Wednesday, June 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచరిత్రను వక్రీకరించిన సినిమాకు, స్మగ్లర్‌ పాత్రకు గద్దర్‌ అవార్డులా..?

చరిత్రను వక్రీకరించిన సినిమాకు, స్మగ్లర్‌ పాత్రకు గద్దర్‌ అవార్డులా..?

- Advertisement -

– ఇది గద్దర్‌ ఆశయాలకే అవమానకరం
– మతతత్వ సినిమాలకు అవార్డు.. ప్రజాస్వామ్యానికి అప్రతిష్ట : టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

చరిత్రను వక్రీకరించిన సినిమాకు, స్మగ్లర్‌ పాత్ర పోషించిన వ్యక్తికి గద్దర్‌ అవార్డులివ్వడం గద్దర్‌ ఆశయాలకే అవమానకరమని, ప్రభుత్వానికి కూడా అప్రతిష్టకరమని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. గద్దర్‌ అవార్డులలో ఉత్తమ చారిత్రక చిత్రంగా రజాకార్‌ సినిమాను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉత్తమ చారిత్రక చిత్రంగా రజాకార్‌ సినిమాను ఎంపిక చేయడం కాంగ్రెస్‌ లౌకిక ప్రజాస్వామ్యానికి అప్రతిష్ట అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారం అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. అలాగే, ఉత్తమ మొదటి చిత్రంగా కల్కీకి ఇచ్చారని, కల్కీ, రజాకార్‌ చిత్రాలు మతతత్వ, చరిత్రను వక్రీకరించిన సినిమాలు అని విమర్శించారు. మతోన్మాదాన్ని ప్రేరేపించిన సినిమాలకు గద్దర్‌ పేరుతో అవార్డులు ఇవ్వడం ఆయనను అవమానించడమేనన్నారు. స్మగ్లర్‌ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా గద్దర్‌ అవార్డును ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్‌ అవార్డుల సెలక్షన్‌ కమిటీ ఏం ప్రామాణికతను పాటించిందని ప్రశ్నించారు. తక్షణమే సెలక్షన్‌ కమిటీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు సర్వ మతాలను సమానంగా గౌరవించి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతిని అభిమానిస్తారని చెప్పారు.
ఇలాంటి మతతత్వ సినిమాలకు సీఎం రేవంత్‌రెడ్డి అవార్డ్స్‌ ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా జానపద జేఏసీ చైర్మెన్‌ మురళీధర్‌ దేశ్‌పాండే, టీపీఎస్‌కే నగర ఉపాధ్యక్షులు పొన్నం రాజయ్య గౌడ్‌, ఆది వాసి కళాకారులు పాయం విజయ, మండేపూడి శమంతకమణి, కొప్పల పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -