అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జాతీయస్థాయిలో సమగ్ర కుల జనగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్‌ఏ) జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ జీ కిరణ్‌కుమార్, డాక్టర్ వాహినిబిల్లు రచించిన ”క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్” (కుల గణన, సామాజిక న్యాయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం) అనే పుస్తకాన్ని ఆదివారంనాడిక్కడి ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనలో అన్ని కులాల సామాజిక, విద్య, ఆర్థికస్థాయిల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. పుస్తక రచయితలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేయడం, సామాజిక న్యాయాన్ని మరింత లోతుగా స్థాపించడంలో కుల లెక్కింపు ప్రాధాన్యతను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదిస్తుందని తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, మేధావులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.కార్యక్రమంలో డి అశోక్, సురేందర్, గణేశ్, శివ, అరవింద్, లక్కీ, ప్రవీణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



