హసీనాకు మరణశిక్షపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
హసీనా వ్యాఖ్యలు, స్టేట్‌మెంట్‌లు ఇవ్వొద్దు : మీడియాకు బంగ్లా హెచ్చరికలు
న్యూయార్క్, ఢాకా : పదవీచ్యుతురాలైన బంగ్లా ప్రధాని హసీనాపై బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బాధితులకు న్యాయం అందించే దిశగా కీలకమైన అడుగు అని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. అయితే ఆమెకు మరణశిక్ష విధించడంపై విచారం వ్యక్తం చేసింది. పరిస్థితులేవైనా మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించాలన్న వైఖరికి కట్టుబడి వుండాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్‌్ అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ చెప్పారు. జవాబుదారీతనమనేది చాలా కీలకమని యుఎన్ చీఫ్ ముఖ్య ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో ఈ తీర్పు వెలువడిన తర్వాత ప్రజలు శాంతి, సంయమనం పాటించడం కూడా అంతే కీలకమని అన్నారు. ఏదిఏమైనా అన్ని పరిస్థితుల్లోనూ మరణశిక్ష విధింపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రతినిధి రవీనా షామ్‌దాసాని స్పష్టం చేశారు. అల్లర్లకు కారకులెవరో నిర్ధారించడం చాలా ముఖ్యమైన అంశమని, అది కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పరోక్షంలో విచారణ సాగుతున్నపుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుందని అన్నారు. అయితే గతంలో జరిగిన ఉల్లంఘనలు వంటివి పునరావృతం కాకూడదంటే సెక్యూరిటీ రంగంలో కూడా సంస్కరణలు అవసరమని షామ్‌దాసాని పేర్కొన్నారు.
మీడియాకు హెచ్చరికలు
దేశం నుంచి పారిపోయి, అల్లర్ల అణచివేత కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని షేక్ హసీనా చేసే వ్యాఖ్యలు, స్టేట్‌మెంట్‌లపై ఎలాంటి వార్తలు ఇవ్వరాదంటూ అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా సంస్థలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలో శాంతి భద్రతలు, ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. దేశంలో అల్లర్లను, హింసను, నేర కార్యకలాపాలను రెచ్చగొట్టేలా హసీనా వ్యాఖ్యలు, ప్రకటనలు వుండొచ్చునని తద్వారా సామాజిక సామరస్యత దెబ్బతినవచ్చని జాతీయ సైబర్ భద్రతా సంస్థ (ఎన్‌సిఎస్‌ఎ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో వుంచుకోవాలని ప్రభుత్వం కోరింది. కొన్ని మీడియా సంస్థలు హసీనా వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రసారం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
న్యాయం జరిగే దిశగా కీలకమైన అడుగే…కానీ !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



