– 16 లక్షల మందితో సరికొత్త చరిత్ర
– ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్
– రాజ్యాంగాన్ని ‘పాకెట్ సైజు’లో అందించాలి :జస్టిస్ సుదర్శన్ రెడ్డి
– సెల్‌ఫోన్ల కంటే పుస్తకాల వైపే యువత మొగ్గు
నవతెలంగాణ – ముషీరాబాద్
అక్షరాల పండుగ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’కు పాఠకులు నీరాజనం పలికారు. పదకొండు రోజులపాటు జరిగిన ఈ అక్షరాల పండుగ రికార్డు స్థాయి సందర్శకులతో సోమవారం ముగిసింది. ఈనెల 19న బుక్‌ఫెయిర్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ముగింపు సభ జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి వాసు వార్షిక నివేదికను సమర్పించారు. గత ఏడాది 12 లక్షల మంది రాగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 16 లక్షలకు చేరుకుందని, అందులో 70 శాతం మంది యువతే ఉండటం విశేషమన్నారు. ఈ సందర్భంగా సభలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్దఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేధో అంతర్మథనానికి నిదర్శనమని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛకు ఈ వేదిక అద్దం పడుతోందని, గాంధీజీ నుంచి ఆయనను విమర్శించే వారి వరకు అందరి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండటం శుభపరిణామమని కొనియాడారు. పుస్తకాలు కేవలం సమాచారం కోసం కాకుండా, మనిషిలో స్వతంత్ర ఆలోచనలను రేకెత్తించే సాధనాలుగా ఉండాలని లోహియా మాటలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు ఒక కీలక సూచన చేశారు. భారత రాజ్యాంగాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో పాకెట్ సైజు ప్రతిగా ముద్రించి, అతి తక్కువ ధరకు వచ్చే ఏడాది అందుబాటులో ఉంచాలని కోరారు. ఇందుకు ఎవరూ ముందుకు రాకపోతే తాను స్వయంగా తోడ్పాటు అందిస్తానని ప్రకటించారు. అదేవిధంగా, వేదికలపై మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సమానత్వం గురించి కేవలం మాటల్లో కాకుండా, పుష్ప చక్రపాణి వంటి మేధావులను వేదికలపైకి ఆహ్వానించి ఆచరణలో చూపాలని హితవు పలికారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ‘విశ్వవిద్యాలయాల పరిశోధనా పత్రాలను ప్రజలకు చేరువ చేయాలి. కేవలం అమ్మకాలే కాకుండా కులతత్వం, మతత్వం వంటి సామాజిక సమస్యలపై లోతైన చర్చలు నిర్వహించి పాఠకులలో అవగాహన కల్పించాలి’ అని అన్నారు. 368 స్టాళ్లతో సాగిన ఈ మేళాను ఒక ‘మిలియన్ మార్చ్’గా అభివర్ణించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ”ఆర్థిక రంగంలో కంటే పుస్తక పఠనంలో మనం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలి. వ్యవసాయ, పశుసంవర్ధక పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తేవాలి. పుస్తక విరాళాల కార్యక్రమం ఒక గొప్ప సామాజిక ఆశయం’ అని అన్నారు. పఠనాసక్తిలో భారత్ త్వరలోనే అమెరికాను తలదన్ని అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ”యువత మద్యం, గంజాయి వంటి వ్యసనాలను వీడి పుస్తక పఠనాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. తలవంచుకుని పుస్తకం చదివితే సమాజంలో తలెత్తుకుని జీవించే శక్తి లభిస్తుంది” అని సూచించారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ”హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను అంతర్జాతీయ స్థాయి ‘లిటరరీ ఫెస్టివల్’గా మార్చాలి. జాతీయ మేధావులను ఆహ్వానించి విభిన్న విచారధారలపై పది రోజులపాటు చర్చలు నిర్వహించాలి” అని కోరారు. రమా మెల్కోటే మాట్లాడుతూ.. ”ప్రతి ఏటా స్టాళ్ల ఏర్పాటు వ్యయాన్ని తగ్గించేందుకు స్టేడియంలో శాశ్వత కట్టడాలు నిర్మించాలి. విద్యా వ్యవస్థను అకడమిక్ పరంగా అభివృద్ధి చేయడానికి ఈ ఉత్సాహాన్ని ప్రేరణగా తీసుకోవాలి” అని సూచించారు. చాకలి ఐలమ్మ వర్సిటీ వీసీ ప్రొ.సూర్య ధనంజరు తదితరులు పాల్గొని ప్రదర్శన విజయవంతంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ మాట్లాడుతూ.. ”పుస్తక ప్రదర్శన కేవలం మేళా కాదు, సామాజిక చైతన్య కేంద్రం. యువత అక్షరాల పండుగకు ఇస్తున్న గౌరవం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సూచిక. 38 ఏండ్ల ఈ ప్రయాణంలో పాఠకుల ఆదరణ మరువలేనిది” అని అన్నారు. బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.వాసు మాట్లాడుతూ.. ”11 రోజుల్లో 16 లక్షల మందిని ఆకర్షించి పాత రికార్డులను తిరగరాశాం. 450 స్టాళ్లను పారదర్శక లాటరీ పద్ధతిలో కేటాయించాం. సోషల్ మీడియా ద్వారా పాఠకులే ఈ వేడుకను ప్రజల ఉత్సవంగా మార్చారు” అని అన్నారు. బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ”280 మందికి పైగా కవులు రచయితలు ఈ వేదికపై మాట్లాడారు.. అదే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు గర్వకారణం. పల్లెకు పుస్తకం అనే నినాదంతో పుస్తకాల డొనేషన్లు కోరగా కొన్ని వేల పుస్తకాలు రావడం గొప్ప విషయం” అని చెప్పారు.
పుస్తక జాతరకు పాఠకుల నీరాజనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



