోలిన్‌ బాస్‌ జీవితం, ఫ్రాంక్‌ జీవితాలు నిరూపిస్తాయి.
సినిమాలో పాత్రలన్నిటిలోనూ గుర్తింపు సంక్షోభం, అర్థం కోసం అన్వేషణ కనిపిస్తుంది. లెస్టర్‌, కరోలిన్‌, రిక్కీతో సహా అందరూ లక్ష్యం లేని జీవితాలనే గడుపుతూ ఉంటారు. వారి నిజమైన వ్యక్తిత్వం నుండి విడిపోయిన భావనతో పోరాడుతూ ఉంటారు. రిక్కీ జీవితాన్ని అర్ధం చేసుకోవాలని, కనిపించిన ప్రతిదాన్ని రికార్డు చేస్తూ ఉంటాడు. గాలికి ఎగిరే ప్లాస్టిక్‌ బాగ్‌లో కూడా అతనికి అందం కనిపిస్తుంది. చనిపోయిన మనిషి గాజు చూపులోనూ అందం కనిపిస్తుంది. ఎంత అందవిహీనమైన ప్రపంచంలో అతను అర్ధం కోసం వెతుకుతున్నాడో అతను రికార్డ్‌ చేసే ప్రతి వస్తువూ నిరూపిస్తుంది. ఈ అలవాటు అతన్ని మరో కోణంలో అందాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
లెస్టర్‌ మిడ్‌-లైఫ్‌ సంక్షోభం జీవితంలో ప్రామాణికత కోసం చేసే అన్వేషణకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కరోలిన్‌ భౌతిక ఆస్తులు, హోదాల నడుమ, బాహ్య ప్రదర్శనల ద్వారా విజయాలను ధవీకరించుకోవడానికి అలవాటు పడుతుంది. అందుకే వాటి కోసం ఆమె అంతగా పాకులాడుతుంది. ఆ అవకాశాల కోసమే బాస్‌కు చేరువవుతుంది. ఇంకా అశాంతి పాలవుతుంది.
సామాజిక అంచనాలకు అనుగుణంగా ఉండాలనే ఒత్తిడి కారణంగా కూడా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతూ, మనసులో సంఘర్షణను అనుభవిస్తూ ఉంటాయి ఈ సినిమాలో పాత్రలు. అందమైన స్త్రీలకు ఎక్కువమంది ప్రియులు ఉండాలనే అసహజమైన టీనేజ్‌ అంచనాతో ఉంటుంది ఆంజీలా. జేన్‌ ఈ అంచనాల నడుమే తాను అందగత్తెను కాననే న్యూనతాభావంతో కొట్టుకుపోతూ ఉంటుంది. ఫ్రాంక్‌ తనలోని గే ని దాచిపెట్టాలని విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే చివరకు అతన్ని హంతకుడిగా మారుస్తుంది. వారి జీవితాలలోని ఈ అసహజమైన ఒత్తిడే వారిలోని శూన్యతకు కారణమవుతుంది.
సామాజిక నియమాల విధ్వంసక స్వభావం ఈ చిత్రంలో కనిపించే మరో కోణం. అమెరికన్‌ అర్బన్‌ కుటుంబ నిర్మాణంలో కఠినమైన లింగ పాత్రలు, అంచనాలను ఈ చిత్రం విమర్శిస్తుంది. ఇక్కడ వ్యక్తులందరూ ఆ సామాజిక నియమాల నడుమ అణచివేతను అనుభవిస్తూ కనిపిస్తారు. విజయం, ఉన్నతి, మర్యాద, లైంగికత, అందం లాంటి విషయాల వెనుక ఉన్న సామాజిక నమ్మకాల కారణంగా తమను తాము నిజాయితీగా వ్యక్తీకరించుకోలేకపోతూ సంఘర్షిస్తారు. తాము పరిపూర్ణ జీవితమని భావించేది నిజానికి ఆనందాన్ని వద్దనే సత్యం అర్ధం కాక కొందరు, అర్ధం అయి దాన్ని ఒప్పుకోలేక మరి కొందరు అలవాటుపడిన జీవితానికి దూరం అవడం ఓటమిగా భావించి మరి కొందరు, జీవితాన్ని ఇష్టపడే పంధాలో జీవించగల ధైర్యం లేని మరొకొందరు తీవ్రమైన అసంతప్తికి లోనవుతూ కనిపిస్తారు. అందుకే మరణిస్తున్నానని తెలిసిన లెస్టర్‌ ముఖంలో భయం కన్నా తప్తి కనిపిస్తుంది. అదీ ఈ చిత్రాన్ని ఎంతో విషాదభరితంగా మారుస్తుంది. సామాజిక ఆదర్శాల కోసం విధ్వంసక ప్రవర్తనను ప్రదర్శిస్తూ వ్యక్తిగత విషాదాలను అనుభవిస్తారు అంతా.
ఈ కథను దశ్య కథగా చెప్పడానికి దర్శకుడు సాం మెండిస్‌ వైవిధ్యమైన చిత్రీకరణను ఉపయోగించారు. కంచెలు, కిటికీ ఫ్రేములు, కంప్యూటర్‌ స్క్రీన్‌ నుండి లెస్టర్‌ ప్రతిబింబం అతను అనుభవిస్తున్న నిర్భందాన్ని సూచిస్తుంది. సినిమాలో ఎర్ర రంగును ఎక్కువగా ఉపయోగించారు. ఆ పాత్రలు ఉండే ఇళ్లు ఎర్ర ఇటుకతో ఉంటాయి. అలాగే ఎర్ర గులాబీలను విరివిగా ఉపయోగిస్తూ చివరకు శూన్యం వైపుకు తీసుకెళతారు. ఇది నిర్బంధం, పరాయీకరణ, స్వేచ్ఛ కోసం అన్వేషణ లాంటి ఇతివత్తాలను వివరిస్తాయి.
‘అమెరికన్‌ బ్యూటీ’ అనే టైటిల్‌లోనే భయంకరమైన సెటైర్‌ ఉంది. అందాన్ని ఆ సమాజం ఎలా నిర్వచిస్తుందో, దాని వెనుక వారి జీవితాలు ఎలాంటి చట్రాలలో బందీలవుతున్నాయో ఈ చిత్రం చర్చిస్తుంది. ఆధునిక నాగరిక సబర్బన్‌ సంస్కతిలోని చీకటి కోణాలను బహిర్గతం చేస్తుంది ఈ సినిమా. ప్రామాణికత కన్నా రూపానికి ప్రాధాన్యతనిచ్చే ప్రపంచంలో అర్థం కోసం మానవ సమాజం జరిపే అన్వేషణను అర్ధం చేసుకునే దిశగా ఈ పాత్రలు సహాయపడతాయి.
ఈ కథను రాసిన అలాన్‌ బాల్‌ ఆమీ ఫిషర్‌ అనే యువతి జీవిత కథతో ప్రేరణ పొందానని చెప్పుకున్నారు. ఈమె తన తండ్రి వయసున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతని కోసం అతని భార్యను చంపేసి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది. ఆ వద్ద ప్రేమికుని ప్రేమలో నిండా మునిగి ఉన్న ఆ మైనర్‌ బాలిక భార్య వల్ల తన జీవితం నరకం అవుతుందని, ఆమె చనిపోతే బావుండునని అతను పదే పదే ఆమె ముందు అంటుంటే అతనిపై ప్రేమతో ఈ హత్య చేసింది. ఈ సంఘటనలో ప్రేమ, ఆకర్షణ, కన్నా మించిన విషాదం ఉందని అలాన్‌ అనుకున్నారు. అప్పుడు ఆయన రాసుకున్న కథే ఇది. ఇందులో ఆంజిలా పాత్ర ఇంటి పేరు హాయిస్‌. ప్రఖ్యాత రచయిత వ్లాదిమిర్‌ నబొకోవ్‌ రాసిన లోలితా నవలలో లోలిత పూర్తి పేరు లోలితా హాజ్‌. అంజీలా ను తెరపై చూసిన వారికి లోలితా గుర్తుకు వచ్చి తీరుతుంది.
సామ్‌ మెండిస్‌కు ఉత్తమ దర్శకుడిగా, కెవిన్‌ స్పేసీకి ఉత్తమ నటుడిగా, అలాన్‌ బాల్‌కు ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లేకి, హాల్‌కు ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఆస్కార్లు లభించాయి. ఈ చిత్రం ప్రధానంగా దర్శకత్వం, రచన, నటన విభాగాలలో ఇతర అవార్డులకు నామినేట్‌ అయి గెలుచుకుంది కూడా. ఇది మలి వయసు పేమ కథ కాదు. సెక్స్‌ గురించి తీసిన సినిమా అంతకన్నా కాదు. సంక్లిష్టమైన అర్బన్‌ ట్రాజెడీని విశ్లేషించిన గొప్ప సినిమా.

  • పి.జ్యోతి,
    98853 84740
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -