సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తి బుకహేౌస్, నవతెలంగాణ పబ్లింగ్ హౌస్ సంయుక్తంగా ప్రచురించిన ‘ఓ సోషలిస్టు ఆచరణ పథం’ కమ్యూనిస్టులు మాత్రమే కాదు, భారతీయతను అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఇందులో మార్క్సిజం, భారత రాజకీయాలు, సోషలిజం నిర్మాణం అనే మూడు భాగాలు వున్నాయి. ఇందుకోసం సీతారాం ఏచూరి రాసిన 805 వ్యాసాలను, 85 ప్రసంగ పాఠాలను, 17 నోట్సులను పరిశీలించినట్లు పుస్తక సంపాదకులు పేర్కొన్నారు. ఇంత విస్తారమైన శోధనతో ప్రచురించబడిన 200 పేజీల ఈ పుస్తకం మార్క్సిస్టు సైద్ధాంతికతో పాటు, భారతీయ భావనను సరిగా అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో సోషలిజం నిర్మాణం అవసరాన్ని, ప్రస్తుతం వున్న అవకాశాలను సీతారాం వివరించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. అత్యంత సులభ శైలిలో తెలుగు పాఠకులకు ఈ పుస్తకాన్ని అందించిన అనువాదకులు అభినందనీయులు.
మొదటి భాగంలో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, మావో జెడాంగ్ జయంతుల సందర్భంగా రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాల నోట్స్ నుండి మార్క్సిజం యొక్క శాస్త్రీయతను వివరిస్తాయి. ‘ఈ సిద్ధాంతానికి ఎవరూ ప్రతి ఘటించలేనంత శక్తి ఉంది, కారణం అత్యున్నత స్థాయి శాస్త్రీయతతో మానవ సమాజం అభివృద్ధికి సంబంధించిన నియమాలు అందులో వుండడమే’ అని దాని శాస్త్రీయ గొప్పతనాన్ని సీతారాం చెప్పారు. మనిషి బతికి వుండాలంటే కనీస అవసరాలు తీరాలి. అందుకోసం ఉత్పత్తి చేయాలి, ఈ క్రమంలో మనుషుల మధ్య అనివార్యంగా (ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా) సంబంధాలు ఏర్పడతాయి. అవే ఆ సమాజపు ఆర్థిక నిర్మాణం అవుతుంది. అందువల్ల జీవితాన్ని చైతన్యం నిర్ణయించదు, అందుకు భిన్నంగా జీవితమే చైతన్యాన్ని నిర్ణయిస్తుందనే మార్క్సిస్టు మౌలిక అవగాహానను ఆయన లోతైన అధ్యయనంతో సులభంగా వివరించారు. సామూహిక జీవితాల నుండే ప్రజా సంస్కృతి ఏర్పడుతుందని, కళాత్మాక, సృజనాత్మక ప్రజా జీవితం ఏర్పడుతుందని మార్క్స్, ఎంగెల్స్ రచనల నుండి అనేక భాగాలను వివరించారు.
మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి సీతారాం ఏచూరి రచించిన ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఉత్పత్తిలో కీలకమైన మానవ శ్రమ, అది ఉపయోగించే పరికరాల అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుంది. వీటిని వినియోగించే స్థితిలో ప్రజల మధ్య సంబంధాలు వుంటే సమాజం పురో గమిస్తుంది. అయితే వర్గ సమాజం ఈ పురోగతికి ఆటంకంగా మారి సంక్షోభానికి దారితీస్తుంది. అయితే సంక్షోభం ఏర్పడిన అన్ని సందర్భాలూ తప్పకుండా విప్లవానికే దారితీస్తాయని అనుకోరాదని, అప్పటి వర్గ పోరాటపు తీవ్రత మీద ఆధారపడి వుంటుందని సీతారాం చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టుక, పరిణామం, పతనం గురించి అవగాహనను పాఠకుల్లో కలిగిస్తుంది. సరుకు విలువలో శ్రమ పాత్ర గురించి క్లుప్తంగా సూటిగా ఆయన చెబుతారు. కార్మికులు ఎందుకు శ్రమను అమ్ముకుంటారు, యజమాని ఇచ్చే వేతనం లేదా కూలి చేసిన శ్రమకు కాకుండా శ్రమశక్తి మాత్రమే ఎందుకు ఇస్తారో చెప్పి దీని నుండి ఏర్పడే అదనపు మిగులు ఈ వ్యవస్థలోని అన్ని రుగ్మతలకు మూల మంటారు. కొద్దిమంది దగ్గర సంపద పోగుపడు తుంటే అత్యధిక మంది పేదరికంలో మగ్గడానికి మూల కారణం ఇదేనని కారల్ మార్క్స్ ప్రఖ్యాత గ్రంథం ‘కాపిటల్’ నుండి అనేక వివరణలు ఈ పుస్తకంలో వివరించాడు. రెండు ప్రపంచ యుద్ధాలకు, నేటి ప్రపంచీ కరణ-నయా ఉదారవాద విధానాలకు పెట్టుబడిదారీ వ్యవస్థ లాభం అనే ధనదాహామే కారణమంటారు.
మావో జెడాంగ్ గురించి రాసిన వ్యాసంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ప్రాధాన్యత గురించి తెలిపారు. ‘కమ్యూనిస్టు పార్టీ పనితీరు సజీవంగా ఉండాలంటే కమిటీల పనితీరు సవ్యంగా ఉండాలని, కమ్యూనిస్టులు నిరాడం బరంగా, వివేకవంతంగా, అతి సాధారణ జీవితం గడుపుతూ, ఎప్పటికప్పుడు బూర్జువా సిద్ధాంత ప్రభావం తన మీద పడకుండా కాచుకోవాలంటారు’. స్వీయ మానసిక ధోరణి ప్రమాదం గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసం వుంది. ‘ప్రజల నుండి నేర్చుకోవడం’ గురించి లీషావ్‌చి చెప్పిన విషయాలను ఇందులో గుర్తు చేసి పార్టీలో దిద్దుబాటు ఉద్యమం నిరంతరం కొనసాగాల్సిన అవసరాన్ని వివరిస్తారు. శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పి.కందయ్య స్మారక సభలో చేసిన ‘ప్రపంచీకరణ శకంలో సోషలిజం’ ప్రసంగం నేటి వర్తమాన పరిస్థితులను వివరిస్తుంది. ‘ప్రపంచీకరణ అంటే మెజారిటీ ప్రజానీకం మరింత దోపిడికి గురికాడం తప్ప మరొకటి కాదు’ ఆయన నిర్ధారించారు. నిర్దిష్ట పరిస్థితులో సోషలిజం నిర్మాణం గురించి లెనిన్, డెంగ్ జియావో పింగ్ చేసిన ప్రయోగాలు, వాటి పట్ల మార్కిస్టు పార్టీ వైఖరి గురించి ఆయన ఈ వ్యాసంలో వివరించాడు. మతం పట్ల మార్క్సిజం యొక్క అవగాహనను ‘మార్క్సిజం, మతం’ అనే వ్యాసంలో చెప్పారు. మతానికి, మతతత్వానికి వున్న తేడాను ఇందులో వివరించి మత విశ్వాసకుల నుండి మతో న్మాదులను వేరు చేయాల్సిన ప్రాధాన్యతను చెబుతారు.
రెండవ భాగంలో ‘నయా ఉదారవాదం, లౌకికతత్వం: భారతదేశంలో వామపక్షాల భవిష్యత్తు’ అనే వ్యాసం 2009 పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలు తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న సందర్భంలో రాసినది. దేశంలో వామపక్షాల భవిష్యత్తు భారత దేశ భవిష్యత్తుతో విడదీయలేనిదని నిర్ధారించారు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, ఆర్థిక జీవనంలో అసమానతలు ఉంటాయి’ అనే భాగాన్ని వివరిస్తూ ఈ అసమానతలకు వ్యతిరేకంగా చేయాల్సిన కృషిని గురించి, దేశంలో కుల సమస్య, మార్క్సిస్టుల అవగాహనను గురించి చెబుతారు. భూ సంస్కరణల ప్రాధాన్యతను వాటిని అమలు చేయాలంటున్న కమ్యూనిస్టులపై పాలకవర్గాల కుట్రలను పశ్చిమ బెంగాల్-సింగూర్, నందిగ్రామ్ అనుభవం నుండి వివరించాడు. ‘భారతదేశ భావన’ అనే వ్యాసంలో వాస్తవ భారత జాతీయతకు హిందూత్వ శక్తులు చెబుతున్న జాతీయత పూర్తి భిన్నమైనదన్నారు. ప్రజల్లో భారతదేశ భావన రూపొందిన క్రమంలో వామపక్షాల కృషి ఎంత కీలకమైందో చారిత్రక ఆధారాలతో సీతారాం వివరించారు. మతతత్వం పెరిగిపోతున్న దశలో ప్రజాసంస్కృతిని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ‘ప్రపంచీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వ దశలో సంస్కృతి’ అనే వ్యాసంలో ప్రజల సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చాలని బోధించారు.
మూడోభాగంలో సోషలిజం నిర్మాణం గురించిన వ్యాసాలు వున్నాయి. రష్యా విప్లవం మనదేశంపై చూపించిన ప్రభావం గురించి విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చివరి రోజుల్లో ఉటంకించిన ‘ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, నిరంతర శ్రమతో రష్యా తన దేశం నుంచి రోగం, నిరక్షరాస్యతలను తరిమికొట్టింది’ అనే వాక్యలను చెబుతూ మన జాతీయోద్యమ నాయకులను, కవులను, రచయితలను, కళాకారులను, అభ్యుదయ శక్తులను ఆ విప్లవం ఎంతగా ప్రభావితం చేసిందో వివరిస్తారు. పుస్తకంలోని చివరి వ్యాసం చాలా ప్రాధాన్యతను కూడుకున్నది. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ: పరిమితులు-సోషలిజం ప్రత్యామ్నాయం’ అనే ఈ వ్యాసంలో మార్క్సిజాన్ని యాంత్రికంగా అన్వయించ కూడదని, అమలు పరచకూడదని లెనిన్ చేసిన హెచ్చరికను గుర్తుచేస్తూ ‘విప్లవ పోరాటాలను నిర్మించే సరైన నాయకత్వం ఏదైనా వాస్తవ పరిస్థితుల ఆధారంగానే పనిచేయాలని’ పిలుపుని స్తారు. సీతారాం ఎక్కడ ఉపన్యాసం చేసినా ‘నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అన్వయింపే మార్క్సిజం’ అని చెప్పడం వెనుక లెనిన్ బోధనలసారం ఎంత బలంగా ఆయనలో వుందో ఈ వ్యాసం తెలుపుతుంది. నేటి వర్తమాన పరిస్థితుల అవగాహనకు కీలకమైన సైద్ధాంతిక, నిర్మాణ అంశాలతో పాటు, మనదేశ సంస్కృతి, వామపక్షాల కృషి, సోషలిస్టు ప్రాధాన్యతలను సరిగా అర్థం చేసుకోవడానికి… ‘సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం’ పుస్తకాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష శ్రేయోభిలాషులు, ప్రజాతంత్ర పాఠకులు తప్పక చదవాలి.
వి.ఆర్