– ఆకట్టుకున్న 150 కు పైగా వంటకాలు
– విద్యార్థులను అభినందించిన కెన్నెడీ పాఠశాల కరస్పాండెంట్, డైరెక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కెన్నెడీ పాఠశాలలో సోమవారం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, సుమారు 150 కు పైగా వివిధ రకాల తెలంగాణ సంప్రదాయ ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. కెన్నెడీ పాఠశాల కరస్పాండెంట్, డైరెక్టర్ సురేష్ డేనియల్ విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించి, వాటి తయారీ విధానం, పౌష్టిక విలువలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా సురేష్ డేనియల్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యాభ్యాసంలోనే కాకుండా పౌష్టికాహార తయారీ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహా తేజ, దయాసాగర్, పోచయ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



