రంగంలోకి 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు
ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలు
రూ.15 కోట్లతో 3 కొత్త రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు : వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా, ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం, త్వరలోనే ఒక కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి.. ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ జలవిహార్ నుంచి మొదలైన ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌ను సోమవారం మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, బిజీ లైఫ్ స్టైల్, పెరుగుతున్న అర్బనైజేషన్ వల్ల ఇంట్లో వంట చేసుకోవడం తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు.
ఈ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ కూడా వేగంగా విస్తరించిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం, నగరాల్లో రెడీ టు ఈట్, ప్రాసెస్‌డ్ ఆహార పదార్థాలకు ఉన్న అధిక డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. ఈ పరిస్థితిని కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఆహారాల్లో కల్తీకి పాల్పడుతున్నారన్నారు. ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, టీ పొడి ఇలా దేన్నీ వదలడం లేదని తెలిపారు. మరోవైపు నాసిరకం నూనెలు, నాణ్యత లేని పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నారని, కల్తీ, నాసిరకం ఆహారం వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని చెప్పారు. దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అధిక బరువు వంటి సమస్యలకు కూడా కల్తీ, నాసిరకం ఆహారం కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అంతటా నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారం పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతర తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని, గడిచిన రెండేండ్లలో 11వేలకుపైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నాసిరకం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, భవిష్యత్‌లోనూ ఈ తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపామని తెలిపారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్లతో 3 కొత్త రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమిష్టి బాధ్యత అని తెలిపారు. ”ఈట్ రైట్-స్టే హెల్తీ” అనే సందేశాన్ని అందరం ఆచరిద్దాం.. కలిసికట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.



