Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసోషల్‌ మీడియా దుర్వినియోగానికి కళ్లెం

సోషల్‌ మీడియా దుర్వినియోగానికి కళ్లెం

- Advertisement -

– డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ
– నగర పోలీసుల కీర్తిని మరింతగా పెంచుతా
– ‘నవతెలంగాణ’తో నగర నూతన కొత్వాల్‌ వి.సి సజ్జనార్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :

సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయటం వల్ల వ్యక్తుల మధ్య విబేధాలు ఏర్పడి శాంతి భద్రతల పరిస్థితి ఏర్పడుతున్నదనీ, ఈ పరిస్థితిని అరికట్టటానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగుతానని నగర నూతన పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌ అన్నారు. డ్రగ్స్‌ వినియోగం, రవాణాను అరికట్టడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో నగర పోలీసుల కీర్తిని పెంచటానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.

నగర పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్‌ ‘నవతెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడుతూ.. రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్‌ నగరంలో శాంతిని సుస్థిరం చేయటంతో పాటు నేరస్తులను కట్టడి చేయడానికి తనకున్న మార్గాలను ఆయన పంచుకున్నారు. గతంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన అనుభవంతో పాటు వివిధ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన అనుభవాలను క్రోడీకరించి నగర ప్రజలకు సుస్థిరమైన శాంతి భద్రతలను అందించటానికి తగిన కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు.

సీఎం విశ్వాసాన్ని వమ్ము చేయను
హైదరాబాద్‌ కమిషనర్‌గా తనను నియమించటం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయనని ఆయన తెలిపారు. స్వేచ్ఛ ఉంది కదా అని సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసి, ఇతరుల హక్కులకు భంగం కలిగించేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అభిప్రాయాలను వెలిబుచ్చటం తప్పుకాదనీ, అయితే అది ఇతరులను మానసిక క్షోభకు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మతసామరస్యానికి భంగం కలిగిస్తే ఊరుకోం
పెరుగుతున్న డ్రగ్స్‌ మహమ్మారితో పాటు సైబర్‌ నేరాలను అరికట్టడానికి వ్యూహాత్మకంగా పని చేస్తామని సజ్జనార్‌ అన్నారు. మరోవైపు అధిక వడ్డీల మోహంతో ఆర్థిక నేరగాళ్ల బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నదనీ, ఇలాంటి నేరాలపై ప్రజలను చైతన్యపరుస్తామని సజ్జనార్‌ తెలిపారు. హైదరాబాద్‌కు గంగా-జమున సంగమంలాంటి మతసా మరస్య చరిత్ర ఉన్నదనీ, దీనికి ఎవరు భంగం కలిగించినా ఊరుకోబోమని, అలాంటి శక్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందని అన్నారు. పోలీస్‌స్టేషన్ల పనితీరుతో పాటు పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పెంచటానికి పోలీస్‌ శాఖను సమిష్టి కృషితో ముందుకు నడిపిస్తానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపుతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించటానికి తగిన ప్రణాళికలు రూపొందిం చుకొని అమలు చేస్తామని చెప్పారు.

న్యాయం జరగకపోతే నన్ను కలవొచ్చు
పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో తమకు తగిన న్యాయం జరగలేదని ఎవరైనా బాధితులు భావిస్తే తనను నేరుగా కలవడానికి అవకాశమిస్తానని సజ్జనార్‌ హామీ ఇచ్చారు. ప్రధానంగా ఆర్థిక నేరగాళ్ల నుంచి నగర ప్రజలను రక్షించటానికి సంపూర్ణంగా కృషి చేస్తానని తెలిపారు. ఐఎస్‌ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిరంతంర నిఘా కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -