Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంఉపాధిని దెబ్బతీసే కుట్ర

ఉపాధిని దెబ్బతీసే కుట్ర

- Advertisement -

ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య ‘వీబీ-జీ రామ్‌ జీ’ బిల్లు
ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు
కేంద్రం చర్యపై ప్రతిపక్ష ఎంపీల నిరసన

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ‘వీబీ-జీ రామ్‌ జీ’ బిల్లును కేంద్రం ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన వెంటనే, ప్రతిపక్షాలు లేచి ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. జాతిపితను అవమానిం చడానికి వీలు లేదని నినాదాలు హౌరెత్తిం చాయి. మహాత్మాగాంధీ ఫొటో పట్టుకుని ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి రావడంతో సభా కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఎంపీలు టీఆర్‌ బాలు, ప్రియాంక గాంధీ, శశి థరూర్‌, సౌగత రారు, సుప్రియా సూలే, ధర్మేంద్ర యాదవ్‌, తదితరులు కొత్త బిల్లు వెనుక ఉన్న రహస్య ఉద్దేశాలను ఎత్తి చూపారు. ఈ చట్టం పేరు మార్పు వెనుక మహాత్మా గాంధీ పట్ల కోపం, ద్వేషంతో పాటు చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల ఉపాధిని దెబ్బతీసే కుట్రలున్నాయని విమర్శించారు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”మహాత్మా గాంధీ దేశం మొత్తానికి ఆస్తి. జాతిపిత పేరును మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం ఆమోదయోగ్యం కాదు. దేశంలోని పేదలు, అత్యంత పేదలకు ఆధారం, ఆశ్రయమైన ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసే బిల్లు ఇది. ఉపాధి హామీ రోజులను 125 రోజులకు పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి, కొత్త బిల్లులో ఉన్న ఉపాధి కూలీల హక్కులను బలహీనపరిచి కూలీలను తొలగించే నిబంధనలు ఉన్నాయి” అని తెలిపారు. ఈ పరిస్థితిలో బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. బాపూజీ కల రామరాజ్యమని, ఆ పథకానికి రామ్‌ అని పేరు పెట్టడంలో తప్పేంటని ఎదురుదాడికి దిగారు. కాగా ఈ బిల్లుపై వివరణాత్మక చర్చ జరుగుతుందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసే ఈ చర్యకు వ్యతిరేకంగా సభ్యులు పార్లమెంటు వెలుపల కూడా నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ చిత్ర పటాలతో ఆందోళన చేపట్టారు.

ఉపాధిపై కేంద్రానిదే పెత్తనం
ప్రతిపాదిత చట్టంతో ఉపాధి చట్టం నియంత్రణను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తన ఆధీనంలో తీసుకుని, రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక భారాన్ని బదిలీ చేస్తుంది. కొత్త చట్టం ప్రకారం, కార్మికుల వేతనాలపై ఖర్చులో కేంద్రం 60 శాతం మాత్రమే భరిస్తుంది. మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి సంవత్సరానికి కనీసం రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్రాలు సమిష్టిగా దాదాపు రూ. రూ. 55,000 కోట్లు ఇవ్వవలసి వస్తుంది. దీని వల్ల వాటి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. బిల్లులోని ఒక ప్రమాదకరమైన నిబంధన.. వ్యవసాయ సీజన్లలో ఉపాధి హామీని 60 రోజుల వరకు స్తంభింపజేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం, ఉపాధిచట్టంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పనిని నిలిపివేయడానికి ఎలాంటి నిబంధన లేదు.

కాగా ఈ కొత్త బిల్లు ఉపాధి డిమాండ్‌ అత్యధికంగా ఉన్నప్పుడు, విత్తనాలు విత్తడం , కోతతో సహా అత్యంత రద్దీగా ఉండే వ్యవసాయ కాలాల్లో పనులను నిలిపివేసేందుకు రాష్ట్రాలు ముందస్తు నోటిఫికేషన్లు జారీ చేయడానికి వీలు కల్పిస్తుంది.ఈ చట్టాన్ని అమలు చేయడంలో గ్రామసభలు, స్థానిక స్వపరిపాలన సంస్థల పాత్రను తగ్గించడానికి కూడా బిల్లు ప్రయత్నిస్తుంది. ఇది మొబైల్‌ ఆధారిత వ్యవస్థలు, బయోమెట్రిక్‌ ప్రామాణీకరణ, జియో-ట్యాగింగ్‌, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆడిట్‌లు వంటి సాంకేతిక జోక్యాలపై ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్మికులను వారి హక్కుల నుంచి మినహాయించడానికి దారితీశాయి. కనుక తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంటు లోపల, వెలుపల బిల్లును వ్యతిరేకిస్తూ.. వామపక్ష పార్టీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశాయి.

గాంధీ ఆదర్శాలకు అవమానం: రాహుల్‌
మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని లోక్‌సభాపక్ష నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోడీ ప్రభుత్వం..ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ర్యాలీగా పార్లమెంటు వరకు వెళ్లి తమ నిరసనను తెలియజేస్తాయన్నారు. ”మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులపై ప్రధాని మోడీకి ముందు నుంచి తీవ్రమైన అయిష్టత ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే గాంధీ ఆలోచనకు ఎంజీ నరేగా ఓ సజీవ స్వరూపం. ఎన్నో ఏండ్లుగా ఇది లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు జీవనాడిగా ఉంది. కోవిడ్‌ సమయంలో ఈ చట్టం పేదలకు ఆర్థిక భద్రతను ఇచ్చింది. కాంగ్రెస్‌ తీసుకువచ్చిన ఈ చట్టం ప్రధాని మోడీని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంది. అందువల్ల దీన్ని బలహీనపరిచేందుకు కేంద్రం పదేండ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దీనిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు” అని రాహుల్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

చట్టాన్ని నీరుగార్చే కుట్ర వామపక్ష ఎంపీలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కేంద్రం చర్యకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. ఈ చట్టం యొక్క ప్రధాన నిర్మాణాన్ని మార్చే ప్రయత్నం గ్రామీణ కార్మికులకు తీవ్రంగా హాని కలిగిస్తుందని, వారి చట్టబద్ధమైన హక్కులను నీరుగార్చుతుందని హెచ్చరించారు. పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టాల్సిన ప్రతిపాదిత విక్షిత్‌ భారత్‌ – రోజ్‌గార్‌ , అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌) బిల్లు, 2025 ప్రవేశాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తుందని, దీంతో పాటు ఉపాధి చట్టానికి ఆధారమైన హక్కులు హననమవుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -