నవతెలంగాణ – శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని ధర్మారం శివారులో ఉన్న అమ్మవారి కుంట భూమి అన్యాక్రాంతం అవుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 106లో ఉన్న ఈ కుంట 2 ఎకరాల 26 గుంటల విస్తీర్ణంలో ఉండాలని, అయితే పక్కనే ఉన్న చింతిరెడ్డి, కొండల్ రెడ్డి అనే రైతు, ఈ భూమిని కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు, వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పశువులకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఈ కుంట భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే ఈ అంశంపై దృష్టి సారించి అమ్మవారి కుంట భూములను కబ్జాదారుల నుంచి విడిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.