తనకు పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకం
మెదక్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-మెదక్‌టౌన్
కన్న ప్రేమను మరచి, అనుమానంతో ఓ తండ్రి కసాయిగా మారాడు. తనకు పుట్టలేదన్న అనుమానంతో మూడేండ్ల చిన్నారని కూడా చూడకుండా తాడుతో ఉరివేసి హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా రూరల్ మండలం పెద్దబాయి తండాలో కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దబాయి తండాకు చెందిన భాస్కర్‌కు, ఆరేండ్ల క్రితం తిమ్మక్కపల్లి తండాకు చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల భాస్కర్ తన భార్యను కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె తన కుమారుడిని భాస్కర్ వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి దగ్గర లేని సమయంలో కుమారుడిని సంరక్షించాల్సిన తండ్రి, ఆ చిన్నారి తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్నాడు. పసివాడని కూడా చూడకుండా తాడుతో మెడకు ఉరి బిగించి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.



