Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనల్లగొండ బీజేపీలో ముష్టి యుద్ధం

నల్లగొండ బీజేపీలో ముష్టి యుద్ధం

- Advertisement -

బీసీ నేత పిల్లి రామరాజుపై నాగం వర్షిత్‌రెడ్డి అనుచరుని దాడి
క్షమాపణ చెప్పాలని ఆఫీస్‌ ఎదుట బాధితుని అనుచరుల ఆందోళన
జర్నలిస్టుల కెమెరాలను లాక్కున్న జిల్లా అధ్యక్షులు
నిరసన తెలిపిన జర్నలిస్టులు


నవతెలంగాణ – నల్లగొండ టౌన్‌
నల్లగొండ బీజేపీలో ముష్టి యుద్ధం జరిగింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో బీసీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్‌పై జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి అనుచరుడు భౌతిక దాడి చేశాడు. దాంతో నాగం వర్షిత్‌రెడ్డి దౌర్జన్యం నశించాలంటూ కార్యాలయం ఎదుట రామరాజు యాదవ్‌, ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల కెమెరాలను నాగం వర్షిత్‌రెడ్డి లాక్కొని చిప్‌ను ఫార్మాట్‌ చేశాడు. దీంతో విలేకరులంతా ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. వివరాలలోకి వెళ్తే.. బీజేపీ నల్లగొండ జిల్లా కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌ రెడ్డి, బీజేపీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్‌ పిల్లి రామరాజు యాదవ్‌ మధ్య వివాదం జరిగింది.

బీజేపీ తరపున గెలిచిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ అభ్యర్థులకు మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి అనుమతి తీసుకొని పిల్లి రామరాజు యాదవ్‌ ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఫోన్‌ చేసి సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేయాలని నాగం ఆదేశించారని రామరాజు తెలిపారు. గురువారం ఉదయం వాజ్‌పేయి జయంతి వేడుకల సమయంలో నాగం వర్షిత్‌రెడ్డి సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పాడని రామరాజు చెబుతున్నారు. తనను నిర్వహించొద్దని చెప్పి.. ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో నాగం వర్షిత్‌రెడ్డి, రామరాజు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో నాగం అనుచరుడు పకీరు మోహన్‌రెడ్డి దూసుకొచ్చి రామరాజుపై పిడి గుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న నాగం ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా మోహన్‌రెడ్డికి మద్దతు పలికాడని రామరాజు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధి ఈ గొడవను రికార్డు చేయగా.. నాగం వర్షిత్‌ రెడ్డి మీడియా ప్రతినిధి కెమెరాను గుంజుకొని చిప్‌ను ఫార్మాట్‌ చేశాడు. దీంతో జర్నలిస్టులు తమపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి 28 వేల ఓట్లను తెచ్చుకున్నానని, బీజేపీపై ఉన్న ప్రేమతో ఈ పార్టీలో చేరానని చెప్పారు. అయితే నాగం వర్షిత్‌ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆయన ఆరోపించారు.

ఒంటెద్దు పోకడలతో పార్టీ కోసం కష్టపడే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం తనకు ఎవరూ పోటీ ఉండొద్దన్న ఆలోచనతో బలమైన పార్టీ నాయకులను ఉద్దేశపూర్వకంగా వర్షిత్‌ రెడ్డి దూరం పెడుతున్నారని అన్నారు. తనపై దాడి చేసిన మోహన్‌ రెడ్డి పార్టీ నాయకుల సమక్షంలో తనకు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని రామరాజు, ఆయన అనుచరులు భీష్మించుకూర్చున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయం ఎదుట విలేకరులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నాగం వర్షిత్‌రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పడంతో విలేకరులు ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -