Saturday, March 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికాకు చావుదెబ్బ

అమెరికాకు చావుదెబ్బ

- Advertisement -

విరుచుకుపడుతున్న ఇరాన్‌ సేనలు..
అబ్రహంలింకన్‌ నౌకపై ఇరాన్‌ దాడి
ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం
నాటో దేశాల నావికా స్థావరాలపై ఇరాన్‌ ఎటాక్‌
పెషావర్‌లోని అమెరికా ఎంబసీ శాశ్వతంగా మూసివేత
రష్యా చమురుకు గిరాకీ..రోజుకు 3700 కోట్ల ఆదాయం

(నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌)

ఇరాన్‌ చేతిలో అమెరికా చావు దెబ్బతిన్నది. 14 రోజులుగా కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులకు ఇరాన్‌ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. శుక్రవారం అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ దాడి చేసింది. దీంతో ఆ నౌక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని ఐఆర్‌జీసీ తెలిపింది. మరోవైపు నాటో దేశాలపై కూడా ఇరాన్‌ విరుచుకుపడింది. ఫ్రాన్స్‌, ఇటలీ, టర్కీ దేశాల్లోని నావికాస్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు పాల్పడింది. మరోవైపు ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ దాడుల పట్ల ఇరాన్‌ న్యాయ వ్యవస్థ అధిపతి ఎజెహీ స్పందించారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, క్షిపణి దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీ గాయపడినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఇరాన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

టెహ్రాన్ణ్‌ ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ సేనల దాడులు ముమ్మరమయ్యాయి. ఇజ్రాయిల్‌ లక్ష్యంగా 44వ విడత ప్రతీకార దాడులు మొదలు పెట్టామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఇజ్రాయిల్‌ ఉత్తర ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో 58 మంది గాయపడ్డారు. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణి దాడులు ఉధృతం కావడంతో ఇండ్ల నుంచి బయటకు రావద్దని, షెల్టర్లలోనే ఉండాలని ఇజ్రాయిల్‌ సైన్యం సూచించింది. గల్ఫ్‌ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలు, దళాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. చమురు నౌకలు, క్షేత్రాలపై కూడా దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ ఆంక్షల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధిలో చమురు నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

దీంతో అంతర్జాతీయ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్‌ ప్రయోగించిన 114 క్షిపణులు, 190 డ్రోన్లను అడ్డుకున్నామని బహ్రెయిన్‌ తెలిపింది. సౌదీ అరేబియా కూడా తూర్పు ప్రాంతంవైపు వస్తున్న పది డ్రోన్లను అడ్డుకుంది. తన గగనతలాన్ని ఉల్లంఘించిన 28 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు దుబాయి విమానాశ్రయాన్ని, కొన్ని హోటళ్లను తాకాయి. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఖతార్‌ తన గగనతలాన్ని అధికారికంగా మూసివేసింది. అయితే విమానాశ్రయంలో చిక్కుబడిపోయిన వారిని స్వస్థలాలకు పంపేందుకు 140కిపైగా ప్రత్యేక విమానాలు నడిపింది. తమ ప్రాదేశిక జలాల్లో అమెరికాకు చెందిన చమురు నౌకపై ఇరాన్‌ జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయిన నేపథ్యంలో ఓడరేవుల్లో కార్యకలాపాలను ఇరాక్‌ నిలిపివేసింది.

టెహ్రాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు
పవిత్ర రంజాన్‌ నెల చివరి శుక్రవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయిల్‌ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇజ్రాయిల్‌ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు మద్దతుగా ప్రతి ఏటా రంజాన్‌ చివరి శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అల్‌ ఖుద్స్‌ డే పేరిట ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే టెహ్రాన్‌లోని ఫెర్‌దౌసీ స్క్వేర్‌ వద్ద ప్రజలు భారీ ప్రదర్శన జరిపారు. ఈ ర్యాలీకి ఇరాన్‌ జాతీయ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ర్యాలీ జరిగిన ప్రదేశం సమీపంలోనే ఇజ్రాయిల్‌ దాడులు చేసింది.

ప్రధాన వీధుల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడులో ఒక వ్యక్తి చనిపోయాడని తెలుస్తోంది. ఈ ఘటనను ‘విఫల దాడి’గా ఇరాన్‌ అభివర్ణించింది. టెహ్రాన్‌ సమీప ప్రాంతాలపై జరిగిన దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇస్ఫహాన్‌, తబ్రిజ్‌, ఖ్వోమ్‌, షేర్‌కోర్డ్‌, రష్త్‌, అర్బదిల్‌, అహ్‌వాజ్‌, క్వజ్‌విన్‌, యసుజ్‌, బిర్‌జాంద్‌ సహా పలు పట్టణాలలో కూడా ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయిల్‌ దళాలు లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై కూడా దాడులు జరిపాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల అనంతరం నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుబడిపోయారు.

దక్షిణ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయిల్‌ జరిపిన తాజా దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది చనిపోయారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటి వరకూ 98 మంది పిల్లలు సహా 687 మంది మరణించారని లెబనాన్‌ అధికారులు చెప్పారు. సుమారు ఏడున్నర లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది. కాగా అమె రికా, ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులలో ఇప్పటి వరకూ 1,348 మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాసలో ఇరాన్‌ రాయబారి ఇరావనీ తెలిపారు. మృతులలో ఎనిమిది నెలల వయసున్న చిన్నారి నుంచి 88 సంవత్సరాల వృద్ధుడి వరకూ ఉన్నారు. యుద్ధం కారణంగా 30 లక్షలకు పైగా ఇరానీలు నిరాశ్రయులయ్యారు.

కూలిన అమెరికా విమానం : నలుగురు మృతి
అమెరికాకు చెందిన కేసీ-135 విమా నంలో ఇంధనాన్ని నింపుతుండగా ఇరాక్‌లో కూలిపోయింది. ప్రయాణ సమయంలోనే విమానాల్లో ఇంధనాన్ని నింపుతుంటారు. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న యుద్ధంలో ఈ విమానం కూడా భాగంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది ఉండగా వారిలో నలుగురు చనిపోయారు. అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనేనని, కుట్ర ఏమీ లేదని అమెరికా సైన్యం తెలిపింది.

హార్ముజ్‌ జలసంధిని దాటిన ఐదు భారత నౌకలు
హార్ముజ్‌ జలసంధిలో ప్రయాణించేందుకు భారత పతాకంతో ఉన్న నౌకలను అనుమతిస్తామని ఇరాన్‌ ప్రకటించిన నేపథ్యంలో మన దేశంతో సంబంధమున్న ఐదు నౌకలు శుక్రవారం చెక్‌పాయింటును దాటాయి. అయితే ఈ వార్తను విదేశాంగ శాఖ ప్రతినిధి రణబీర్‌ జైస్వాల్‌ ధ్రువీకరించడం కానీ, ఖండించడం కానీ చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐదు నౌకలు తమకు భారత్‌తో సంబంధం ఉన్నదని చెప్పుకున్నాయి. ‘ఆల్‌ ఇండియా క్రూ’, ‘ఇండియన్‌ క్రూ ఆన్‌బోర్డ్‌’, ‘ఆల్‌ ఇండియన్‌ ఆన్‌బోర్డ్‌’ వంటి సందేశాలను ప్రదర్శించాయి. వీటికి తోడు భారత్‌ పతాకమున్న నాలుగు కార్గో నౌకలు, మన దేశం వైపు వస్తున్న మరో నౌక కూడా జలసంధిలోనే ఉన్నాయి.

యుద్ధానికి నిధులు నిలిపేయండి : అమెరికా కాంగ్రెస్‌కు లేఖలు
యుద్ధంపై అమెరికాలో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. యుద్ధానికి నిధులు నిలిపివేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌కు 250 సంస్థలు లేఖను అందజేశాయి. యుద్ధంలో మొదటి ఆరు రోజులలో అమెరికా 11.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిందని, ఆహార సబ్సిడీల వంటి అత్యవసర దేశీయ అవసరాలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం యుద్ధం కోసం వెచ్చిస్తోందని తెలిపాయి. అమెరికా దళాలను ఇరాన్‌లో మోహరించాల్సిన అవసరం లేదని, యుద్ధం మాత్రం కొంతకాలం కొనసాగవచ్చునని రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సే గ్రహం చెప్పారు. ‘యుద్ధం ఇవాళ ముగుస్తుందని నేను అనుకోవడం లేదు’ అని అన్నారు.

అమెరికా విమాన వాహక నౌకపై దాడి చేశాం : ఐఆర్‌జీసీ
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమ దాడితో ఆ నౌక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని, అది గల్ఫ్‌ జలాల నుంచి అత్యంత వేగంగా వెనుదిరిగి పోయిందని తెలిపింది. అయితే ఐఆర్‌జీసీ ప్రకటనను అమెరికా ఖండించింది. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కి తమ యుద్ధ నౌక మద్దతు కొనసాగిస్తోందని చెప్పింది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌కు సమీపంగా వచ్చిన ఇరాన్‌ నౌకపై అమెరికా నౌకాదళం కాల్పులు జరిపిందని సీబీఎస్‌ న్యూస్‌ తెలియజేసింది.

పెషావర్‌లో అమెరికా కాన్సులేట్‌ మూసివేత
పాకిస్తాన్‌ పెషావర్‌లోని కాన్సులేట్‌ను శాశ్వతంగా మూసివేయాలని అమెరికా విదేశాంగశాఖ నిర్ణయించింది. అఫ్గానిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం ఇదే. 2001లో అఫ్గానిస్థాన్‌పై అమెరికా దాడి ప్రారంభానికి ముందు, తరువాత ఈ కాన్సులేట్‌ కీలక ఆపరేషన్లు, లాజిస్టిక్స్‌కు కేంద్రంగా పనిచేసింది. అయితే ఇటీవల కాంగ్రెస్‌కు పంపిన నోటిఫికేషన్‌లో కాన్సులేట్‌ను మూసివేయాలనుకుంటున్నట్టు అమెరికా విదేశాంగశాఖ తెలియజేసింది.

దీనివల్ల ఏటా సుమారు 7.5 మిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయని, పాకిస్తాన్‌లో అమెరికా జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. ఇది ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కాదని, దాదాపు ఏడాదికిపైగా పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని కరాచీ, పెషావర్‌ నగరాల్లో నిరసనలు జరిగిన సమయంలో అమెరికా కాన్సులేట్లు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇకపై అమెరికన్‌ పౌరులకు సంబంధించిన సేవలను ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నిర్వహించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -