మళ్లీ కేసీఆర్ వస్తేనే అభివృద్ధి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
చిన్న జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికల నుంచే కృషి చేయాలని ఓటర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఎన్ని పంటలకు రైతుబంధు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు అయిపోయే వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి ఈ మాట చెబుతున్నారని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను పక్కన పెట్టారని తెలిపారు.
మళ్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారి మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజలను మోసం చేయడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టాల్సిన అవసరం ఏముందని, చేతనైతే ప్రజలకు మంచి చేయాలని చెప్పారు. ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలు ఎత్తేస్తామంటున్న కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీలు.. మోసంపై ప్రశ్నించకుంటే, మరో మూడు సంవత్సరాల దాకా ప్రశ్నించే అకాశం రాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేలా ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా, సురుకు పెట్టాలని కోరారు.



