భారత రాజ్యాంగం దేశాన్ని సార్వభౌమిక, ప్రజాస్వామిక, లౌకిక,సామ్యవాద, గణతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇప్పటికి 75 ఏళ్లు దాటిపోయాయి. రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకున్నది 1950 జనవరి 26.మోనార్కీ అంటే రాచరికం.రిపబ్లిక్ అంటే గణతంత్రం.మోనో అంటే ఏకైక రాజు ఆయన కుటుంబం పాలన. రీ పబ్లికా అంటే ప్రజలకు సంబంధించిన అంశం. కనుక నిర్వచనంలోనే తేడా స్పష్టమవుతుంది. ఏ విధమైన వ్యత్యాసాలు పాటించకుండా ప్రజలందరూ కలసి నిర్ణయాలు తీసుకోవడం. దానికోసం ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థలు రాజ్యాంగ పరిధిలో పనిచేయడం, ఒక వేళ పాలకులు కాక మరెవరైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే న్యాయవ్యవస్థ ద్వారా చక్కదిద్దడం. ఇదో క్రమం. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం స్పష్టమైన అవగాహనతో జరిగింది. 1930 జనవరి 26న పూర్ణస్వరాజ్ దినోత్సవం జరపాలని కాంగ్రెస్ జాతీయోద్యమకాలంలో ఇచ్చిన పిలుపును గుర్తుచేసుకోవడానికి ఈ తేదీని తీసుకున్నారు.
కాని కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ పిలుపునివ్వడానికి రంగం సిద్ధం చేసింది కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భావం. 1920లో తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీకి అంకురార్పణ జరిగిన నాటి నుంచి సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ వచ్చారు. 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలో వారే పూర్తి స్వాతంత్య్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు, మళ్లీ 1927లో మద్రాసు కాంగ్రెస్ మహాసభలో జవహర్‌లాల్ నెహ్రూ పైన చెప్పినట్టు పూర్ణస్వరాజ్ కోసం 1930 జనవరి 26న పతాకావిష్కరణలు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టినపుడు బలపర్చిన ప్రతినిధి జోగ్లేకర్ కమ్యూనిస్టు నాయకుడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం కూడా ఆ తేదీనే ప్రకటించవచ్చునని మొదట భావించారు. అయితే ఘోరమైన మతకలహాల కల్లోలం కారణంగా దాన్ని ముందుకు జరిపి ఆగష్టు 15నే ప్రకటించారు. 1948 జనవరి 26న ఈ విషయాలు సభల్లో చెప్పారు కూడా. 1948 జనవరి 30న గాంధీజీని మతశక్తులు హత్య చేయడంతో ఆ భయాలు నిజమైనాయి. స్వాతంత్య్ర సాధన సమయం నుంచే దాన్ని దెబ్బతీసే శక్తులూ పొంచి వున్నాయన్నమాట.
రాజ్యాంగ రూపకల్పన
లిఖిత రూపంలో ప్రపంచంలో మరేదేశానికి లేనంత పెద్దది భారత రాజ్యాంగం. దానికోసం జరిగిన లోతైన చర్చలలో 36 లక్షల పదాలు వున్నాయని రికార్డులు చెబుతున్నాయి.3675 సవరణలను లేదా ప్రతిపాదనలలో 2473 వివరంగా చర్చించి నిర్ధారణలకు వచ్చారు. 395 అధికరణలు, 8షెడ్యూళ్లలో వీటిని పొందుపర్చారు. ఆరోగ్యం అంత బాగా లేనప్పటికీ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ దానికి తుది రూపమివ్వడానికి అంకితమైనారని రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్, తొలిరాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ అభినందించారు. దాదాపు 300 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఇంచుమించు మూడేళ్ల పాటు శ్రమించి, తర్కించి దాన్ని జాతికి అందించారు. స్వాతంత్య్ర సమర యోధులు సమిస్టిగా చర్చించి భావి భారతానికి వేసిన పునాది చిత్రం రాజ్యాంగం. అయితే ఆ పోరాటంతో ఏ విధమైన సంబంధం లేని ఆరెస్సెస్ రాజ్యాంగంపైనా మొదటే దాడి చేసింది. రాజ్యాంగ నిర్మాతలు అమెరికా, బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల రాజ్యాంగాలను కూలంకషంగా అధ్యయనం చేశారు.
తొలి సామ్యవాద రాజ్యం సోవియట్ యూనియన్ కూడా వారి దృష్టిలో వుంది. వాటన్నిటినీ పరిశీలించి దేశ పరిస్థితులకు తగినట్టు బహుళత్వం, వైవిధ్యం, పౌరహక్కులతో ఆర్థిక సామాజిక సమానతా భావనతో రాజ్యాంగాన్ని రూపొందించడం ఆరెస్సెస్‌కు మింగుడు పడలేదు. రాచరికాలు వర్ణాశ్రమ ధర్మాలతో సనాతన భారతాన్ని రుద్దడమే వారి సిద్ధాంతం. రాజ్యాంగంలో భారతీయతే లేదని దాన్ని ఆమోదించిన రోజునే ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’లో రాశారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రెండే జాతీయ పర్వదినాలుగా జరుగుతూ వచ్చాయి. అయితే ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే నవంబరు 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు అంటూ కొత్తగా రాజ్యాంగ దినోత్సవం మొదలుపెట్టారు. 2015లో అధికారికంగా తీసుకున్న ఈ నిర్ణయం జనవరి26 రిపబ్లిక్ డే ప్రాధాన్యత తగ్గించేందుకే. రాజ్యాంగం 368వ అధికరణం పరిస్థితులకు తగినట్టు దాన్ని మార్చుకునే అధికారం ఇస్తున్నదని, రాజ్యాంగం మౌలిక స్వభావం సిద్ధాంతం కూడా తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిందే తప్ప అందులో లేదని బీజేపీ కీలక నేతలే పేర్కొన్నారు.
గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం, ఇటీవల మోడీ ప్రభుత్వం కూడా పార్లమెంటుతో నిమిత్తం లేకుండా రాజ్యాంగాన్ని తిరగడోడేందుకు కమిషన్లు నియమించి సిఫార్సులు విడుదల చేశారు. సవరణలు ఏం చేసినా అవి మరింత పటిష్టపరిచేవిగా వుండాలి గాని దెబ్బతీసేవిగా కాదు. ఏది ఎలాగైనా మార్చేయొచ్చనట్టయితే ఇక దేశాలకు రాజ్యాంగాల అవసరమే వుండదు. ఒక విధాన చట్రం ఆ పరిధిలోనే వ్యవహరించాలన్నది కీలకం. 368 అధికరణం ప్రకారం వయోజన ఓటింగుతో ఏర్పడే పార్లమెంటులో బలం వుంది గనక ఏది ఎలాగైనా తలకిందులు చేస్తామంటే చెల్లుబాటు కాదు, కాకూడదు. పార్లమెంటు అత్యున్నత చట్టసభ కావచ్చుగాని దానికి అధికారం సంక్రమించేది మాత్రం రాజ్యాంగం నుంచే. దానికి వ్యాఖ్యానం చెప్పవలసిన సుప్రీంకోర్టుకైనా రాజ్యాంగమే శిరోధార్యం. దేశ భద్రత, దేశ గౌరవం కాపాడుకుంటూ అభివృద్ధి చెందడానికే రాజ్యాంగాలు రూపొందించుకుంటాం, దేశమంటే మనుషు లోరు అన్నట్టు, దేశపౌరుల హక్కులు, స్వేచ్ఛలూ సర్వతోముఖాభివృద్ధి అందులో కీలకం. ఈరెంటికీ ఇప్పుడు ముప్పు వాటిల్లడం చూస్తున్నాం.
సార్వభౌమమేనా?
అమెరికాకు మరోసారి ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మోడీ సర్కారును భారత దేశాన్ని ఇష్టానుసారం మాట్లాడటం పరిపాటిగా మారింది. తానే యుద్ధాలు ఆపాననీ, మోడీ తనను సంతోషపెట్టాలని ఏదేదో మాట్లాడారు. వందల శాతం టారిఫ్‌లు విధించారు. రష్యా దగ్గర మనం చమురు కొనరాదని హుకుంలు జారీ చేశారు. తనకు నచ్చిన కమిటీలలో మనం చేరతామని ఏకపక్షంగా ప్రకటించారు. ఇంత జరుగుతున్నా కేంద్రం కచ్చితంగా విమర్శించడం జరగలేదు. మన మిత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుడిని అపహరించుకుపోతే ఖండించలేదు. బ్రిక్స్ కూటమికి నాయకత్వ స్థానంలో వున్న భారత దేశం దాని సైనిక విన్యాసాలలో పాల్గొనకపోవడానికి అమెరికా ఒత్తిడే కారణం. గతంలో నిక్సన్‌తో ఇందిరాగాంధీ, కార్టర్‌తో మొరార్జీ దేశాయి వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నమైన ఈ ప్రవర్తన శాంతి కాముక దేశంగా మన గౌరవానికి భద్రతకూ కూడా హానికరంగా తయారైంది.
ప్రజాస్వామిక అన్న పదానికి నిజమైన అర్థం ప్రజలు తమను తాము పాలించుకోవడం. కాని అంతర్జాతీయ కార్పొరేట్లు , ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు వలయంలో చిక్కిన దేశం తనవైన ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోలేని దురవస్థలో పడిపోయింది. వాటిని దేశంలో విచ్చలవిడిగా అమలు చేయడం వల్ల ధన ప్రభావం పెరిగి కుబేరులే చట్టసభలలో నిండిపోవడం అనధికార సూత్రంగా మారింది. బీజేపీకి 2014తో పోలిస్తే ఈ ఏడాది అయిదు రెట్లు అధికంగా కార్పొరేట్ విరాళాలు అందాయంటే వారి మాటే శాసనంగా సాగుతుందని తెలియడం లేదా? ఈ ప్రభావంతో ధనాడ్యులే ప్రజా ప్రతినిధులు కావడం, లేదంటే డబ్బుబలంతో కొనుగోలు చేయడం ప్రజల తీర్పులను తారుమారు చేసింది. ఆర్థిక అంతరాలు అపారంగా పెరిగి ఒక్కశాతం సంపన్నుల చేతుల్లో నలభై శాతం సంపదలు కేంద్రీకృతం అవుతుంటే దిగువనున్న యాభైశాతం మంది అంటే సగం మంది కేవలం పదిహేను శాతం ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు.రాజ్యాంగం చెప్పిన ఆర్థిక సమత వంటి సూత్రాలు అటకెక్కాయి.
హిందూత్వ జపం చట్టబద్దమా?
సామాజిక న్యాయం కూడా మన రాజ్యాంగ మూల సూత్రాల్లో ఒకటి. కానీ హిందూత్వ శక్తులు అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ ధర్మాలను మనుధర్మం ఆక్రమించింది.దళిత బలహీన వర్గాలు, మహిళలపై పీడన అణచివేత విపరీతమైనాయి. ఇక హిందూత్వ మతతత్వ రాజకీయాలతో ముస్లిం, క్రైస్తవ తదితర మతాలకు చెందిన జనబాహుళ్యం రెండోశ్రేణి పౌరులుగా చూసే పోకడలు, ఘర్షణలు, దాడులు మామూలైనాయి. ఇన్నేళ్ల స్వాతంత్య్రం ఇంత పెద్ద రాజ్యాంగం తర్వాత కూడా ఏం తినాలో ఏం వస్త్రాలు ధరించాలో సంఘ పరివార్ మూకలు శాసిస్తుంటే ఉద్రిక్తతలు నిత్యకృతమైపోయాయి. లౌకిక రాజ్యాంగాన్ని తోసిరాజని ఈ దేశం హిందువులదేనన్న హూంకరింపులు మామూలైనాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాన్ని హిందూ దేశం అని ప్రకటించడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరమే లేదని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ స్వయంగా ప్రకటించారు. ఆయనతో కలసి రామమందిరంపై ద్వజం ఆవిష్కరించిన మోడీ గత కొన్ని వందల ఏళ్లలో దేశం సాధించిన అతిపెద్ద విజయం అయోధ్య రామమందిరమేనని ప్రవచించారు. కొంతమంది న్యాయమూర్తులు కూడా కోర్టు బెంచీల్లోనూ బయట కూడా హిందూత్వకు విధేయత అనుకూలత ప్రకటించుకుంటున్నారు. అలాగాక ధైర్యంగా మాట్లాడిన ఒక ప్రధాన న్యాయమూర్తిపై(ఆయన బౌద్ధుడు)సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే చెప్పు విసరడం సంచలనమైంది.
ఓటు హక్కుకే చేటు
ఈ క్రమంలో తాజా అంశం. ఓటు హక్కుపై దాడి, ఆ ఓటుతో వచ్చిన ప్రజా ప్రతినిధుల నిర్ణయ కేంద్రాలైన చట్టసభలపై దాడి. సార్వత్రిక వయోజన ఓటుహక్కు భారత దేశానికి గర్వకారణం. కానీ కేంద్రం ఎన్నికల సంఘం ద్వారా రాజ్యాంగంలో ఎక్కడా లేని సర్ అనే ప్రక్రియ తీసుకొచ్చి తమకు రావనుకున్న చోట్ల కోట్ల ఓట్లను తొలగించడానికి కారణమవుతున్నది. ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం గాక ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటానంటూ చెలరేగిపోవడం ప్రజాస్వామ్యానికి పెనుసవాలు. వీటిపై విచారణ జరుపతున్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినా పూర్తిగా ఆపేసే దిశలో ఆదేశాలేమీ రాలేదు. అసలు సుప్రీంకోర్టు ద్వారానే పెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయించి కేశవానంద భారతి కేసులో చెప్పిన రాజ్యాంగ మౌలిక స్వభావం తీర్పును తిరగదోడాలని చూస్తున్నారనే కథలు వున్నాయి. సుప్రీంకోర్టుకు కూడా పగ్గాలు వేయాలన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు.
జాతీయ చిహ్నం కాని సెంగాల్‌ను తెచ్చిపెట్టారు. అసలు పార్లమెంటులో కీలకాంశాలు చర్చించకుండా వందేమాతరంపై మతపరమైన చర్చ రగిలించారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370, సర్ వంటి అతి కీలకాంశాలపై చర్చకు నిరాకరించి నచ్చిన బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపచేసుకుంటున్నారు. ఇదే మరో రూపంలో ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోకుండా గవర్నర్ల ద్వారా ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిధుల కోతతో ఆ ప్రజల కడుపు కొడుతున్నారు. రాజ్యాంగం చెప్పిన సమాఖ్య స్పూర్తి మంట గలుపుతూ మతతత్వం, కార్పొరేట్ ఆధిపత్యం రుద్దుతున్నారు. సమగ్ర చర్చలేని ఆదరాబాదరా తీర్మానాలు, నిర్ణయాలతో లౌకిక ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యతత్వం సమానతా భావనలను కాలరాస్తున్నారు. వీటన్నిటివల్ల గణతంత్ర వ్యవస్థ అర్థమే కోల్పోతుంటే అసలు దానికి మూలమైన రాజ్యాంగ చట్రాన్నే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోవడం రోజూ చూస్తున్నాం. ఇన్ని సవాళ్ల మధ్య ఈ రిపబ్లిక్ దినోత్సవం మనకు మరింత కర్తవ్య నిర్దేశకమవుతున్నది.
తెలకపల్లి రవి



