Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతల్లి లేని పిల్లల్ని పట్టించుకోని తండ్రికి హక్కులుండవు

తల్లి లేని పిల్లల్ని పట్టించుకోని తండ్రికి హక్కులుండవు

- Advertisement -

హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తల్లి మరణించాక ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలను విస్మరించడమే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న తండ్రికి ఆ పిల్లలపై హక్కులు ఉండవని హైకోర్టు పేర్కొంది. తల్లి మరణించాక తాత, నానమ్మ పరిరక్షణలో పిల్లలున్నారని గుర్తు చేసింది. కాబట్టి పిల్లలకు పాస్‌పోర్టు జారీకి తండ్రి సంతకం లేకుండానే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఉన్న పిల్లలకు తండ్రి ఆమోదంతో సంబంధంలేకుండా పాస్‌పోర్టు జారీ చేయాలని పాస్‌పోర్టు సంబంధాల అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కూతురు పిల్లలకు తండ్రి అనుమతి లేకుండా పాస్‌పోర్టు ఇవ్వడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ తాజుద్దీన్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. కింది కోర్టు పిల్లలకు పోషణ ఖర్చులు నెలకు రూ.12 వేలు చెల్లించాలంటే మళ్లీ పెళ్లి చేసుకున్నందున ఆ మొత్తాన్ని రూ.8 వేలకు తగ్గించుకున్న విషయాన్ని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు. తండ్రిగా బాధ్యతలను నిర్వహించని కారణంగా అతని సంతకం లేకపోయినప్పటికీ పాస్‌పోర్టు జారీ చేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కౌంటర్ల దాఖలు చేయరా?
రెండు వేర్వేరు కేసుల్లో ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే విధానాన్ని కొనసాగిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వికారాబాద్‌లోని దామగుండం రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతంలో రాడార్‌ కేంద్రాన్ని ఏర్పాటును సవాలు చేస్తూ ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. కౌంటర్‌ వేసేందుకు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలో వేసిన కౌంటర్‌లో లేని ఇతర విషయాలతో అఫిడవిట్‌ వేసేందుకు తమకు కూడా సమయం కావాలని కేంద్రం కోరింది.

దీంతో హైకోర్టు పైవిధంగా స్పందించింది. పలుసార్లు వాయిదా వేశామనీ, ఇకపై ఇవ్వబోమని చెప్పింది. విచారణను డిసెంబరు 15కు వాయిదా వేసింది. ప్రభుత్వ భూములకు చెందిన మరో కేసులో ప్రభుత్వం కౌంటర్‌ వేయకపోవడంతో జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మణికొండ జాగీర్‌ భూములు 1652 ఎకరాలను రిజిస్ట్రేషన్‌కు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైకోర్టు ఆగ్రహం తర్వాత ఏజీ విచారణకు హాజరై సమాచారం తెలియక కౌంటర్‌ వేయలేదన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూడాలని ఏజీని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

ఆర్డర్‌ అమలు చేయకపోతే కోర్టుకు రండి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
చేప పిల్లల విత్తనాల పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలన్న గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సివస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు అమలు చేస్తారా? లేదా? లేదంటే కోర్టుకు హాజరవుతారా అని ప్రశ్నించింది. ఏం చేయాలనుకున్నదీ మీరే తేల్చుకోవాలని సూచించింది. గత ఫిబ్రవరిలో ఆదేశించినప్పటికీ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చివరిసా రిగా నాలుగు వారాలు గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఉత్తర్వులను అమలు చేయకపోతే స్వయంగా విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పింది. విచారణను డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది.

2023-24 సంవత్సరానికి తాము అందజేసిన ఫిష్‌ సీడ్స్‌కు సంబంధించిన నగదు చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆర్కె ఫిషరీస్‌ ట్రేడర్స్‌ అండ్‌ సీడ్‌ సప్లయర్స్‌ యజమాని రాజ్‌కుమార్‌, ఇతరులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్‌ కాజా శరత్‌ విచారించారు. 2023-24 చేప సీడ్స్‌ పంపిణీకి సంబంధించిన మొత్తాల చెల్లింపుపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారు లను గత ఫిబ్రవరిలో న్యాయమూర్తి ఆదేశించారు.అధికారులు కావాలనే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ రాజ్‌కుమార్‌ సహా ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం కోరిన విధంగా నాలుగు వారాలు గడువు ఇస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు, ఒకవేళ ఈ గడువులోగా నగదు చెల్లించకపోతే తదుపరి విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -