– రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ ప్రథమ స్థానం
– కరువు కాటకాల నుంచి నిలబెట్టిన ‘పాడి’
– వ్యవసాయ అనుసంధానంగా అభివృద్ధి చేస్తే మరింత ఉపాధి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్ అంటేనే పాడికి ప్రసిద్ధి. కరువు కాటకాల సమయంలో అన్నదాతలు వలస బాట పట్టకుండా వెన్నుదన్నుగా ఆదుకున్నది పాడిపరిశ్రమ. నేడు అదే రంగం రైతుల పాలిట అభయ హస్తంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజుకు 2.30 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతున్నట్టు పశుసంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే పాడి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో నిలబెట్టింది. పాడిరంగంలో వందలాది మంది యువత ఉపాధి పొంది ఆర్థికంగా ఎదుగుతోంది. ప్రతిరోజూ లక్ష లీటర్లకు పైగానే విజయ డెయిరీ పాల సేకరణ చేస్తోంది. మరో 2.50 లీటర్లపాలను హోటళ్లు, ఇతర ప్రయివేటుకు అమ్ముతున్నారు.
నాగర్‌కర్నూల్, వనపర్తి పరిధిలో 10 పాలశీతలీకరణ కేంద్రాల్లో 55వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, వెల్దండ, కుప్పగండ్ల, కొండారెడ్డిపల్లి, మాడ్గుల, ఊరుకొండ, గుండూరు, వనపర్తి పరిధిలో అధిక పాల సేకరణ చేస్తారు. నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ పరిధిలో 6 పాలశీతలీకరణ కేంద్రాలుంటే.. నిత్యం 28 వేల లీటర్ల పాలను సేకరిస్తు న్నారు. ప్రయివేటు డెయిరీ ఫాంలో మరో 50 వేల లీటర్లు సేకరిస్తున్నారు. సేకరించిన పాలను హైదరాబాద్‌కు పంపు తారు. అక్కడ కోవా, మైసూర్‌పాక్, మిల్క్ కేకు, పెరుగు, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను తయారు చేస్తారు.
పాల ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం ఉపక్రమిస్తే.. వేలాది మంది ఈ రంగంలో ఉపాధి పొందుతారు. పశు సంవర్ధక శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాలో ఆవులు 22,143, గేదెలు 50,516 ఉన్నాయి. నారాయణపేట ఆవులు 12048, గేదెలు 30301, నాగర్‌కర్నూల్‌లో ఆవులు 52,401, గేదెలు 19,490, గద్వాలలో ఆవులు 19223, గేదెలు 86145 ఉన్నాయి. వనపర్తిలో ఆవులు 13244, గేదెలు 25303 ఉన్నాయి. ఆవులలో హెచ్‌ఎఫ్, జెర్సీ జాతికి చెందినవి ఉన్నాయి. గేదెలలో ముర్ర జాతికి చెందినవి అయితే అధిక దిగుబడులు వస్తాయి. ఆవులు అయితే 15లీటర్లకు పైగా, గేదెలు 10 లీటర్ల పాలను ఇస్తాయి.
ప్రభుత్వ సహకారమిస్తే..
పశుపోషణపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఈ రంగం మరింత అభివృద్ధి అవుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. ప్రధానంగా మేలు రకమైన జాతిని ఎంపిక చేయడం మొదలుకొని వాటికి దాణ, వ్యాధుల నివారణ చర్యలు తీసుకునే పశువైద్య రంగాన్ని విస్తరించాల్సి ఉంది. పాలను కొలిచే మిషన్ ప్రభుత్వమే అందజేయాల్సింది. ప్రతి కేంద్రంలో నిల్వ సామర్థ్యం పెంచాల్సింది. బ్యాంకులు రుణసదుపాయం కల్పించాలి.
ఇండియాలో పాలకు అధిక ధర
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పాలకు పాలమూరు పాలకు మంచి ధర ఉంది. ఇంత అధిక స్థాయిలో దేశంలో ఎక్కడా లేదు. ప్రభుత్వం యువ రైతులకు అవగహన కల్పించడంతోపాటు మేలు రకమైన బ్రీడ్ రైతులకు సరఫరా చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఉపాధికి మంచి అవకాశం
కేవీఎన్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్
పశుపోషణ ఉపాధికి మంచి అవకాశం. భార్యాభర్తలు ఐదు గేదెలు పెట్టుకుని ప్రతి నెలా రూ.30 నుంచి 40 వేలు సంపాదించుకోవచ్చు. యువ రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందాలి. బ్యాంకులనుంచి రుణసదుపాయం తీసుకోవచ్చు. తెలంగాణ లో ఉత్తమ పాల సేకరణ కేంద్రంగా మనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆగస్టు 15న ప్రశంసాపత్రం అందించారు.
కొండారెడ్డిపల్లిలో నూతన ఒరవడి
కొండారెడ్డిపల్లిలో పశువుల పెంపకం నూతన ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి ఇంట్లో రెండు లేక మూడు గేదెలు, ఆవులు ఉన్నాయి. వీటి ద్వారా పాలఉత్పత్తి జరుగుతోంది. కొండారెడ్డిపల్లి పాలశీతలీకరణ కేంద్రంలో ప్రతిరోజూ 11 వేల లీటర్ల పాలను పోస్తున్నారు. గేదెల ద్వారా నేను ప్రతి రోజూ 150 లీటర్ల పాలను పోస్తున్నాను. ఇది నాకు మంచి ఆదాయ వనరుగా మారింది.
సత్యనారాయణ యాదవ్
డీడీ పాల ఉత్పత్తుల సహకార కేంద్రం, నాగర్‌కర్నూల్



