Sunday, April 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమహిళల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు

మహిళల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు

- Advertisement -

”డాక్టర్‌వి అయ్యావు, యాక్టర్‌వి అయ్యావు, కలెక్టర్‌వి అయ్యావు, మినిస్టర్‌వి అయ్యావు..ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటీ నువ్వు చేయలేనిది” అని ప్రజాకవి దేవేంద్ర చెప్పినట్టు నేటి మహిళ ఎదుగుదలలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పాత్ర ఎనలేనిది. స్త్రీల హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కులం దుర్మా ర్గాన్నే కాదు స్త్రీ మీద అణచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక సమాజం అభివృద్ధి చెందిందని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. మహిళలకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన అతిగొప్ప కానుక హిందూ కోడ్‌ బిల్‌. ఈ బిల్లుతో మన దేశంలోని ఆడవారి సామాజిక బతుకు చిత్రాన్నే ఆయన మార్చేశారు. ఆస్తి అనగానే దాని మీద కేవలం అబ్బాయిలకే హక్కు ఉంటుందనుకునే రోజుల్లో ఆ అభిప్రాయానికి పాతరేశారు. కుటుంబ ఆస్తిలో మగ పిల్లలకు ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. బహు భార్యత్వాన్ని రద్దుచేశారు. మహిళలకు హక్కులు కల్పించే దిశలో వాళ్ల స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చారు. భర్తతో తేడాలు వస్తే విడాకుల ద్వారా పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాన్ని హిందూ కోడ్‌ బిల్లు ద్వారా అంబేద్కర్‌ కల్పించారు.

మహిళా హక్కులకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన హిందూ కోడ్‌ ముసాయిదా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి అంబేద్కర్‌ పంపగా సంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్‌లోని నెహ్రూ వర్గం బిల్లుకు మద్దతు పలికితే, మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంటులో 1951 ఫిబ్రవరి 5న అంబేద్కర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. 1952 లోక్‌సభ ఎన్నికల తరువాత బిల్లును ఆమోదింపచేస్తానని అప్పటి ప్రధాని పండిట్‌ నెహ్రూ హామీనిచ్చారు. అయితే నెహ్రూ కేబినెట్‌లోని అనేకమంది మంత్రులు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అంబేద్కర్‌ 1951 సెప్టెంబర్‌ తొమ్మిదిన కేంద్ర న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆడవారి హక్కుల కోసం కేంద్రమంత్రి వంటి పెద్ద పదవిని వదులుకున్న మహిళా పక్షపాతిగా అంబేద్కర్‌ చరిత్రలో నిలిచి పోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో 1955-56 మధ్య కాలంలో అంబేద్కర్‌ రూపొందించిన హిందూ కోడ్‌ ముసాయిదా బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే అంబేద్కర్‌ బిల్లులో ఉన్న సీరియస్‌నెస్‌ను కాస్తంత తగ్గించారు.

ఆడవారిని మగవాళ్లతో సమానంగా చూడాలని రాజ్యాంగం, చట్టాలు ఎన్ని చెప్పినా ఆడవాళ్లపై లైంగికదాడులు నేటికీ తగ్గడం లేదు. అమ్మాయిలకు భద్రతపై జాగ్రత్తలు చెప్పడమే కాదు అబ్బాయిలకు ఆడవాళ్లను గౌరవించడాన్ని నేర్పించాల్సిన పరిస్థితు లొచ్చాయి. మహిళల రక్షణకు రాజ్యాంగం పూచీకత్తుగా నిలిచినా, మారు తున్న కాలానికి తగ్గట్టు ఎన్ని కొత్తచట్టాలు వచ్చినా ఏదో ఒక రూపంలో కనిపించని వివక్ష కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యం గా పల్లెల్లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే బయటకు వస్తున్న వి కేవలం కొన్నే. వెలుగుచూడని దారుణాలు ఎన్నెన్నో పరువు పోతుందన్న కారణంతో కొందరు, సొసైటీలో చులకన అవుతామన్న భయంతో మరికొందరు ఇలా దారుణాలకు గురైనా బయటకు కూడా చెప్పుకోవడం లేదు. కొన్ని కేసులు కోర్టుల వరకు వెళ్లినా చట్టాల్లోని లోపాలను సాకుగా చేసుకుని నిందితులు తప్పించుకుంటున్నారు.అసలు చట్టాల అమల్లోనే చిత్తశుద్ధి ఉండటం లేదు. మొత్తం మీద అసలు కేసుల నమోదు నుంచి విచారణ వరకు అన్ని స్థాయిల్లో లోపాలు జరుగుతున్నాయి. దారుణాలకు పాల్పడ్డ వారు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు.
జనాభాలో యాభైశాతం ఉండే మహిళలను ఆకాశంలో సగం అంటున్నారు.అయితే ఇది కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఆకాశంలో సగం అంటున్నామే, కానీ ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను ఇవ్వడం లేదు. అనేక రంగాల్లో మహిళలు ఇంకా సాధికారితను సాధించాల్సి ఉంది. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ మహిళలు స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటమే సాధికారత. ఇది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది. స్త్రీ, పురుష సమానత్వాన్ని ఆమోదించడం. మహిళల సంపూర్ణ అభివృద్ధిని వాళ్ల హక్కుగా గుర్తించడం. ఈ మహిళా సాధికారత కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్‌ను అంబేద్కర్‌ పొందుపరిచారు. మహిళల పట్ల వివక్షను అంతం చేస్తూ రూపొందించిందే ఆర్టికల్‌ 15(3). అలాగే ఆడ, మగ అనే వివక్ష లేకుండా అందరూ జీవనోపాధి పద్ధతులను కలిగి ఉండటానికి 39 (ఎ) ఆర్టికల్‌ను ప్రవేశపెట్టారు. మన దేశంలో చాలా కాలం పాటు ఒకే పనిని ఆడ, మగ ఇద్దరూ చేసినా వేతనం విషయంలో వివక్ష ఉండేది. మగవాళ్లకు ఎక్కువ వేతనం, ఆడవారికి తక్కువ వేతనం ఇచ్చేవాళ్లు. ఈ దుర్మార్గానికి అంతం పలికారు అంబేద్కర్‌. ఏప్రిల్‌ 14 ఆయన జయంతి సందర్భంగా అంబేద్కర్‌మ ఆశయాలను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగాలి.
– నాదెండ్ల శ్రీనివాస్‌, 9676407140

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -