Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజి'ముక్కలవుతున్న' సమాజం!

‘ముక్కలవుతున్న’ సమాజం!

- Advertisement -

సినిమాలు, ఓటీటీల ప్రభావంతో పిల్లలు, పెద్దల్లో పైశాచిక ప్రవృత్తి రోజురోజుకూ పెరుగుతోంది. శాస్త్రీయత లేని టీవీ సీరియళ్లు ప్రజల్లో అజ్ఞానాన్ని వండి వారుస్తున్నాయి. రాజకీయ లబ్ధి, స్వార్థంతో తీసే ప్రాపగండా సినిమాలు ఈ ప్రవృత్తికి ”నెయ్యి అందిస్తూ సమాజాన్ని చీకటిలో మగ్గేలా- ఆరని అగ్నిహోమంగా” మారుస్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి నుంచి చిన్న కుటుంబాలకు సమాజం కుదించబడటంతో చెప్పేవారు లేక హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. 2025 ఆగస్టు 23న ఒళ్లు గగుర్పొడిచే ఒక హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న భర్త సామల మహేందర్‌ రెడ్డి అతికిరాతకంగా తన భార్య జ్యోతియాదవ్‌ను హత్యచేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు.ఈ ఘటన కంటే ముందు, భార్యలు తమ భర్తలను ప్రియుడితో కలిసి చంపి, డ్రమ్ములలో శవాలను కుక్కిన వెళ్ల మీద లెక్కబెట్టే ఘటనలు పురుషలోకాన్ని భయపెట్టాయి. తాము మాత్రమే ప్రమాదానికి గురైనట్టు, పురుషజాతి అంతరించిపోయే దశకు చేరుకున్నట్టు బెంబేలెత్తిపోయిన యువకులు స్త్రీద్వేషాన్ని సోషల్‌ మీడియాలో వెళ్లగక్కారు.


దేశంలో వరకట్నం కోసం గృహహింసకు గురై చాలామంది అమ్మాయిలు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జాతీయ నేర గణంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, 2022లో వరకట్నం వల్ల 6,516 మంది మహిళలు చనిపోయారు. 2022 ఏడాది వరకు వరకట్న మరణాలకు సంబంధించిన 60,577 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా, లైంగిక హత్యల కంటే 25 శాతం ఎక్కువగా వరకట్న మరణాలు 2022లో నమోదయ్యాయి. రెండేండ్ల క్రితం, 2023 ఫిబ్రవరిలో ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ మర్డర్‌ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. నూనుగు మీసలున్న యువకుడు హరిహర కృష్ణ తన ప్రేయసి నిహారికరెడ్డి చెప్పిందని హత్యచేశాడు. నవీన్‌ అనే వ్యక్తిని ప్రేమించిన నిహారిక శారీరకంగా కలిసింది. ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడి వీరిద్దరూ దూరం జరిగారు. ఈ క్రమంలో నిహారిక రెడ్డి జీవితంలో రంగప్రవేశం చేసిన హరిహరకృష్ణ, తన ప్రేయసి చెప్పిందని అతి కిరాతకంగా ”ముక్కలు ముక్కలుగా నరికి గుండెను కోసి బయటకు తీసి” నవీన్‌ను హత్యచేశాడు. ఈ ఘటన కంటే ముందు, అచ్చం మహేందర్‌ రెడ్డి- స్వాతి(జ్యోతి)యాదవ్‌లాంటి ఘటన 2022లో చోటు చేసుకుంది. అదే శ్రద్ధావాకర్‌- అఫ్తాబ్‌ పూనావాల ఘటన. ఈ హత్య దేశవ్యాప్తంగా ఎంతలా హాట్‌ టాపిక్‌గా మారిందో అందరికి తెలిసిన విషయమే. ఇందులో నివ్వెర పోయే విషయాలు బయటకు వచ్చాయి. అయితే, అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేయ కుండా, మానసికంగా విభజించబడ్డ ప్రస్తుత భారతీయ సమాజంలో ఈ హత్యను అడ్డుపెట్టు కుని కొందరు మరింత విషాన్ని కలిపారు.


2023లో జరిగిన మరో ఘటనలో ఒక గుడి పూజారి బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఆలయం పూజారి అయ్యగారి సాయిక్రిష్ణ- అప్సర అనే భక్తురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. తనను పెళ్లి చేసుకోమని అప్సర అడిగేసారికి బండరాయితో బాది హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ మధ్య జరిగిన చాలా ఘటనలు వెలుగులోకి వస్తాయి. వీటి వెనుక కారణమేంటనే పరిశీలిస్తే, సినిమా- సిరీస్‌ల ప్రభావం మాత్రమే కాదు స్వార్థం, మోహం, డబ్బు, అధికారం కూడా కారణాలుగా కనిపిస్తాయి. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన బ్యాట్‌ కోసం మర్డర్‌ కేసులో కూడా క్రైమ్‌ సిరీస్‌ ప్రభావం ఉందని తెలిసింది. సినిమాలు- సిరీస్‌లు సమాజం మీద మత్తు మందుకంటే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని దీని బట్టి అర్ధమవుతోంది. హత్యలకు కారణమవుతు న్నాయని తెలుస్తోంది. సమాజంలో జరుగుతోన్న దారుణాలను అరికట్టాలంటే, పిల్లలమీద తల్లిదండ్రులు నిఘాపెట్టాలి. హింసాత్మకమైన సిరీస్‌- సినిమాలు చూడకుండా తమను తాము పెద్దలు కట్టడి చేసుకోవాలి.సముద్రంలో ప్రయాణిస్తున్న పడవకు చిల్లు పడితే, దాని పక్కకు కూర్చున్న వ్యక్తికే కాదు, పడవలోని వారందరికి ప్రమాదమే. సమాజంలో అరాచకత్వం ప్రబలితే ఒక్కరికో ఇద్దరికో కాదు, అందరికీ సమస్యగా మారుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెదలాలి.
– సయ్యద్‌ ముజాహిద్‌ అలీ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad