Tuesday, January 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమైనార్టీలపై ఉన్నతవిద్యపై కుట్ర!

మైనార్టీలపై ఉన్నతవిద్యపై కుట్ర!

- Advertisement -

డాక్టర్లు కావాలని ఆ విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదివారు. జాతీయస్థాయిలో జరిగే నీట్‌ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ప్రతిభ ఆధారంగా, కౌన్సెలింగ్‌ ద్వారా శ్రీ మాతా వైష్ణోదేవి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎక్సిలెన్స్‌లో సీట్లు సంపాదించారు. అయితే అందులో మెజార్టీ సీట్లు జమ్మూ కశ్మీర్‌కు చెందిన ముస్లింలు దక్కించుకోవడం కొందరికి నచ్చలేదు. ఫలితం.. ఆ మెడికల్‌ కళాశాల గుర్తింపును రద్దుచేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయితే ఆ విద్యార్థులకు ఇతర మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నా.. ఇక్కడ మైనార్టీ విద్యార్థుల పట్ల వివక్ష అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలోని అనేక ఘటనలను పరిశీలిస్తే.. మైనార్టీలను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలో ఇది ఒక భాగం మాత్రమేననే అనుమానం వ్యక్తమవుతున్నది.
వైష్ణోదేవీ మెడికల్‌ కాలేజీలో ప్రవేశాలు పూర్తి పారదర్శకంగా జరిగాయి. ‘నీట్‌లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా, కౌన్సెలింగ్‌ చేపట్టాకే విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే ఎంపికైన వారిలో జమ్మూ ప్రాంతానికి చెందిన మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారన్న విషయం బయటకు రాగానే కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి.

వైష్ణోదేవీ ఆలయ విరాళాలతో నడిచే కాలేజీలో వేరే మతస్తులు ఎలా చదువుతారు అంటూ ‘శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర సంఘర్ష్‌ సమితి’ వంటి సంస్థలు నిరసనలు చేపట్టాయి. అయితే ఇక్కడ విద్యార్థుల ప్రతిభ, అర్హత కంటే మతపరమైన విభజన రేఖలు గీసి.. వివక్ష చూపడం ఎలా సమంజసమో వారికే తెలియాలి. కొన్ని సంఘాలు ఆందోళనలు చేయడం, ఆ వెంటనే ఎన్‌ఎంసీ వెంటనే ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమతులు రద్దుచేయడం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చిన్నచిన్న లోపాలుంటే సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తారు. కానీ అప్పటికప్పుడు గుర్తింపును రద్దు చేయడమంటే ఆందోళనకారుల డిమాండ్లకు తలొగ్గినట్లే కనిపిస్తున్నది. అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి వంటి సాంకేతిక కారణాలను చూపినప్పటికీ.. ఆ నిర్ణయం వెనక అనేక ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుమతుల రద్దు తర్వాత కొందరు స్వీట్లు పంచుకొని బహిరంగంగా సంబరాలు చేసుకున్నారు.

అయితే ఇది కేవలం యాభై మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమే కాదు.. రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కుకు ముప్పు వాటిల్లే పరిణామం. వైష్ణోదేవీ కళాశాల ఘటనలో చదువులో మెరిట్‌ కంటే మతమే ప్రభావం చూపగలిగిందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఒక డాక్టర్‌ రోగి ప్రాణాలను కాపాడేటప్పుడు కులం, మతం చూడరు కదా. అలాంటి డాక్టర్‌ చదువులో అర్హత ఉండి, ర్యాంకు సాధించిన విద్యార్థులను అడ్డుకోవడమంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమే. మైనార్టీలను ఉన్నత విద్యకు దూరం చేసేలా గత దశాబ్దకాలంగా అనేక అంశాలను తెరపైకి తీసుకురావడమే కాకుండా.. వివిధ మార్గాల ద్వారా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అండగా ఉండే ”మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఏఎన్‌ఎఫ్‌)’ అను కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే రద్దు చేసింది. దీని వల్ల చాలా మంది మైనార్టీ విద్యార్థులు పీహెచ్‌ డీకి దూరమయ్యారు.

కర్నాటక వంటి రాష్ట్రాల్లో హిజాబ్‌ పేరుతో ముస్లిం అమ్మాయిలను తరగతి గదులకు దూరం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికే మైనార్టీల విద్యాస్థాయి జాతీయ సగటు కంటే చాలా తక్కువ. డ్రాపౌట్‌ రేట్లు ఎక్కువ. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రాతినిధ్యం పరిమితమే. జనాభాలో ముస్లింలు 15శాతం వరకు ఉన్నా.. ఉన్నత విద్యలో వారి ప్రాతినిధ్యం నాలుగు శాతం మాత్రమే. ఇలాంటి పరిస్థితు ల్లోనూ మెరిట్‌ ద్వారా పైకి వస్తున్న వారిని అడ్డుకోవడమంటే.. మైనార్టీలను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రే. విద్యను మతంతో కొలవడం మొదలు పెడితే.. ఈ రోజు ఒకకాలేజీ, రేపు ఒక యూనివర్సిటీ.. ఎల్లుండి మొత్తం వ్యవస్థే ఇలా తయారయ్యే ప్రమాదముంది. భారత రాజ్యాంగం మైనార్టీలకూ సమాన హక్కులు కల్పిస్తుంది. కానీ, అమలు లోపం ఉంది. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను కమ్యూనల్‌ పాలిటిక్స్‌ నుంచి రక్షించాలి. మేధావులు ఇప్పటికైనా ఈ విషయంపై మౌనం వీడాలి.

  • మహమ్మద్‌ ఆరిఫ్‌, 7013147990
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -