గ్యాస్ ధరల పెంపుపై ఐద్వా ఆందోళన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
గ్యాస్ సిలిండర్ల ధరల పెంపును ఉపసంహరించుకోవాలని ఐద్వా అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీకే శ్రీమతి టీచర్, కనినికా ఘోష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీకే శ్రీమతి టీచర్, కనినికా ఘోష్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాధికారతను సమర్థించే రోజని, అయితే దేశంలోని వంటగదుల్లో వాస్తవికత వేరే కథను చెబుతోందని అన్నారు. ఉపశమనం కలిగించే బదులు, గ్యాస్ ధరలను 60 శాతం పెంచి దేశంలోని మహిళలకు అణిచివేత, ఆర్థిక భారం రూపంలో ‘బహుమతి’ ఇచ్చారని విమర్శించారు. ఉజ్వల వంటి సంక్షేమ పథకాల విజయాన్ని కేంద్రం ప్రచారం చేస్తున్నప్పటికీ, ధరల పెంపు ఆ పేద లబ్దిదారులనూ వదిలిపెట్టదని అన్నారు. సబ్సిడీ లేని ఎల్పీజీ ఒకే ఏడాదిలో రూ. 110 పెరిగిందని, ఈ వారం వాణిజ్య సిలిండర్ ధర రూ.114.50 పెరిగిందని తెలిపారు. ఈ ‘ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణం’ రెండు వైపులా పదును గల కత్తి లాంటిదని విమర్శించారు. ఇది ఇంట్లో వండిన ఆహార పదార్థాల ధరను పెంచుతూ, ఇప్పటికే తగ్గిపోతున్న వాస్తవ ఆదాయాలతో కుంగిపోతున్న మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలను పెంచుతుందన్నారు. ఈ అస్థిరతకు మూలం.. పెరుగుతున్న పశ్చిమాసియా వివాదంలో ఉందని, బ్రెంట్ ముడిచమురు ఒకేవారంలో దాదాపు 27శాతం పెరగడం, ఎల్‌ఎన్జీ సరఫరా అంతరాయం ఎదుర్కొంటున్నందున, ఇండియా ఇంధన భద్రత ముట్టడిలో ఉందన్నారు. అయితే, ఈ సంక్షోభం పాశ్చాత్య ఆధిపత్యానికి ‘లొంగిపోవడాన్ని’ ప్రతిబింబిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ ప్రపంచ ఆధిపత్య ప్రయోజనాలకు సేవ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఈ పెంపును సామాన్యుడిపై ప్రత్యక్షదాడిగా ఐద్వా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ధరలను తగ్గించాలని, పశ్చిమాసియా సంఘర్షణను తన సొంత అపరాధాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగించడం మానేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపు చర్యను ప్రతిఘటించడానికి, ఆర్థిక సార్వభౌమత్వాన్ని డిమాండ్ చేయడానికి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దౌత్యపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటే, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సామాన్యుడిపై ప్రత్యక్ష దాడి
- Advertisement -
- Advertisement -



