Tuesday, April 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇంటికో ఆవు..బర్రె..

ఇంటికో ఆవు..బర్రె..

- Advertisement -

అస్సాంలో బీజేపీకి మూడోసారి అధికారం కట్టబెడితే ప్రతి ఇంటికో ఆవు, బర్రె ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అస్సాంలో ఎన్నికల ప్రచారంలో హమీలు గుప్పిస్తున్నారు. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడగాల్సిందిపోయి…ఆవులు, బర్రెలిస్తామని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ కాలంలోనే ఆవుల కుంభకోణం వెలుగు చూసింది. అందులో ఆవులన్నీ ఆ రాష్ట్ర అధికార పార్టీ కీలక నేతల పశువుల కొట్టానికి తరలాయే తప్ప ప్రజలకు అందింది లేదు. కాఆవులు, బర్రెలిస్తామని చెప్పడమంటే ప్రజలను అధికారికంగా మరోసారి మోసం చేయడమే. అదే కాకుండా ఈ ఆవులు, బర్రెలన్ని కూడా గుజరాత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బీహార్‌, బెంగాల్‌ ఎన్నికల సమయంలో చొర బాటుదార్ల ప్రస్తావన లేకుండా బీజేపీ ఎన్నికల ప్రచారం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. అదే ఎత్తుగడను ఇప్పుడు అస్సాంలో అనుసరించనుంది. దేశం మొత్తమ్మీద అన్ని ప్రభుత్వాలు పోటాపోటీగా ఈ రకమైన ఉచిత పథకాల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాయి. అధికారాన్ని దక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల ముందు అమలుకూ సాధ్యంకాని ఉచిత హామీలను లెక్కకుమించి కుమ్మరించే పని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దీనికి ఏ బూర్జువా పార్టీ మినహాయింపు కాదు. అవన్నీ ఒక తానులో ముక్కలే. పదవులే పరమావధిగా అధికారమే అంతిమలక్ష్యంగా ప్రజలకు ఉచిత వరాల జల్లులు కురిపిస్తాయి.

అయితే ఇక్కడ కూడా కాషాయ దళం తన కుత్సితత్వాన్ని మరోసారి బయట పెట్టుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాలిచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ రంధ్రాన్వేషణ మొదలెట్టింది. ఇలా బొక్కలు వెతకటంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజంగా పేదలకిచ్చే ఈ అరాకొరా సంక్షేమమే ఆర్థికవ్యవస్థకు భారం అన్న కాషాయనేతలే… సంక్షేమ పథకాల అమలుపై బీజేపీయేతర ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, మరోవైపు తమను గెలిపిస్తే ఆవులు, బర్రెలిస్తామనడం విడ్డూరం కాక మరేమిట? మరి రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో పెద్దలకిచ్చే కానుకల మాటేమిటి? ఇది ఇప్పుడు కచ్చితంగా చరించాల్సిన విషయం. వాస్తవానికి గత పందేడ్ల బీజేపీ పాలనలో రైతన్నలకు ఒరగబెట్టిందేమీ లేకపోగా దివాళాకోరు విధానాలతో వారిని నట్టేట ముంచింది. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే హామీనిచ్చి గద్దెనెక్కిన కాషాయనేతలు… ఆచరణలో వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌కు కోతలు పెట్టి ‘కార్పొరేట్‌ వ్యవసాయానికి’ రూట్‌ క్లియర్‌ చేశారు. ఇప్పుడు పాడిరైతులను దెబ్బతీసే కుట్రకు పూనుకుంటున్నారు.

బీహార్‌లో ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా సవరణ (సర్‌) పూర్తయిన తరువాత ఎంత మంది విదేశీయులు లేదా చొరబాటుదార్లు బయటపడ్డారో చెప్పడానికి మాత్రం సాహసించలేకపోయారు. ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ప్రధానాధారం మతతత్వ రాజకీయాలే. అస్సాం ఎన్నికల ప్రచారం మొత్తం పౌరుల గుర్తింపు, వలసలు, పౌరసత్వం, చొరబాటుదార్లు అన్న అంశాల చుట్టే తిరుగుతోంది. ఈ అంశాలలో కేంద్ర బిందువు ముస్లింలే. ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా హిందువులను, ముస్లింలను విడదీయడానికి బీజేపీ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అస్సాం ప్రజల సాంస్కఅతిక గుర్తింపు మాయమవుతోందని, స్థానిక అఖిల భారత డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎఐయుడిఎఫ్‌) సాంప్రదాయక ఓటు బ్యాంకును చీలుస్తోందని బీజేపీ యాగీ చేస్తోంది. ఈ దుష్ప్రచారం అసలు లక్ష్యం ముస్లిమేతర ఓట్లను పోగేయడం. ఎఐయుడిఎఫ్‌ మతతత్వ పార్టీ అని బీజేపీ ఊదరగొడుతూ ఉంటుంది. ఈ పార్టీ పోటీ వల్ల ముక్కోణపు పోటీ తప్పవన్నది బీజేపీ ఆందోళన, మజ్లిస్‌ పార్టీ చీల్చేది కాంగ్రెస్‌ లేదా ఇతర సెక్యులర్‌ పార్టీలకు సష్టం కలిగించే ముస్లిం ఓటర్లనే కాబట్టి అక్కడ మజ్లిస్‌ ఎన్ని ఎక్కువ స్థానాలలో పోటీచేస్తే అంత ఉపయోగం. అది పరోక్షంగా బీజేపీకే ఉపయోగం. సాధారణంగా బీజేపీ మతపరమైన ఓట్ల సమీకరణ మీదే ఆధారపడి ఉంటుంది.

అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందూ ఓట్లు చెదిరిపోకుండా జాగ్రత పడుతుంది. ముఖ్యంగా ఎగువ అస్సాంలో మెజారిటీపక్ష ఓట్లను సమీకరిస్తుంది. ఈ వరసలోనే సిఎఎ, ఎన్‌ఆర్‌సి లాంటి వాటిని బీజేపీ లేవనెత్తుతూ ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేసి తీరుతామని అమిత్‌ షా శపథం చేస్తున్నారు. బీజేపీ వల్లె వేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాల్లో ఇప్పటివరకు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని భాష్యాలు చెప్పారు. ఇప్పుడు వాటి జాబితాలోకి ఆవులు, బర్రెలు కూడా చేరిపోయాయి. స్టార్టప్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. ఈ తర్కాన్ని అస్సాం ఓటర్లు గ్రహించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -