Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయందద్దరిల్లిన పార్లమెంట్‌

దద్దరిల్లిన పార్లమెంట్‌

- Advertisement -

అమెరికా సుంకాలు, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పైనే చర్చ
ట్రంప్‌ సుంకాల విధింపుపై ప్రధాని సమాధానం చెప్పాలి : ప్రతిపక్షాలు
వాయిదాల పర్వంలో ఉభయ సభలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

అమెరికా సుంకాలు, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌ దద్దరిల్లింది. సభ లోపల, వెలుపల ప్రతిపక్షాలు ఆందోళనతో హౌరెత్తించాయి. ఇండియాపై 25 శాతం సుంకాల విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని, బీహార్‌ ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్‌ సవరణ (ఎస్‌ఐఆర్‌)పై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర వాణిజ్య శాఖమంత్రి పియూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో ట్రంప్‌ సుంకాలపై ప్రకటన చేశారు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.
గురువారం లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేబూని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆరు నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగడంతో సభ ఆరు నిమిషాల్లోనే సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యనే అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. అనంతరం తొమ్మిది నిమిషాల్లోనే సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఇటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. రాజ్యసభను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రారంభించారు. జీరో అవర్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ఇదే పరిస్థితి కొనసాగడంతో కొన్ని నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్యానల్‌ డిప్యూటీ చైర్మన్‌గా సస్మిత్‌ పాత్ర వ్యవహరించారు. ప్రతిపక్షాల ఆందోళనతో సభ ఆరు నిమిషాల్లోనే సాయంత్రం 4.30 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ నిర్వహించారు. అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
జాతీయ ప్రయోజనాల కోసం ప్రతి అడుగు : పియూష్‌ గోయల్‌
కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లా డుతూ ఇండియాపై సుంకాలను పెంచాలని అమెరికా ఉత్తర్వు జారీ చేసిందన్నారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అమెరికా దిగుమతులపై 10-15 శాతం సుంకం గురించి చర్చ జరిగిందన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారని, ఇరుపక్షాల మధ్య నాలుగు రౌండ్ల చర్చలు జరిగినట్టు వెల్లడించారు. అనేక వర్చువల్‌ సమావేశాలు జరిగాయని, జాతీయ ప్రయోజనాల కోసం ప్రతి అడుగు తీసుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 5 నుంచి 10 శాతం బేస్‌లైన్‌ సుంకం అమలైందని, కానీ ఇప్పుడు ఇండియాపై మొత్తం 26 శాతం సుంకం ప్రకటించారన్నారు. దీని తర్వాత, ఏప్రిల్‌ 9 నుంచి దేశ నిర్దిష్ట అదనపు సుంకాన్ని అమలు చేయాల్సి ఉందని, కానీ ఏప్రిల్‌ 10న అమెరికా మొదట దాన్ని 90 రోజులు వాయిదా వేసిందని, ఆపై 2025 ఆగస్టు 1 వరకు పొడిగించిందని తెలిపారు. భారత ఎగుమతిదారులు నష్టపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ విషయంపై అమెరికాతో చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఆయన చెప్పారు.
11 ఏండ్ల స్నేహం ఫలితం : అఖిలేశ్‌ యాదవ్‌
అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ 11 ఏండ్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో బీజేపీ ప్రభుత్వం స్నేహాన్ని కొనసాగిస్తోందని, ప్రస్తుతం దేశమంతా ఆ స్నేహ ఫలితం ఎంత గొప్పగా ఉందో చూడాల్సి వచ్చిందని విమర్శించారు. దేశానికి గడ్డుకాలం ప్రారంభమయింద న్నారు. యువతకు ఉద్యోగాలు అవసర మని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితేనే ఉపాధి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా సుంకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రియాంక గాంధీ ”సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారో అందరూ చూశారు. ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తాను నిరోధించానని ఆయన పునరుద్ఘాటించారు. రెండు అంశాలపై ఇండియా స్పందించాల్సి ఉన్నప్పటికీ ఆ చర్య ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాని మోడీ వెళ్ళిన ప్రతి దేశంతోనూ స్నేహాన్ని కొనసాగిస్తారు. ఫలితంగా దేశానికి ఏం ఉపయోగం ఉందో.. ఆయన విదేశీ పర్యటనల పర్యవసానాలు ఎవరి కోసమో అర్థం కావడం లేదు” అని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -