Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహారాష్ట్ర 'పంచాయతీ' బరిలో నిలిచేందుకు కూతురును హత్య చేసిన తండ్రి

మహారాష్ట్ర ‘పంచాయతీ’ బరిలో నిలిచేందుకు కూతురును హత్య చేసిన తండ్రి

- Advertisement -

బతికుండగానే కాలువలో తోసేసి ఘాతుకం
కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడి

నవతెలంగాణ-ఎడపల్లి
రాబోయే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలుంటే అనర్హుడిని అవుతానని భావించిన తండ్రి.. కన్న కూతురినే చంపేందుకు బతికుండగానే కాలువలోకి తోసేశాడు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు కమిషనర్‌ సాయిచైతన్య సోమవారం ఎడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల 29న ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు గ్రామ సమీపంలోని నిజాంసాగర్‌ డీ46 కాలువలో ఓ చిన్నారి నీటిలో శవమై కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాచి (6)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బందిని మూడు బృందాలుగా ఏర్పాటు చేశారు.

అయితే పోలీసు కానిస్టేబుల్‌ సుధీర్‌ పీసీ-630 చిన్నారి హత్య విషయమై వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో అతని బంధువులైన మహారాష్ట్రకు చెందిన ముకేడ్‌ వాసులు చూసి పాప ముకేడ్‌ తాలూకా కేరూర్‌ గ్రామానికి చెందినదిగా సమాచారం ఇచ్చారు. దాంతో జిల్లా పోలీస్‌ బృందం కేరూర్‌ గ్రామానికి వెళ్లి మృతి చెందిన పాప ఆ గ్రామానికే చెందినదిగా గుర్తించారు. గ్రామానికి చెందిన కొండమంగలె పాండురంగ, అతని భార్య ముగ్గురు పిల్లలతో కలిసి మంగలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలుంటే అనర్హులు అవుతామని భావించి అందుకు గానూ ముగ్గురు పిల్లల్లో బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అప్పటికే అతని పేరుపై పుట్టిన సర్టిఫికెట్‌ ఉంది.

అందుకు పూనే కార్పొరేషన్‌కు వెళ్లి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ పుట్టినతేదీ మార్చరాదనే విషయం తెలిసిన తర్వాత భార్యభర్తలిద్దరూ పథకం పన్నారు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్టు చెప్పాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెద్ద కూతురు ప్రాచికి అతని తండ్రి మాయమాటలు చెప్పి నిజామాబాద్‌ వెళ్తున్నట్టు నమ్మించాడు. అందులో భాగంగానే తన బైక్‌పై ఎక్కించుకుని మార్గమధ్యలో ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు గ్రామ సమీపంలోని నిజాంసాగర్‌ డీ46/8 కాలువలో తోసేశాడు. ఈ కేసును ఛేదించిన బోధన్‌ రూరల్‌ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్‌ఐ ముత్యాల రమ, రెంజల్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌, ఏఎస్‌ఐ బాబురావు, పోలీస్‌ సిబ్బంది సుందర్‌, శ్రీకాంత్‌ను నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య అభినందించి.. రివార్డును అందజేశారు. ఈ సమావేశంలో బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -