9,10 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు
సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం పొంచి ఉందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
500 బిలియన్ డాలర్ల వ్యాపారం పేరిట దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికా మాటలు విని తక్కువ ధరకు చమురు ఇస్తున్నా కొనుగోళ్లను ఆపేయడం దుర్మార్గమన్నారు. ఒకవైపు ఆత్మనిర్భర భారత్ గురించి చెబుతూనే మరోవైపు దేశంలోకి వచ్చే వస్తువులపై సంకాలను పూర్తిగా తొలగించడం ఈ దేశ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజల జీవితాలను విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమేనని అన్నారు. ప్రస్తుత స్వేచ్ఛా ఒప్పందం అమలైతే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు సుంకాలు లేకుండానే యథేచ్ఛగా దేశంలోకి దిగుమతి అవుతాయనీ, దీనివల్ల దేశంలోని రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వెలిబుచ్చారు. ఢిల్లీలో చేపట్టిన రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోడీ సర్కారు మోసం చేస్తున్నదని విమర్శించారు. మద్దతు ధరల అమలు చట్టం గురించి మాట్లాడటం మానేసిందన్నారు.
ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచుతున్న తీరును ఎండగట్టారు. విత్తన చట్టంతో రైతులు విత్తనాలపై హక్కులను కోల్పోతారని తెలిపారు. విద్యుత్ చట్టం 2025 ద్వారా స్మార్ట్ మీటర్లు అమల్లోకి వస్తాయనీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పోతుందని తెలిపారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను రద్దుచేసి, పేదలకు ఉపాధి లేకుండా చేసే వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని తీసుకొచ్చి కేంద్రం ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. బడ్జెట్‌లో అవసరం మేరకు నిధులు కేటాయించకుండా 125 రోజల పని కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలకు నిరసనగా గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు ట్రంప్ దిష్టిబొమ్మలు దహనం చేయాలనీ, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కార్మికవర్గం నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో గ్రామ, గ్రామాన నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, వీఎస్‌రావు, పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.



