నూతన సర్పంచ్ కు అభినందనలు
91 వయసులో యువకుడిలా హైదరాబాద్ నుంచి బోనకల్ రాక
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే 1954లో బోనకల్లో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులగా విధులు నిర్వహించిన ప్రస్తుత విస్రాంత ప్రధానోపాధ్యాయులు దాములూరి వెంకట అప్పారావుని బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్, శిష్యులు గురువారం రాత్రి ఘనంగా శాలువాతో సన్మానించారు. దామలూరి వెంకట అప్పారావు బోనకల్ మండలంలో బోనకల్, చిరునోముల, రావినూతల, ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో చింతకాని మండలం నాగులవంచ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ఆ తర్వాత హైదరాబాదులో పలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులగా పనిచేశారు. 1975లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం హైదరాబాదులో కుటుంబంతో స్థిరపడ్డారు. ఈ క్రమంలో బోనకల్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ జ్యోతి పోటీ చేస్తుండగా ఆయన ప్రత్యేకంగా స్పీడు పోస్ట్ ద్వారా అభినందనలు తెలిపారు.
అనంతరం జ్యోతి సర్పంచిగా విజయం సాధించటంతో ఆమెను అభినందించడానికి ప్రత్యేకంగా హైదరాబాదు నుంచి బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జ్యోతిని గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని దీవించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన శిష్యులు, మాజీ సొసైటీ అధ్యక్షులు గుండాపనేని సుధాకర్ రావు, సర్పంచ్ బానోత్ జ్యోతి, ఉపసర్పంచ్ బానోత్ కొండ దామలూరు వెంకట అప్పారావుని సన్మానించాలని నిర్ణయించారు. సుమారు 71 సంవత్సరాల తర్వాత విద్యాబోధన చేసిన గ్రామానికి రావటంతో పాటు స్వస్థలం కూడా బోనకల్ కావడంతో మర్యాదపూర్వకంగా ఆయనను బానోత్ జ్యోతి, బానోతు కొండ, గుండపనేని సుధాకర్ రావు శాలువాతో ఘనంగా సన్మానించి తమ గురువు భక్తిని చాటుకున్నారు. 91 సంవత్సరాలు వయసు ఉన్న దామలూరి వెంకట అప్పారావు ప్రత్యేకంగా సర్పంచ్ ను అభినందించడానికి బోనకల్ రావడం విశేషం.
ఈ సందర్భంగా వెంకట అప్పారావు మాట్లాడుతూ బోనకల్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాడు కొండపల్లి కిషోర్ జిల్లాలోని అత్యధికంగా 760 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. ప్రస్తుతం ఓ మహిళ బోనకల్ గ్రామపంచాయతీ నుంచి జిల్లాలోని అత్యధికంగా 962 ఓట్ల మెజార్టీతో విజయం సాధించటం మహిళా లోకానికి, బోనకల్ గ్రామానికి గర్వకారణం అన్నారు. ఆమెను అభినందించడానికే ప్రత్యేకంగా తన వయసు సహకరించకపోయిన బోనకల్లు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట అప్పారావు కుమారులు ఆదిత్య, భరణి, వీరి క్లాస్ మెంట్స్ చేబ్రోలు రవి, రంగా జనార్దన్ రావు, కంఠసాని అప్పారావు, భూక్యా కృష్ణ, గ్రామస్తులు అంతటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.



