రూ.7.83 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు : ఏసీబీ సోదాల్లో నగదు, బంగారం స్వాధీనం
నవతెలంగాణ -సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ-1)గా విధులు నిర్వహించిన కందాడి మధుసూధన్ రెడ్డి (సస్పెన్షన్‌లో ఉన్నారు)పై అసమాన ఆస్తుల కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణల ప్రకారం) సెక్షన్ 13(1)(b), 13(2) కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించి శుక్రవారం మధుసూధన్ రెడ్డి నివాసంతోపాటు అతని బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతంలో వీధి నెం.8లో 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ ఇల్లు (జీ+2), ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గ్రామంలో ఓపెన్ ప్లాట్, పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగళ్‌పల్లి గ్రామంలో ఒక ఎకరం వాణిజ్య భూమి, అలాగే పరిగి మండలం నస్కల్‌లో రూ.1.24 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఇవే కాకుండా సోదాల సమయంలో సుమారు రూ.9 లక్షల నగదు, సుమారు 1.2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక ఇన్నోవా ఫార్చ్యూనర్ కారు, వోల్వో ఎక్స్‌సీ 60 బీ5 కారు, వోక్స్‌వ్యాగన్ టైగన్ జీటీ ప్లస్ కారు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చర ఆస్తుల విలువ సుమారు రూ.7,83,35,302గా అధికారులు అంచనా వేశారు. మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా ఏఓ ఏఆర్‌కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు రూ.80 లక్షల పెట్టుబడులు పెట్టినట్టు, అతని భార్య, పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అదనపు ఆస్తులపై మరింత ధ్రువీకరణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్(సీఐయూ) ఫిండెన్ ఎస్ మాట్లాడుతూ.. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌పై అసమాన ఆస్తుల కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



