Wednesday, March 18, 2026
E-PAPER
Homeమానవిపండుగ రోజు ప‌సందుగా…

పండుగ రోజు ప‌సందుగా…

- Advertisement -

బెల్లం భక్ష్యాలు
కావల్సిన పదార్థాలు: శనగపప్పు – రెండు కప్పులు, యాలకుల పొడి – అర చెంచా, మైదా పిండి – రెండు కప్పులు, గోధుమ పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, బెల్లం తురుము – రెండు కప్పులు, నెయ్యి – అర కప్పు, ఉప్పు – చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తర్వాత పప్పును కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మూడు విజుల్స్‌ వచ్చిన తర్వాత కుక్కర్‌ మూత ఓపెన్‌ చేసి, రెండు కప్పుల బెల్లం తురుము వేసి, మీడియం సైజు మంటపై ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసి ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి తీసుకొని అందులో గోధుమ పిండి, నీళ్లు, నెయ్యి వేసి మంచిగా చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చపాతి పిండిని చిన్న ముద్దల్లా చేసుకొని వాటి మధ్యలో ఉడకబెట్టిన శనగపిండి, బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దాల్లా పెట్టి పూరీల సైజులో ఒత్తుకోవాలి. మళ్లీ స్టవ్‌ ఆన్‌ చేసి, పాన్‌ పెట్టి, కాస్త నెయ్యి వేసి, మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. బంగారు రంగులో వచ్చే వరకు కాల్చుకుంటే వేడి వేడి ఉగాది స్పెషల్‌ భక్ష్యాలు రెడీ.

మామిడికాయ పులిహోర
కావల్సిన పదార్థాలు: అన్నం – మూడు కప్పులు, పుల్లటి మామిడికాయ – ఒకటి, శెనగపప్పు – టీ స్పూను, పల్లీలు – పావు కప్పు, జీడిపప్పు పలుకులు – పది, మినప్పప్పు – టీ స్పూను, పచ్చిమిర్చి – నాలుగు, ఎండుమిర్చి – ఐదు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, జీలకర్ర – అర టీస్పూను, ఆవాలు – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను, ఇంగువ – కొద్దిగా, నువ్వులు – రెండు టీస్పూన్లు, మెంతులు – అర టీస్పూను, ధనియాలు – టీస్పూను.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో అన్నాన్ని ఆరబెట్టాలి. మామిడికాయ చెక్కు తీసి సన్నగా తురిమి అన్నంలో కలపాలి. అలాగే పచ్చిమిర్చి పొడవుగా చీల్చాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులను విడివిడిగా వేగించి పొడి కొట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, నువ్వుల పొడి వేసి పోపు పెట్టాలి. దాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.

షీర్‌ ఖుర్మా
కావల్సిన పదార్థాలు: సన్నని సేమియా – 150 గ్రా., పాలు – 2 లీటర్లు, ఖర్జూరం – 12, యాలకులు – 6, బాదం – 10, పిస్తా – 10, కిస్‌మిస్‌ – 10, జీడిపప్పు – 10, చక్కెర – 250 గ్రా., నెయ్యి – ఒక టేబుల్‌స్పూన్‌, ఫ్రెష్‌ క్రీమ్‌ – అర కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా ఖర్జూరం తీసుకుని వాటిలోని గింజలు తీసేయాలి. ఒక గిన్నెలో లీటర్‌ పాలు పోసి అందులో ఖర్జూరాలు వేసి ఉడికించాలి. చిక్కగా మరిగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు పాలను దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఖర్జూరాలను మాత్రం తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. యాలకులను పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి సేమియాను గోల్డెన్‌ బ్రౌన్‌ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇందులో కిస్‌మిస్‌ ఒక నిమిషం పాటు ఉంచాలి. దీంట్లోనే ఖర్జూరం ముక్కలు, మరిగించిన పాలు, మిగిలిన లీటర్‌ పాలు కూడా పోసి బాగా మరగనివ్వాలి. పదినిమిషాల తర్వాత చక్కెర వేసి దించాలి. చివరగా ఫ్రెష్‌ క్రీమ్‌ని కలిపి బాదం, పిస్తా, జీడిపప్పులతో గార్నిష్‌ చేయాలి. దీన్ని వేడిగా తిన్నా లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా తిన్నా బాగుంటుంది.

మటన్‌ హలీం
కావల్సిన పదార్థాలు: మటన్‌ ఖీమా – ముప్పావు కేజీ, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను, పసుపు – అర టేబుల్‌స్పూను, దాల్చినచెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, సోంపు – టేబుల్‌ స్పూను, మిరియాలు – టేబుల్‌స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, గోధుమరవ్వ – అరకప్పు, మినపప్పు – టేబుల్‌ స్పూను, కందిపప్పు – టేబుల్‌ స్పూను, పచ్చిశనగపప్పు – టేబుల్‌ స్పూను, పెసరపప్పు – టేబుల్‌ స్పూను, బియ్యం – టేబుల్‌ స్పూను, ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిగడ్డ – నాలుగు, కొత్తిమీర – పావుకప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు – రెండు, మిరియాల పొడి – అర టేబుల్‌ స్పూను, పెరుగు, ఒకటిన్నర కప్పు, నెయ్యి – ఆరు టేబుల్‌ స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ – గార్నిష్‌కు సరిపడా.
తయారు చేసే విధానం: కుక్కర్‌ గిన్నెలో మటన్‌ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి. దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి కలిపి సన్నని మంటమీద ఐదారు విజిల్స్‌ రానివ్వాలి. మరో కుక్కర్‌ తీసుకొని గోధమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన మటన్‌ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ తరుగును గోల్డెన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ వేగాక మిరియాల పొడి, పసుపు, పెరుగు ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.

ఈ ఏడాది ఉగాది, రంజాన్‌ పక్కపక్కనే వచ్చాయి. ఈ రెండు పండుగలు మతసామరస్యానికి చిహ్నాలుగా చెప్పుకోవచ్చు. తెలుగు వారందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఉగాది అయితే, ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునేది రంజాన్‌. ఉగాది నాడు చేసుకునే పచ్చడి ఎలాగైతే మతాలకతీతంగా పంచుకుతింటారో, రంజాన్‌ నాడు ముస్లింలు చేసుకునే షీర్‌ కుర్మా కూడా అందరూ ఆరగిస్తారు. ఇక హలీం అయితే లొట్టలేసుకొని మరీ తింటారు. కొన్ని రుచికరమైన వంటలతో పండుగను మరింత సంబరంగా జరుపుకోవచ్చు. అలాంటి వంటకాల గురించి తెలుసుకుందాం…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -