విస్తరణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
బడ్జెట్‌లో భారీ కేటాయింపులకు అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత లభించనుంది. రాష్ట్ర రాజధాని నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక బడ్జెట్‌లో ‘హైదరాబాద్ మెట్రో’ విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించనున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టు పురో గతిని పర్యవేక్షిస్తుండటంతో, మెట్రో నెట్‌వర్క్ విస్తరణకు ఈ బడ్జెట్ ఒక మైలురాయిగా నిలవనుంది.
మెట్రో విస్తరణతో ప్రజా రవాణా పటిష్టం..!
హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం మెట్రో రైలు రెండో దశ(ఫేజ్-2) విస్తరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నగరం నలుదిశలా మెట్రోను విస్తరించడం ద్వారా ప్రజా రవాణాను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రెండో దశ ప్రణాళికలకు కేంద్రం నుంచి ‘ఇన్-ప్రిన్సిపల్’ ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఫేజ్-1 ప్రభుత్వ ఆధీనంలోకి..
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి సర్కారు పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మార్చి 31లోగా ఈ టేకోవర్ ప్రక్రియ ను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీని కోసం ప్రభుత్వం దాదాపు 15వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. మెట్రో ఆస్తులు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి రావడం వల్ల, ఇకపై మెట్రో విస్తరణ, నిర్వహణ మరింత వేగంగా, పారదర్శకంగా జరగనుంది.
మెట్రో రెండో దశ విస్తరణ
కొత్తగా ప్రకటించిన మెట్రో కారిడార్లు, ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, ప్రధాన నివాస ప్రాంతాలను కలిపే మార్గాలకు భారీగా నిధులు కేటాయించనున్నారు. ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన ‘మ్యాచింగ్ గ్రాంట్’ను ఈ బడ్జెట్‌లో చూపడం ద్వారా కేంద్ర నిధులను రాబట్టేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. మెట్రోతో పాటు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, పార్కింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర అనుబంధ నిర్మాణాల కోసం కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ప్రజా రవాణాపై భారీ ఆశలు
మెట్రో విస్తరణ వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ను మరింత పటిష్టం చేసేందుకు మెట్రో నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొంత సవాలుగా ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాల కల్పనలో వెనక్కి తగ్గకూడదని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపులు హైదరాబాద్ మెట్రో భవిష్యత్‌కు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.



