Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజికన్నీటి వరద

కన్నీటి వరద

- Advertisement -

రాష్ట్రంలో రెండురోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉత్తర తెలంగాణ నిండా మునిగిపోయింది. ఇప్పటివరకు పదిమంది చనిపోయినట్టు వార్తలు రావడం తీవ్ర విషాదం. క్లౌడ్‌బరస్ట్‌తో కామారెడ్డి పట్టణం నీట మునగడం కలిచివేసే విషయం. ఇదివరకు లోతట్టు ప్రాంతాలే మునిగేవి, కానీ లోతట్టు, మైదాన అనే తేడా లేకుండా అన్నీ జలమయమవ్వడం బాధాకరం. ఇలాంటి జలవిపత్తు గతంలో ఎన్నడూ చూడలేదని స్థానిక ప్రజలు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. వర్షాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో వెనకబడింది. అధికార యంత్రాగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అయితే భారీ ప్రాణనష్టం జరగకుండా చూడగలిగింది. కానీ ఆస్తినష్ట నివారణలో పూర్తిగా చేతులెత్తేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది సహాయ చర్యలకు రంగంలోకి దిగినా అనేక ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఏరియల్‌ సర్వే చేసి,ప్రమాదంలో ఉన్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఈ వర్షం ప్రభావం ప్రధానంగా మెదక్‌, నిర్మల్‌, సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలపై తీవ్రంగా పడింది. సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మొన్నటివరకు యూరియా కొరత వేధించగా ఎలాగో అష్టకష్టాలు పడి ఎరువులేసి పంటల్ని కాపాడుకున్న రైతులను కుండపోతవాన నిండా ముంచింది. వరి, పత్తి, మొక్కజొన్న నీట మునగడంతో వారి వేదన వర్ణణాతీతం. వందలాది మూగజీవాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఏమీచేయలేని స్థితిలో గుండె చెరువైంది. పలుచోట్ల సదరన్‌ డిస్కం పరిధిలో ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో చాలాగ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. వాటిని పునరుద్ధరించే పరిస్థితి లేకపోవడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఆర్‌అండ్‌బికి దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కాయాకష్టం చేసి ఇండ్లు కట్టుకున్నవారి కలలు వర్షపు నీటిలో కల్లోలమయ్యాయి. వారికి రాష్ట్ర సర్కార్‌ భరోసానివ్వాలి. ముంపు ప్రాంతాలను సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా సమీక్షించారు. మంచిదే, కానీ బాధితులకు తక్షణ చర్యల కింద ఆర్థికసాయం అందించాలి.కేంద్రం కూడా ముంపు ప్రాంత బాధితులను ఆదుకునేందుకు ప్రకృతి విపత్తుల కింద పరిహారం ప్రకటించాలి.

మొన్నటివరకు తేలికపాటి వర్షాలు కురిసిన రాష్ట్రంలో ఒక్కసారిగా ఈ కుంభవృష్టికి కారణమేంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయు అల్ఫపీడనం తీరం దాడటంతో ఒక్కసారిగా రుతుపవనాల్లో వేగం పుంజుకుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీచేశారు. ఎస్సారెస్పీ ఇరవై ఐదు గేట్లను ఎత్తి నీటిని కింది వదులుతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలావరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు మోకాళ్లలోతు, నిలువెత్తు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఏదైనా ప్రమాదవశాత్తు విపత్తు సంభవిస్తే దాన్నుంచి ప్రజల్ని కాపాడుకునే సామర్థ్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు పెంచుకోవడం లేదు. ఎండకు, వానకు, చలికి ప్రాణనష్టం జరిగితే దాన్ని ప్రకృతీ వైపరిత్యాల కిందకు నెట్టేసి బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు. కాలంలో మార్పులు అనివార్యమైనప్పుడు వాటిని తట్టుకుని నిలబడే విధóంగా ఏర్పాట్లు చేసుకోవడం పాలకుల విధిగా ఉండాలి.

అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచ స్థాయిలో పోటీనిచ్చే మనం ఈ మేఘవిస్ఫోటనాలు, కుండపోత వానలకు పరిష్కార మార్గాలు కనుక్కోలేమా? వాతావరణంలో ఎందుకీ మార్పులు? అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టికి కారణాలేంటో పరిశీలన చేయాలి. నేడు ప్రకృతి ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందంటే అడవులు, కొండలు, గుట్టలు, నదులు ధ్వంసం కావడం కూడా కారణమే. మానవజాతికి ప్రయోజనకరమైన ప్రకృతి వనరులను కాపాడకపోవడం, వాటిని పెట్టుబడిదారులకు కట్టబెట్టడం ద్వారా వచ్చిన అనార్థాలివి. కొంతమంది బడాబాబుల కోసం నూట నలభై కోట్ల జనాభా గల దేశాన్ని ఇలాంటి ప్రకృతి ఉపద్రవాలకు గురిచేయడం తీవ్రమైన విషయం. పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తుండటమూ వీటికి కారణాలు. వరదల కారణంగా జరిగిన నష్టాల నుండి ప్రజలను పాలకులు వెంటనే ఆదుకోవాలి. వారి కన్నీళ్లను తుడవాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad