నవతెలంగాణ – పెదవూర
పదేళ్ల పాఠశాల ప్రయాణం,వెలకట్టలేని స్నేహాలు కన్నతండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆగడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు. నల్గొండ జిల్లా వెల్మ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది.9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా మారింది. పాఠశాల ప్రాంగణంలో గడిపిన ప్రతి క్షణం విద్యార్థుల కళ్లముందు కదలాడాయి. తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరిస్తూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు పలువురి కళ్లు చెమర్చాయి.
ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు తమ జీవితాలకు వెలుగునిస్తాయంటూ విద్యార్థులు ఉద్వేగంగా ప్రసంగించారు.తరగతి గదిలో సందడి, ఆటస్థలంలో కేరింతలు, భోజనాలు పంచుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. రేపు పాఠశాల గంట మోగితే తాము ఇక్కడ ఉండమన్న ఆలోచన వారిని కలిచివేసింది. అయితే తమ సీనియర్ల భవిష్యత్ బంగారుమయంగా ఉండాలని 9వ తరగతి విద్యార్థులు ఆకాంక్షించి వారిని సాగనంపారు. వీడ్కోలు అంటే విడిపోవడం కాదు.. కొత్త శిఖరాలను అధిరోహించేందుకు చేసే మరో ప్రయాణం అని ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చీదేళ్ల శ్రీనివాస్ ఉపాధ్యాయులు వసంత కుమార్, రామకృష్ణారెడ్డి, హిమవంత్ రెడ్డి, రామాంజిరెడ్డి, వెంకటయ్య, సమత, శకుంతల, అయేషా, హరీష్ పదవ తరగతి విద్యార్థులు త్రివిక్రమ్, శివశంకర్, హేమంత్, సంజన, అర్పిత, ఇందు, శివ, భరత్ తదితరులు పాల్గొన్నారు.



