విపత్తులతో నష్టపోతున్న అన్నదాతలకు అందని ఆపన్నహస్తం
31,504 ఎకరాల్లో నష్టం జరిగినట్టు సర్కారు ప్రకటన
మామిడి, పసుపు, మిర్చి పంటలపై లేని స్పష్టత
ఫసల్‌బీమాతో కంపెనీలకే లాభమని తప్పుకున్న బీఆర్‌ఎస్ సర్కారు
ఆ తర్వాత సొంత పాలసీ ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం
బీమా పేరుతో కంపెనీలకు కట్టబెట్టొద్దు…రైతులకే నేరుగా ఇవ్వాలంటున్న రైతు సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతున్న అన్నదాతలకు పాలకుల నుంచి ఆపన్నహస్తం దక్కట్లేదు. దీంతో పంటలకు బీమా, రైతన్నలకు ధీమా లేకుండా పోతున్నది. రాష్ట్రంలో ఆహార పంటల నష్టాన్నే రాష్ట్ర సర్కారు అధికారంగా ప్రకటించిందిగానీ పెద్ద ఎత్తున నష్టపోయిన మామిడి, పసుపు, మిర్చి పంటల నష్టాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పంటల బీమా పేరుతో వేల కోట్ల రూపాయలు కేటాయించకుండా ప్రభుత్వమే నేరుగా పంట నష్టపోయిన రైతులకు ఇస్తే మరింత మేలు జరిగే అవకాశముంటు ందని రైతు సంఘాలు ఘోషిస్తున్నా పాలకుల చెవికెక్కట్లేదు. రైతులకు పంట నష్టపరిహారంపై స్పష్టమైన విధానం ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. రాష్ట్రంలో మార్చి చివరి వారంలో కురిసిన వడగండ్ల వానలు, గాలి దుమారాలతో రైతులు పెద్ద ఎత్తున తమ పంటలను కోల్పోయారు. రాష్ట్రంలోని 86 మండలాల్లో 31,504 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
అందులో అత్యధికంగా 15,991 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. 7,839 ఎకరాల్లో వరి, 787 ఎకరాల్లో నువ్వులు, 153 ఎకరాల్లో పొద్దుతిరిగుడు, 298 ఎకరాల్లో జొన్న పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. మార్చి 31న నిజామాబాద్ పసుపు మార్కెట్‌కు 4,500 పసుపు కుప్పలు (27,400 బ్యాగులు) రాగా అందులో 500 కుప్పలు వానకు తడిసిన పరిస్థితి. అందులో వంద కుప్పల వరకు తీవ్రంగా తేమకు గురయ్యాయి. మిర్చి కల్లాల్లో దెబ్బతిన్నది. పైన చెప్పిన లెక్కలన్నీ ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు మాత్రమే. అయితే, వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఈ పంట నష్టాలు రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని రైతు సంఘాలు ఎత్తిచూపుతున్నాయి. ఈ పంటలే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గాలి దుమారానికి మామిడి తోటల్లో మామి డి పిందెలు, కాయలు రాలి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో చేతికొచ్చే సమయంలో పండు మిర్చి దెబ్బతిన్నది.
మార్కెట్లలో ధాన్యం, పంటలు తడవకుండా వసతులేవి?
ఈ ఏడాది రైతులు మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకురాగా నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండతో పాటు పలు జిల్లాల్లోని పలు యార్డుల్లో కుప్పలుగా పోసిన ధాన్యం మోరీల్లో కొట్టుకుపోయిన విషయం విదితమే. దాని నుంచి అధికారులు గుణపాఠాలు నేర్వనట్టున్నది. తాజాగా నిజామాబాద్ మార్కెట్‌కు రైతులు పెద్ద ఎత్తున పసుపు పంటను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో 500 కుప్పలను రైతులు ఆరుబయటనే పోసి కవర్లు కప్పారు. అకాల వర్షాలతో వంద కుప్పల వరకు తడిసిపోయాయి. వాతావరణ మార్పుల్లో భాగంగా మార్చి నెలలో 15వ తేదీ తర్వాత, ఏప్రిల్ మాసంలోని మొదటి పక్షం రోజులు రాష్ట్రంలో వడగండ్ల వానలు, గాలి దుమారాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుందనే విషయం విదితమే.
మార్కెట్‌కు పంట వస్తుందనే విషయమూ అధికారులకు తెలుసు. అలాంటప్పుడు ముందస్తుగా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచితే రైతుల పంట తడవకుండా కొంతమేరకైనా నిలువరించవచ్చు. కానీ, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా నిజామాబాద్ మార్కెట్‌లో వర్షానికి పసుపు పంట తడిసిన తర్వాత 1500 టార్పాలిన్ పంపిణీకి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసింది. సీజన్‌లో అకాల వర్షాలకు గురికాకుండా కొంత ముందుగానో, కొంత వెనుకగానో పంటను సాగు చేసుకోవాలనే విషయాన్ని అన్నదాతలకు అవగాహన కల్పించడంలో మన వ్యవసాయ శాఖ వైఫల్యం, అధికారుల సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దీనికంతటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద వ్యవసాయంపై సమగ్ర ప్రణాళిక లేకపోవడమేననే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.
పంట నష్టపోతే ఆదుకుంటున్నది అంతంతే…
ఫసల్‌బీమా పథకం ద్వారా రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కట్లేదు. బీమా కంపెనీలకే లాభం చేకూరుతుందనే కారణం చెప్పి గత బీఆర్‌ఎస్ సర్కారు ఆ పథకం నుంచి తప్పుకున్నది. ఆ సమయంలోనే గుజరాత్, ఏపీ, బెంగాల్, కేరళం, తదితర రాష్ట్రాలు కూడా తప్పుకున్నాయి. అందులో కొన్ని రాష్ట్రాలు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పాలసీలు రూపొందించాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకసారి మాత్రమే పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇచ్చింది. గతంలో హుడా కమిటీ చేసిన సూచనలను పాలకులు పెడచెవిన పెట్టారు. వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున, ఆహార పంటలకు రూ.25 చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ ప్రస్తావన అటకెక్కింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నది. అయితే, ఏ ప్రాతిపదికన ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఫసల్‌బీమా నుంచి తప్పుకున్న తర్వాత రాష్ట్ర సర్కారు ఒక ప్రత్యేక పాలసీ అంటూ నిర్ణయించలేదు.



