సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఊరుకొక్కరున్నా ఆర్యవైశ్యులు ఆధిపత్యం చూపిస్తుంటారనీ, తెలంగాణ పునర్ నిర్మాణంలో వారిది కీలకపాత్ర అని చెప్పారు. తెలంగాణ ఆర్ధిక అభివృద్ధిలో వారు భాగస్వాములన్నారు. ఆర్య వైశ్యులకు 6 మున్సిపల్ చైర్మెన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని గుర్తుచేశారు. రాచరికంలో అధికారం మారాలంటే హింస తప్పనిసరిగా ఉండేదనీ, కానీ మహాత్మా గాంధీ ఒక్కరే అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని తెలిపారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింస, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంతో పారదోలిన గొప్ప తత్వవేత్త గాంధీ అని కొనియాడారు.
దేశ అభివృద్ధిలో ఆర్య వైశ్యులు భాగస్వాములనీ, అవకాశాలు వచ్చినా, రాకున్నా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఓపికతో ఉంటారని ప్రశంసించారు. తనకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనీ, ఆయనతో వాదించడం ,ప్రశ్నించడం గౌరవంగా ఉండేదని తెలిపారు. రోశయ్య విగ్రహం లక్డీకాపూల్‌లో పెట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామనీ, టీజీ వెంకటేష్ కూడా రాయలసీమలో ఇతరులకు ధీటుగా ఎదిరించి గెలిచి రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్యుల ఆలోచనలే ప్రభుత్వ విధానమనీ, వారి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినందుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి టీజీ భరత్, తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులకు సముచిత స్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



