ప్రయివేటు స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
30 నుంచి 40 శాతం పెంపుతో ఆగమవుతున్న తల్లిదండ్రులు
ఆ చట్టం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టిమరీ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 12 వేల ప్రయివేటు స్కూళ్లలో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేవటంలో విఫలమైందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజుల దోపిడీని ప్రోత్సహిస్తే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఒకే సారి 40 శాతం ఫీజులు పెంచితే పేద, మధ్యతరగతి పిల్లల తల్లి దండ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 7 నుంచి 8 శాతం ఫీజు మాత్రమే పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి తప్ప అంతకు మించి ఫీజుల దోపిడీకి సహకరించొద్దన్నారు. కార్పొరేట్లు, నార్త్ ఇండియన్స్ స్కూళ్లు ఏర్పాటు చేస్తుండటంతో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, కనీస దోబీ ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఎత్తిచూపారు. నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారనీ, ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆయా సంస్థలు వివిధ పేర్లతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతున్నాయని ఆరోపించారు.
వాటిలో పని చేసే ఉద్యోగులకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. వేలాది మంది విద్యార్థులకు నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో ఒకే చోట ఫుడ్ వండుతున్నారని, వాటిపై దాడులు చేసి విద్యార్థులకు మంచి భోజనం పెట్టే స్థాయిలో కూడా మన ప్రభుత్వాలు లేవని విమర్శించారు. తల్లిదండ్రులను గౌరవించని స్కూళ్లపై రైడ్ చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మె ంట్ బకాయిల పేరిట కాలేజీలు పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల రీత్యా సర్టిఫికెట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే విద్యాశాఖను స్వయంగా చూస్తున్న సీఎం కనీసం రివ్యూ చేయకపోవడం దారుణమన్నారు. నిజామాబాద్‌లోకి నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు రాకుండా తాను అడ్డుకున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ సంస్థలు నిజామాబాద్‌కు వచ్చాయని విమర్శించారు.
ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



