– సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యోగ,పెన్షనర్ సంఘాల కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దశాబ్దాల తమ చిరకాల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంతోపాటు రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వారు కొనియాడారు. 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందే విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అవకాశం లభించడం నిజంగా వరమని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఆలోచించి ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని అన్నారు. ముఖ్యమంత్రితోపాటు, మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు పి దామోదర్‌రెడ్డి, చావ రవి, జి సదానందగౌడ్, కె వెంకటేశ్వర్లు, ఉపేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, లక్ష్మయ్య, పి కృష్ణమూర్తి, ఉమాదేవి, వి రవీందర్‌రెడ్డి, గిరి శ్రీనివాస్‌రెడ్డి, ఖాదర్, టి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వావానికి ధన్యవాదాలు చెప్పారు. ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడం పట్ల హర్షం ప్రకటించారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
మా చిరకాల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



