బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తలసాని..
14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ బృందాల పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సుందరీకరణ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆ పేరుతో విధ్వంసం చేసే ఊరుకోబోమని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం (బీఆర్ఎస్వీ) తలపెట్టిన మూసీ పోరుబాట యాత్రను శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 14 వరకు పది రోజులపాటు జరిగే ఈ యాత్రలో 50 బృందాలుగా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ మూసీ తీరాన ప్రజలు భయాందోళనల్లో ఉన్నారని చెప్పారు. అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు. బీఆర్ఎస్వీ బృందాలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను వివరిస్తాయని వివరించారు. అందరితో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే లక్షలాది మందితో ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై దమనకాండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



