Saturday, March 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపరిశ్రమలపై 'గ్యాస్‌' బాంబ్‌

పరిశ్రమలపై ‘గ్యాస్‌’ బాంబ్‌

- Advertisement -

మూతపడుతున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు
వెలవెలబోతున్న పారిశ్రామికవాడలు
పెద్ద పరిశ్రమలకూ గడ్డుకాలమే
ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్
లో లే ఆఫ్‌లు
ఇప్పటికే 40 శాతం మూత
అరకొరగా ఉత్పత్తి
ఉపాధి కోల్పోతున్న కార్మికులు

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

గ్యాస్‌ కొరత రాష్ట్రంలోని పరిశ్రమలపై తీవ్రంగా పడింది. ఇప్పటి వరకు దాదాపు 40 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ ఎమ్‌ఈ) మూతపడ్డాయి. భారీ పరిశ్రమల్లోనూ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనితో పారిశ్రామిక వాడలు వెలవెలపోతున్నాయి. కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో గ్యాస్‌ సరఫరా
నిలిచిపోవడంతో యూరియా, అమ్మెనియా ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేశారు.

కేంద్ర ప్రభుత్వం స్వయంగా దేశంలోని ఎరువుల ఉత్పత్తి కర్మాగారాలకు గ్యాస్‌ సరఫరాలో 30 శాతం అధికారిక కోత విధించింది. విద్యుదుత్పత్తి, పెట్రోకెమికల్స్‌, ఉక్కు, సిరామిక్స్‌, గాజు, టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌, ఆహార ప్రాసెసింగ్‌, ఫార్మస్యూటికల్‌ పరిశ్రమలు కూడా గ్యాస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఆస్పత్రుల్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యతలను నిర్దేశించింది.

కేటాయింపుల్లో కుదింపు
పరిశ్రమలకు గత వినియోగంతో పోలిస్తే సుమారు 80 శాతం మాత్రమే గ్యాస్‌ కేటాయింపు ఉండే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్‌ సరఫరా 50 శాతానికి తగ్గడంతో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయి. రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారం గ్యాస్‌ ఆధారంగా యూరియాను ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్రానికి సరఫరా అయ్యే గ్యాస్‌లో అత్యధిక భాగం ఇక్కడికే వస్తుంది. హైదరాబాద్‌-పటాన్‌చెరు, జడ్చర్ల, మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్‌ యూనిట్లు గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగిస్తాయి.

శంషాబాద్‌లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 40 శాతం ఉత్పత్తిని మాత్రమే చేస్తున్నాయి. బేకరీ, హోటల్‌ పరిశ్రమ కూడా నష్టపోతోంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ పంపిణీని నియంత్రిస్తుండటంతో పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయాలు పెరిగి, సామర్థ్యం తగ్గుతోంది. పెట్రోకెమికల్‌, ప్లాస్టిక్‌, పాలిమర్‌, కెమికల్‌ ఉత్పత్తుల్లో సహజ వాయువును ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. సరఫరా నిలిచిపోవడంతో ఉత్పత్తి ఆగిపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ పెట్రో ఆడిషన్స్‌, గెయిల్‌ పెట్రోకెమికల్‌ యూనిట్లకు కూడా కేంద్రం గ్యాస్‌ కేటాయింపులను తగ్గిస్తున్నట్టు సూచనప్రాయంగా తెలిపింది.

గ్యాస్‌ గండం
రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌, పటాన్‌చెరులోని అరబిందో ఫార్మా, బొల్లారం, బాచుపల్లిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్‌, జడ్చర్లలోని లారుస్‌ ల్యాబ్స్‌, శంషాబాద్‌లోని గ్రాన్యులెస్‌ ఇండియా వంటి భారీ పరిశ్రమలు గ్యాస్‌ ఆధారితంగా పనిచేస్తున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో మెదక్‌లోని ఐటీసీ ఫుడ్స్‌, సంగారెడ్డిలోని పెప్సీకో బాట్లింగ్‌, శంషాబాద్‌లోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో అనేక బేకరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్‌, ఫార్మా, ల్యాబ్స్‌, ప్రాసెస్‌ ఇండిస్టీస్‌, ఆస్పత్రులు ఎఫెక్ట్‌ అవుతు న్నాయి. డిఫెన్స్‌ అనుబంధ పరిశ్రమలు, ఆటోమోబైల్‌ పరిశ్రమల్లో 75 శాతం నష్టాల్లోకి వెళ్తున్నాయి.

ఫౌండ్రీ, క్యాస్టింగ్‌, ఫోర్జింగ్‌ ఇండస్ట్రీస్, హీట్‌ ట్రీట్‌మెంట్‌ పరిశ్రమల్లో వినియోగించే ఫర్నస్‌ ఆయిల్‌ మార్కెట్లో దొరకట్లేదు. దీనితో ఆయా పరిశ్రమలు లే ఆఫ్‌ను ప్రకటిస్తున్నాయి. గతంలో మూడు షిఫ్టుల్లో పనిచేసే పరిశ్రమల్లో కొన్ని ఒక్క షిఫ్టుకే పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో గడచిన 12 రోజుల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తి పరిశ్రమ 80 శాతం మూతపడింది. పాలిమర్‌ ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయింది. వర్జిన్‌ కిలోకు రూ.70 పెరిగింది. ముడిసరుకు సరఫరా లేదు. ఉత్పత్తి, సరఫరా నిలిచి పోయింది. రాష్ట్రంలో 15వేల ప్లాస్టిక్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి. దాదాపు లక్షమంది ప్రత్యక్షంగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారు. వారంతా ఎఫెక్ట్‌ అవుతారు.

ఇవి తెలుసా?
గ్యాస్‌ అనగానే మనకు తెలిసింది ఇంట్లో వంటచేసుకొనే సిలిండరే గుర్తుకు వస్తుంది. కానీ ఈ గ్యాస్‌లోనూ నాలుగు రకాలు ఉన్నాయి. లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ)ని ఇండ్లలో వంటకోసం వాడతారు. కంప్రెస్సెడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)ను వాహనాల్లో వాడతారు. పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) గ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఇండ్లు, రెస్టారెంట్లు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు సరఫరా చేస్తారు. మీటర్‌ రీడింగ్‌ ప్రకారం బిల్లులు వేస్తారు. కొన్ని కాలనీల్లో వంటగ్యాస్‌ కోసం కూడా ఈ పద్ధతిని వాడుతున్నారు. లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) దీన్ని పరిశ్రమలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లలో వాడతారు. ఈ గ్యాస్‌ ఎక్కువగా ఖతార్‌ దేశం నుంచి ఇండియాకు దిగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసేయడంతో భారతదేశానికి దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బఫర్‌ స్టాక్‌ నుంచి పరిమితంగా పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. ఆ ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్‌పీఏలు పెరుగుతాయి
బ్యాంకర్లు, పారిశ్రామిక సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి
ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ)

గ్యాస్‌ కష్టాలతో ఉత్పత్తి తగ్గి, మార్కెట్‌ అవకాశాలు కోల్పోవడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పరిశ్రమలకు గడ్డుకాలం దాపురించింది. ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. ఇరాన్‌-అమెరికా యుద్ధం ఇలాగే మరో పదిరోజులు కొనసాగితే అనేక పరిశ్రమలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) జాబితాలోకి చేరడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బ్యాంకర్లు, పారిశ్రామిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. రుణాల చెల్లింపులపై మారటోరియం విధించాలి. వడ్డీరేట్లను తగ్గించేలా ప్రభుత్వం చొరవచూపాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు గతంలో ఇవ్వాల్సిన పలు పారిశ్రామిక ప్రోత్సాహకాలు దాదాపు రూ.5,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణం విడుదల చేయాలి. పరిశ్రమలు మూసివేత దిశగా వెళ్తే, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. రాష్ట్రంలో గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల్లో దాదాపు లక్షమంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో పదిలక్షల మంది ఉన్నారు. వారంతా ఎఫెక్ట్‌ అవుతారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

తగ్గిన సరఫరా -పెరిగిన ధరలు
సీఎన్‌జీ వాహనాలకు కష్టాలు
ఎల్‌ఎన్‌జీ కిలోకి రూ. 70 పెంపు

తెలంగాణలో గ్యాస్‌ సరఫరా ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతుంది. కష్ణా-గోదావరి బేసిన్‌ (ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం)లోని గ్యాస్‌ క్షేత్రాల నుంచి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా జరుగుతుంది. రెండోది ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ (గుజరాత్‌) నుంచి దేశంలోని పలు రాష్ట్రాల మీదుగా తెలంగాణలోని పరిశ్రమలకు గ్యాస్‌ అందుతుంది. వీటిలో గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ జాతీయ గ్యాస్‌ పైప్‌లైన్‌తో పాటు భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ద్వారా హైదరాబాద్‌ సిటీకి సరఫరా జరుగుతున్నది. ఉత్తర తెలంగాణకు మహారాష్ట్ర న్యాచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌తో పాటు ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ ద్వారా రిలయన్స్‌ గ్యాస్‌ ద్వారా రవాణా జరుగుతుంది.

పరిశ్రమలకు సరఫరా చేస్తున్న గ్యాస్‌ ధరలు గడచిన 12 రోజుల్లో కిలోకు రూ.70కు పైగా పెరిగాయని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుందనీ, మార్కెట్‌లో పోటీని తట్టుకోవడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన వారం రోజుల్లో రాష్ట్రంలో గ్యాస్‌ సరఫరా డిమాండ్‌ కంటే 20-25 శాతం తక్కువగా ఉంది. హైదరాబాద్‌ ప్రాంతంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ వినియోగం పెరిగింది. రోజుకు సుమారు 2.1 లక్షల కిలోల సీఎన్‌జీ విక్రయాలు జరుగుతున్నాయని గ్యాస్‌ కంపెనీలు చెప్తున్నాయి. అలాగే సిటీలో 80కి పైగా సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు 60 వేల వాహనాలు సీఎన్‌జీని వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. సీఎన్‌జీ కేంద్రాల వద్ద వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.

సరిపోని దేశీయ ఉత్పత్తి
సహజ వాయువు వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ దేశీయ ఉత్పత్తి అవసరానికి సరిపోవడం లేదు. ఫలితంగా గ్యాస్‌ అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వస్తోంది. దేశీయ సహజ వాయువు ఉత్పత్తి రోజుకు 105-110 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లు (ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ) కాగా, మొత్తం గ్యాస్‌ అవ సరాలు రోజుకు 190-200 ఎమ్‌ఎమ్‌ ఎస్‌సీఎమ్‌డీలుగా ఉంది. రోజుకు దిగు మతులు (ఎల్‌ఎన్‌జీ) 90-100 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీలు చేసుకోవాల్సి వస్తుంది. అంటే దాదాపు 45 నుంచి 50 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర, అస్సాం, త్రిపుర, గుజరాత్‌ రాష్ట్రా ల్లో దేశానికి అవసరమైన గ్యాస్‌ ఉత్పత్తి జరుగుతోంది. దేశంలో మొత్తం గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌ వర్క్‌ సుమారు 24 వేల కి.మీ.,కు పైగా ఉంది.

చైనా మోడల్‌పై ఆరా
ప్రస్తుత గ్యాస్‌ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే విషయంపై అధ్యయనం చేసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు చైనాకు వెళ్లారు. చమురు సంక్షోభాన్ని అక్కడ ఎలా ఎదుర్కొంటున్నారనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అవసరమైతే పరిశ్రమల్లో సాంకేతికతను మార్చుకొనే అవకాశాలు పరిశీలిస్తున్నారు. అథెసివ్‌ టేప్‌ (అంటుకునే టేప్‌లు) ఉత్పత్తి పరిశ్రమలో గ్యాస్‌ ఫైర్‌ కీలకమైంది. ఇప్పటికే 70 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్న వాటిలో ఉత్పత్తి తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే వందశాతం పరిశ్రమలు మూతపడతాయని యాజమాన్యాలు చెప్తున్నాయి. జీడిమెట్ల, బొల్లారం పారిశ్రామికవాడల్లో ఈ తరహా పరిశ్రమలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -