ట్రంప్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు డియాజ్ కానల్ ఆగ్రహం
67 ఏండ్లుగా ఓడించలేకపోయారు..ఇకపైనా ఓడించలేరు
అమెరికా చర్యలను ఖండించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా
హవానా : అమెరికా ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధంతో (ఎకనామిక్ బ్లాకేడ్) ఊపిరాడకుండా కుట్ర చేస్తుందని క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ విమర్శించారు. క్యూబా ద్వీపానికి చమురు సరఫరా చేసే దేశాలపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్ బెదిరింపులను ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలు ఫాసిస్ట్, నేరపూరిత, జాతి విధ్వంసకరమని కానెల్ శనివారం సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. సార్వభౌమాధికారంతో చమురు వ్యాపారం చేసే దేశాలను ట్రంప్ బెదిరించడం సరికాదన్నారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ ప్రజల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆధారాలు లేని సాకు చూపించి ఆర్థిక ఆంక్షలను విధించడం మారణహోమ స్వభావాన్ని సూచిస్తుందన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆగ్రహం
అమెరికా చర్యలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా (సీపీసీ) తీవ్రంగా ఖండించింది. కేంద్ర కమిటీ కార్యదర్శి రాబర్టో మొరేల్స్ ఒజెడా మాట్లాడుతూ ఈ కొత్త ఉత్తర్వు క్యూబన్లకు మరింత కష్టాలను సృష్టించి, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఉద్దేశించినదని అన్నారు. ‘క్యూబా ప్రజలపై అమెరికా ఫాసిస్ట్ ప్రభుత్వం తమ దురాక్రమణను కొనసాగిస్తోంది. ఈ నేరపూరిత, నయా వలసవాద సామ్రాజ్యవాదమే మన ప్రాంతంలో, ప్రపంచంలో శాంతికి నిజమైన ఏకైక ముప్పు. 67 ఏండ్ల్లుగా వారు మమ్మల్ని ఓడించలేకపోయారు.. ఇకపై కూడా ఓడించలేరు’ అని ఆయన స్పష్టం చేశారు. క్యూబాను తమ జాతీయ భద్రతకు ‘అసాధారణమైన ముప్పు’గా ఉత్తర్వుల్లో అమెరికా పేర్కొనడం హాస్యాస్పదమని రాబర్టో శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే : క్యూబా విదేశాంగ మంత్రి
క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘించడమేనన్నారు. సరఫరా చేసే దేశాలను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి, క్యూబాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇది సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా అనుసరిస్తున్న ప్రమాదకరమైన విదేశాంగ విధానమని ఆయన తీవ్రంగా విమర్శించారు. క్యూబా ఎప్పుడూ అమెరికాకు, దాని జాతీయ ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు కాదని, ప్రపంచ శాంతికి ముప్పుగా మారింది అమెరికా ప్రభుత్వ విధానాలేనని ఆయన స్పష్టం చేశారు.
సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటాం
క్యూబా శాంతియుతమైన, సహాయకారిగా ఉండే దేశమని, అమెరికా ఆర్థిక ఒత్తిడితో లక్షలాది మంది ప్రజలకు కష్టాలు కలిగించడం ద్వారా క్యూబా ప్రజల సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయాలని భావిస్తే అది పొరపాటేనని క్యూబా నాయకత్వం హెచ్చరించింది. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి క్యూబా ప్రజలు దృఢంగా నిలబడతారని ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం ఈ దురాక్రమణను తిరస్కరించి, న్యాయం, సంఘీభావం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేసింది. ”ఈ దాడిని ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయం మన పక్షానే ఉంది. నిర్ణయం ఒక్కటే… మాతృభూమి లేదా మరణం. మనం విజయం సాధిస్తాం” అని క్యూబా విప్లవ ప్రభుత్వం పేర్కొన్నది.



