Saturday, February 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపిరికిచర్య!

పిరికిచర్య!

- Advertisement -

ఆయనేం దేశాన్ని ఎవనిమెప్పుకోసమో
విపణి వీధిలో తాకట్టుపెట్టలేదు కదా!
నూటనలభై కోట్ల తలల్ని
అగ్రరాజ్యానికి హారతి బిల్లల్ని చేయలేదు కదా!
పరాయిగడ్డమీద నోరుమూసుకొని
ఇక్కడ మాత్రం నిరంతరం
మతాల క్రూసేడులను రగిలించలేదు కదా!

రాజ్యాంగం సాక్షిగా
కిందికులాలను జింక పిల్లల్లా వేటాడి వెంటాడే
మనువు సంతానాన్ని జేబులో దాచుకోలేదు కదా!
సామాన్యున్ని చూసి ముక్కువిరుస్తూ
రాకెట్టులా ఆకాశయానం చేస్తున్న
రూపాయి బిళ్లను అచ్చుగుద్దలేదు కదా!

ప్రజాసమస్యల ప్రస్తావనలకు భయంచెంది
బాధ్యతను తుంగలో అడుగంటా తొక్కి
చీకటి కలుగులో దాక్కోలేదు కదా!

మహాత్మా ఫూలే ఏం చేశాడు?
ప్రజలకోసం ఆలోచించాడు
చదువు దేశానికి, జీవితానికీ
కొత్త వెలుగులిస్తుందని బోధించాడు
మహిళ కూడా మనిషేనని చెప్పాడు
ఆమె చదివితే, ఇంటిలోని చెత్తనే కాదు,
దేశ చీకటినంతా ఊడ్చిపారేస్తుందన్నాడు
మనుషులంతా సమానమన్నాడు

ఇదేకదా! మీ తాతల వారసత్వం
మనుషులంతా ఒక్కటేనని ఎవరు చెప్పినా
మీరుచేసే పని ఇదేకదా! మనుషుల్ని చంపుతారు
అప్పటికే చస్తే వ్యక్తిత్వ హననం సాగిస్తారు
విగ్రహాలై నిల్చుంటే పశువుల్లా మీదపడి కూల్చుతారు

పిరికివాళ్లారా!
ఆయన విగ్రహం కూలుస్తారేమో!
ప్రజల గుండెల్లోని ఫూలేను ఎలా కాలుస్తారు?
రాజ్యాంగంలో చేరిన
ఆయన ఆశయాన్ని ఎలా నాశనం చేస్తారు?

(తెల్లాపూర్‌లో ఫూలే విగ్రహం కూల్చివేయ చూసిన దుండగుల చర్యకు నిరసనగా)

తోకల రాజేశం, 9676761415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -