– మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మా ప్రధాన అస్త్రం
– కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు మదతిచ్చినట్టే : మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు కొన్ని రద్దయ్యే ప్రమాదముందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలను రద్దు చేస్తారన్న ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశంతోపాటు కాంగ్రెస్ హామీలు, మోసాలు తమ ప్రధాన అస్త్రాలని వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల రద్దుకు మద్దతిచ్చినట్టే అవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. గురు లేదా శుక్రవారం నాటికి మున్సిపాల్టీల వారీగా ఇన్‌చార్జీలను నియమిస్తామని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి లబ్ధి జరిగిందంటూ తమపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దావోస్‌లో గ్రీన్‌కో సంస్థతోనే చర్చలు చేస్తారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. గ్రీన్‌కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?అని ప్రశ్నించారు. దావోస్‌లో ఏపీ బీజేపీ ఎంపీ సహా పలువురితో మంత్రులు చర్చలు జరుపుతున్నారనీ, ఇది ఏ విషయానికి సంకేతమమని అడిగారు. ఫ్యూచర్ లేని ‘ఫ్యూచర్ సిటీ’పై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కేటీఆర్ కోరారు. ఎన్నికల కోసం అవసరమైన ప్రచార సామగ్రి అంతా సిద్ధంగా ఉందని చెప్పారు. అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచించామని అన్నారు. సర్వేలు కూడా చేయిస్తున్నామనీ, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు.
స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచ్ స్థానాలు గెలవడం సామాన్యమైన విషయం కాదన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని తాము అనుకోవడం లేదని చెప్పారు. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ అత్యంత సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే ‘బస్తీ బాట’ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, గత పదేండ్లలో తాము చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన పనులు, ప్రస్తుత సమస్యలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండేదనీ, తాము ఏమీ మార్చలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌లో రాము, రెమో’ ఇద్దరూ ఉన్నారని అన్నారు. సినిమా టికెట్ల ధరలను పెంచబోమంటూనే వాటి ధరలు పెంచుతూ జీఓలు ఇస్తారని విమర్శించారు. సర్వాయి పాపన్న పేరుతో జనగామ జిల్లా చేస్తామని చెప్పి, ఇప్పుడు అదే జిల్లాను తొలగిస్తామనడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
జిల్లాలను రద్దు చేసే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



